బాబూజీ - విశిష్ఠ ఆధ్యాత్మిక పరిశోధనలు - 3
అందుకే బాబూజీ, సమర్థుడైన గురువు లభించి, సాధకుడు అటువంటి గురువుతో అనుసంధానం ఏర్పరచుకున్నట్లయితే ఇది ఒక్క జన్మలోనే సుసాధ్యం అంటారు. బాబూజీ తనకు అందుబాటులో ఉన్న అనంతమైన దివ్యయశక్తితో అభ్యాసిలో నిద్రాణమైన ఆధ్యాత్మిక శక్తులను మేలుకొల్పడం చేస్తారు. ఈ విధంగా, శుద్ధీకరణ ప్రక్రియ సహాయంతో ఈ స్థూల శరీరంలోని ప్రతీ అణువణువునూ పునర్నిర్మిస్తూ అస్సలు భౌతికత్వం జాడ లేకుండా ఉండేంతవరకూ, ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. ఆ విధంగా ఆ శరీరం కనిపించడానికి మామూలుగానే ఉండి, శరీర ధర్మాలు కూడా ఎప్పటిలాగే ఉన్నప్పటికీ, నిజానికి మాత్రం ఇప్పుడది పూర్తిగా ఆధ్యాత్మిక శరీరం అయిపోతుంది. అటువంటి పరిశుద్ధ శరీరం పంచకోశాల శరీరానికి అతీతమైనది. అటువంటి శరీరమే ముక్తి కలిగిన ఆత్మ తన నివాసంగా ఏర్పరచుకో గలిగిన శరీరం. ఆ విధంగా సదేహ ముక్తి లభించడం జరుగుతుంది. సహజమార్గ సాంప్రదాయంలో అటువంటి సదేహముక్తి లభించిన ఆత్మ ఈ ఆధ్యాత్మిక శరీరంలో భూమ్మీద ఉండవలసినంత కాలం ఉండగలుగుతుంది. కాబట్టి సహజమార్గంలో ముక్తి కోసం, మృత్యువు ఆసన్నమయ్యే వరకూ వేచి ఉండనక్కర్లేదు. ఈ అసాధ్యాన్ని బాబూజీ తన ప్రాణాహుతి శక్తి ద్వారా సుసాధ్యం చేస్తారు.
మరొక గంభీరమైన పరిశోధన - "భగవంతునికి మనస్సు లేదు" అనడం. భగవంతునికి మనసు ఉన్నట్లయితే ద్వంద్వాలున్నట్లే; అంటే భగవంతుడు కూడా కర్మకు గురైనట్లే; కర్మకు గురవడమూ అంటే జన్మమృత్యువులకు లోనైనట్లే. ఇది అర్థం లేనిది కాబట్టి భగవంతునికి మనసు లేదు అన్నది వారి అనుభవపరమైన సత్యం. అందుకే ప్రకృతి కార్య నిర్వహణకు స్వచ్ఛమైన, పవిత్రమైన మనస్సు గల మానవుడు ప్రకృతికి అవసరమవుతాడు. ఆయన భగవంతుని పరికరమవుతాడు.
ఈ విధంగా బాబూజీ ఆధ్యాత్మిక రంగంలో చేసిన పరిశోధనలు అనేకం ఉన్నాయి. అవన్నీ మాటల్లో వ్యక్త చేయడం అసాధ్యం. అవి కేవలం 'అనుభవశక్తి' పరంగా మాత్రమే అనుభవంలోకి వస్తాయి.
బాబూజీ ఆవిష్కరించిన విప్లవాత్మక శోధనలు అయిదు గ్రంథాలలో శాశ్వతంగా నిక్షిప్తమై ఉన్నాయి - 1) సత్యోదయం, 2) రాజయోగము దృష్ట్యా సహజమార్గ ప్రభావము, 3) సహజమార్గ దశనియమాలపై వ్యాఖ్య, 4) అనంతము వైపు, 5) సహజమార్గ దర్శనం, అనే అయిదు ఉద్గ్రంథాలు. వారి ప్రకారం వీటిని భవిష్యత్తులో వచ్చే మానవుల కోసం వ్రాసినవి; వారికే అర్థమవుతాయట. బహుశా ఆ భవిష్యత్తు వచ్చేసినట్లుంది. పూజ్య దాజీ ఈ గ్రంథాలను మనందరమూ సరళంగా అర్థం చేసుకునేలా "స్పిరిచ్యువల్ అనాటమీ" అనే గ్రంథాన్ని తేలికగా అర్థమయ్యే భాషలో వ్రాసి అనుగ్రహించారు. తప్పక ఆధ్యాత్మిక సాధకులందరూ చదివి కృతార్థులవ్వాలని ప్రార్థిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి