మూర్తీభవించిన శూన్యత్వం – బాబూజీ
అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అందరికీ 2024 నూతన సంవత్సర
శుభాకాంక్షలు.
శ్రీరామ చంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆధ్యాత్మిక క్షేత్రంలో సహజమార్గం అనే విప్లవాత్మక పద్ధతిని ఆవిష్కరించిన సమర్థ గురువు పూజ్య బాబూజీ మహారాజ్ గారి 125వ జయంత్యుత్సవం హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ సాధకులందరూ జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా సంవత్సరమంతా వారి ప్రత్యేక స్మరణలో గడిపే ప్రయత్నంలో ఉన్న అభ్యాసులందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక ఆధ్యాత్మికాభినందనలు.
శ్రీరామ చంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆధ్యాత్మిక క్షేత్రంలో సహజమార్గం
అనే విప్లవాత్మక పద్ధతిని ఆవిష్కరించిన సమర్థ గురువు పూజ్య బాబూజీ
మహారాజ్ గారి 125వ జయంత్యుత్సవం హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ
సాధకులందరూ జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా సంవత్సరమంతా వారి
ప్రత్యేక స్మరణలో గడిపే ప్రయత్నంలో ఉన్న అభ్యాసులందరికీ ప్రత్యేకమైన
హృదయపూర్వక ఆధ్యాత్మికాభినందనలు.
అసలు బాబూజీ మహారాజ్ గారిని “వారు ఇది” అని అభివర్ణించే ప్రయత్నమే ఒక దుస్సాహసం. అయితే వారిని భౌతికంగా దర్శించిన గంభీరమైన సాధకుల ద్వారా, వారి జీవన విధానాన్ని ప్రత్యక్షంగా దర్శించినవారు వారితో స్వయంగా జరిపిన సంభాషణల ద్వారా, వారి బోధనల ద్వారా, వారి గ్రంథాల ద్వారా, వారు పలికిన వాక్కుల ద్వారా, వారి కృపచే తయారైన చారీజీ, దాజీ వంటి మహత్తర వ్యక్తిత్వాల జీవితాల ద్వారా, వారిపై ధ్యానించిన వ్యక్తుల ద్వారా, వెరసి వీరందరి ద్వారా కలిగిన స్వీయ అవగాహన ద్వారా ఆ మహాపురుషుని దర్శించడానికి చేసే దుస్సాహసమే ఈ చిన్ని ప్రయత్నం.
సృష్టికి పూర్వం ఉన్నది శూన్యమేనని అందరూ అంగీకరిస్తున్నదే. శాస్త్ర విజ్ఞానాన్ని అనుసరించి చూసినా, బాబూజీ వంటి ఆధ్యాత్మిక తత్త్వవేత్తలను అనుసరించి చూసినా, శూన్యం నుండే సర్వమూ ఉద్భవించిందనడానికి ఇక ఏ మాత్రమూ సందేహపడనవసరం లేదు.
పూజ్య చారీజీ చెప్పినట్లుగా, ఒక చిన్న విత్తులో మర్రి చెట్టు దాగి ఉంది; అదెక్కడుందోనని ఆ విత్తును రెండుగా విడదీసి చూసినట్లయితే ఏమీ కనిపించదు. కానీ ఆ శూన్యంలో నుండే అంత పెద్ద వటవృక్షం వస్తుంది మరి. సృష్టి కూడా అంతే. అంటే మనమూ మన చుట్టూ ఉన్న అస్తిత్వం కూడా అంతేఆ శూన్యత్వం నుండే వచ్చింది.
విజ్ఞానశాస్త్రపరంగా శూన్యం (వాక్యూమ్) అనేది గాలి కూడా లేనటువంటి పరిస్థితి. ఆ స్థితి చాలా శక్తివంతమైనది. అన్నిటినీ తనలోకి పీల్చేసుకుంటుంది, ఇముడ్చేసుకుంటుంది (బ్లాక్ హోల్స్ లా). అటువంటి శూన్యస్థితులు సముద్రాలలో ఏర్పడటం వల్లే మనకు తుఫాన్లు, సునామీలు, వంటి భీభత్సాలు సంభవిస్తూ ఉంటాయి. ఇది భౌతికపరమైన శూన్యత్వం.
అలాగే మనుషుల్లో ఉండే కామక్రోధలోభమోహమదమాత్సర్యాలు, కోరికలు, సంస్కారాలు, అహంకారము, సుగుణాలు, దుర్గుణాలు ఇలా సమస్తమూ పోయినప్పుడు కలిగే, ఏమీ లేనటువంటి స్థితిని ఏమనాలి? దాన్ని కూడా శూన్యత్వం అనే అంటాం, ఆధ్యాత్మిక శూన్యత్వం అంటే అదే. దాన్నే నామరూపగుణ రహిత తత్త్వం అని కూడా అంటాం. నిర్గుణ, నిరాకార, నిర్మమకార, నిరహంకార స్థితి. ఈ స్థితి మనిషి హృదయంలో నెలకొన్నప్పుడు భగవత్కృపను ఊహకందని విధంగా ఆకర్షించడం జరుగుతుంది. దైవమయం అయిపోతాడు మనిషి. శూన్యత్వానికి ప్రతిరూపమైపోతాడు వ్యక్తి. అపార శక్తివంతమైనది ఈ స్థితి. అన్నిటికీ అతీతమైనది. అస్సలు ఊహకందనిది, జ్ఞానానికి కూడా అందనిది, జ్ఞానానికి అతీతమైనది. భౌతికపరమైన శూన్యత్వంతో పోల్చ లేనిది. సాధకుడు ఈ విధంగా తయారయ్యే క్రమాన్నే సహజమార్గ ధ్యానపద్ధతిలో వ్యక్తిగత ప్రళయం అని అంటారు. ఇటువంటి శూన్యత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం పూజ్య బాబూజీ మహారాజ్. అందుకే వీరిని స్పెషల్ పర్సనాలిటీ (విశిష్ఠ వ్యక్తిత్వం) అని కూడా అంటారు. స్పెషల్ పర్సనాలిటీ అంటే ఎవరు? అని ఎవరో ప్రశ్నించినప్పుడు బాబూజీ - అది అతి గోప్యమైన విషయం అన్నారు. ఇటువంటి వ్యక్తిత్వాలు పదివేల సంవత్సరాలకొక సారి ఈ భూమ్మీదకు వస్తూ ఉండటం జరుగుతూ ఉంటుందట. మరల అటువంటి వ్యక్తిత్వం వచ్చే వరకూ, ఈ లోకసంరక్షణ కోసం అన్ని సంవత్సరాలకు సరిపడ, చేయవలసిన నిగూఢ ఆధ్యాత్మిక కార్యాలను నిర్వహించి వెడతారట. నిగూఢ ధ్యానస్థితుల్లో సుస్థిరముగా నిలబడినవారు, వీరు నిర్వహించిన కార్యాలను దర్శించగలుగుతారని బాబూజీ చెప్పడం జరిగింది.
ఆ శూన్యత్వాన్ని ప్రతిబింబించే విధంగా బాబూజీ పలికిన కొన్ని వాక్యాల ద్వారా, ఆయనను ప్రార్థనాపూర్వకంగా దర్శించే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వాక్యాలను, బాబూజీ నోటి వెంట వెలువడిన మహావాక్యాలుగా చెప్పుకోవచ్చుననిపిస్తుంది. ఈ క్రింది మహా వాక్యాలపై ధ్యానించడం ద్వారా ఆయన తత్త్వం కొంతవరకూ అయినా దర్శించగలవేమో ప్రయత్నిద్దాం.
ఒకసారి ఎవరో బాబూజీని “అసలు మీరెవరు?” అని అడిగారట. దానికి వారు, “నేను నేను అని అన్నప్పుడు, అది నన్ను సూచిస్తున్నదో, లేక నా గురువును సూచిస్తున్నదో లేక ఆ దైవాన్ని సూచిస్తున్నదో నాకు తెలియదు” అన్నారట. కాస్త ధ్యానించి చూడండి ఈ వాక్యాన్ని. వారి నోటి వెంట వచ్చే ఆ పలుకులు ఎటువంటి నిగూఢ ఆధ్యాత్మిక స్థితి నుండి వెలువడుతున్నాయో దర్శించే ప్రయత్నం చేయండి.
మరో వాక్యం ..
“నాకు శాంతి అంటే ఏమిటో తెలియదు. శాంతి అంటే ఏమిటో తెలియనప్పుడు, నేను భగవంతుడిని శాంతి కావాలని ఎలా కోరుకోగలను? ఒకవేళ కోరుకోవలసి వస్తే ఆ శాంతినిచ్చేవాడినే కోరుకుంటాను.” అన్నారు బాబూజీ ఒకసారి. కాస్త ధ్యానించి ఈ వాక్యంలో ఉన్న నిగూఢ అనుభూతిని పొందే ప్రయత్నం చేయండి.
ప్ర: గడచిన కొన్ని యుగాల్లో అవతార పురుషులు చేసిన కార్యాలను గురించి మీ వ్యాఖ్యలు?
బాబూజీ: అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడు సమాజంలో నైతికతకు, సంస్కృతికి పునాదులు ఏర్పరచాడు. శ్రీకృష్ణభగవానుడు ఆ పునాదిపై నిర్మాణం చేస్తూ సాధనలో భక్తి తత్త్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. శ్రీకృష్ణుడికి పూర్వం ఈ భక్తి అనే అంశం ఉండేది కాదు. కాబట్టి ప్రతీ అవతార పురుషుడు ఇంతకు ముందు అవతారం చేసిన పనికి మరింత మెరుగైన అంశాన్ని జోడిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. ఇదీ క్రమం. ఒక రకంగా చూసినట్లయితే, ఒక్కొక్క అవతారం అంతకు ముందు అవతారం కంటే గొప్పదని చెప్పవచ్చు. ఈ అర్థంలో పరికిస్తూ శ్రీకృష్ణావతారం, శ్రీరామావతారం కంటే గొప్పదిగా పరిగణించేవారు కూడా ఉన్నారు.
కానీ, మరో అర్థంలో గనుక చూస్తే, ఎక్కువ, తక్కువ అనే ఆలోచనలు సరైనవి కావని అర్థమవుతుంది. ప్రతీ అవతారము ఆయా కాలాలకి తగినటువంటి అవసరాలను నెరవేర్చడం కోసం దిగిరావడం జరిగిందని అర్థమవుతుంది. అటువంటప్పుడు ఒక అవతారం గొప్పది, మరొక అవతారం తక్కువది ఎలా అవుతుంది? కేవలం అవసరాలు మాత్రమే ఎక్కువ, తక్కువ ఉంటాయి కానీ అవతారాల్లో ఎక్కువ-తక్కువ ఉండవు. .
ఈ సమాధానాన్ని కాస్త ధ్యానించి చూడండి. ఇటువంటి సమాధానాలు ఎవరు ఇవ్వగలరో శోధించి చూడండి.
ప్ర: సంస్థలో సభ్యుల సంఖ్య ఎందుకు పెరగాలనుకుంటున్నారు? ఆరుగురో-ఏడుగురో ఉంటే సరిపోదా?
బాబూజీ: చూడు నాయనా! నేను ఆనంతత్వం నుండి వచ్చాను, కాబట్టి నాలో అనంతత్వం యొక్క బీజం ఉంది. అలాగే నేనేం చేసినా సహజంగానే అనంతత్వం నాతోపాటు ఉండాలనుకుంటాను. అలాగే అందరికీ ఉండాలనుకుంటాను. చివరికి ఒక దొంగ కూడా తనతోపాటు చాలా మంది ఉండాలనుకుంటాడు. ఇది కూడా అతనిలో ఉన్న ఆ అనంతత్వం యొక్క ప్రభావమే, కాకపోతే తప్పుడు దిశలో పని చేస్తోంది. మరో విషయం చెబుతున్నాను మీకు: భగవంతుని శక్తిని పాక్షికంగా వినియోగించకూడదు, సంపూర్ణంగా వినియోగించాలి. కానీ నేను అనేది ఉన్నంత వరకూ పూర్తి శక్తిని వినియోగించడం సాధ్యపడదు. కాబట్టి నేను అన్నది పోగొట్టుకోవాలి, అప్పుడే పూర్తి శక్తి వినియోగంలోకి వస్తుంది. కానీ దాన్ని అదుపులో ఉంచుతూ వినియోగించుకోవలసి ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది.
కాస్త ధ్యానించి చూడండి ఈ సమాధానాన్ని.”ఆనంతత్వం నుండి వచ్చాను” అని ఎవరు అనగలరో శోధించి చూడండి.
ఇప్పుడొక చిన్ని కథ చెప్పుకుందాం, బాబూజీ స్వయంగా చెప్పిన కథ. పూజ్య బాబూజీ శతజయంత్యుత్సవాల సందర్భంగా, ఏప్రిల్ 30, 1999 న వెలువడిన “ది బిలవెడ్ రిమెంబర్డ్” అనే పుస్తకంలో, సోదరులు ఎస్. ఎ. సర్నాడ్ జీ, వ్రాసిన బాబూజీ స్మృతి-వ్యాసంలో ఉటంకించిన కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం.
ఈ కథ ద్వారా శూన్యత్వం ఎంత శక్తివంతమైనదో, శూన్యత్వం వ్యక్తిని ఎంత వినమ్ర వ్యక్తిగా మారుస్తుందో, బాబూజీ వ్యక్తిత్వం ఏ విధంగా అటువంటి మూర్తీభవించిన శూన్యత్వమో దర్శించే ప్రయత్నం చేద్దాం.
ఈ కథ యొక్క సందర్భం: సర్నాడ్ జీ ఒకసారి షాజహానుపూర్ లో బాబూజీ సాన్నిధ్యంలో ఉండగా, బాబూజీ ఇలా అన్నారట, “సర్నాడ్, నీకు తెలుసా, పార్థసారథి మన పద్ధతిని గురించి, నా గురించి, ఇంకా ఇతర విషయాల గురించి ఎన్నో పుస్తకాలు వ్రాశాడు. ఆ పుస్తకాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి, ఎంతో జ్ఞానం ఉంది వాటిల్లో, ఎంతో సమాచారం ఉంది, ఎంతో విద్య ఉంది; కానీ అలా వ్రాయడానికి అవసరమైన జ్ఞానాన్నంతా నేనే ఇచ్చాననుకుంటున్నాడు అతను. ఇక్కడ (తన హృదయాన్ని సూచిస్తూ) ఉన్నదంతా శూన్యమేనని అతనికి తెలియడం లేదు. అంతా “ఠన్ ఠన్ గోపాలే” అంటూ ఒక కథను వినిపించారు. “ఠన్ ఠన్ గోపాల్” అంటే ఏమీ లేదని అర్థం. ఈ పదబంధాన్ని ఉత్తర భారతంలో ఏమీ లేదని చెప్పడానికి వినియోగిస్తూ ఉంటారు.
ఒక సన్న్యాసుల మఠం ఉండేది; అక్కడ ఒక మహాత్ముడి సమాధి ఉండేది; అక్కడే, ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధుడైన ఒక మహాత్ముడు కూడా ఉండేవాడు.
అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో, ఆయన వద్దకు ఒక శిష్యుడు యేదో నేర్చుకుందామని వచ్చి, ఆయనతోపాటు కొంతకాలం ఉన్నాడు. అతని విద్యాభ్యాసం పూర్తయిన తరువాత వీడ్కోలు పలుకవలసిన రోజు వచ్చినప్పుడు, గురువు తన శిష్యుడికి ఒక గాడిదపిల్లను కానుకగా ఇవ్వడం జరిగింది. గురువు నుండి కానుకగా అందుకోవడం వల్ల, ఆ గాడిదపిల్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు శిష్యుడు. దురదృష్టవశాత్తు ఆ గాడిద పిల్ల దారిలో చనిపోతుంది. శిష్యుడు చాలా విచారంలో మునిగిపోతాడు; కడు దుఃఖానికి గురవుతాడు. “నేను పాపాత్ముడిని! అందుకే ఇలా జరిగింది” అంటూ తనను తాను నిందించుకుంటూ దుఃఖిస్తాడు. అలా ఎంత సేపని ఏడుస్తాడు? ఎలాగో ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ గాడిదపిల్లను ఒక చెట్టు క్రింద గొయ్యి త్రవ్వి అక్కడ పూడుస్తాడు. ఆ చెట్టు క్రిందే నిద్రాహారాలు లేకుండా, ఇక పట్టణంలోకి ప్రవేశించకుండా అక్కడే ఉండిపోతాడు. ఇలా కొంత కాలంగడిచింది.
ఆ దారిలో వెళ్తున్నవారందరూ ఈ శిష్యుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఉండటం గమనించారు. అతనికి ఆకలి వేస్తుందని అక్కడ పండ్లుంచి వెళ్ళేవారు. శిష్యుడు కళ్ళు తెరిచినప్పుడు పండ్లు కనిపిస్తే సంతోషించి, నిజంగా బాగా ఆకలిగా ఉండటం వల్ల వాటిని తిని తన గురువుకు కృతజ్ఞతను వ్యక్తం చేసుకునేవాడు. ఆ తరువాతి రోజు కూడా అలాగే జరిగింది. కొద్ది రోజుల్లోనే అక్కడ భక్తులు పొడుగాటి క్యూలలో నిలబడి పండ్లు, డబ్బు అన్నీ సమర్పిస్తూ వచ్చారు. “ఇది చాలా బాగుందే! గురుదేవులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి” అనుకున్నాడు శిష్యుడు. కొన్ని నెలలలోనే ఆ గాడిదపిల్లను పాతిపెట్టిన చోట ఒక ఆలయనిర్మాణం జరిగిపోయింది. అది ఒక మఠంగా మారిపోయింది. ఈ శిష్యుడు ఒక గురువైపోయాడు. అతని పేరు నలుదిశలా ప్రాకి ప్రసిద్ధుడైపోయాడు. ఎంత ప్రసిద్ధుడైపోయాడంటే, ఈ సమాచారం ఆతని గురువు దాకా వెళ్ళింది. ఆయన కూడా ఈతని పేరు-ప్రఖ్యాతుల గురించి వినడం జరిగింది. “నా శిష్యుడు నాకంటే ఎక్కువగా పేరు గడించడానికి గల కారణం ఏమిటో, ఏం చేశాడో, ఏమి చేస్తున్నాడో?” తెలుసుకుందా మని సంకల్పించుకుంటాడు. అలా ఆ ముదుసలి గురువు తన శిష్యుని ఆశ్రమానికి వస్తే ఆయనను ప్రవేశించనీయకుండా ఆపేస్తారు; మరునాడు మాత్రమే కలిసే అవకాశం ఉందని ఆ ముదుసలి గురువుకు తెలియజేయడం జరుగుతుంది.
ఈ సమాచారం శిష్యునికి తెలుస్తుంది. “అయ్యో, ఆయన నా గురువు! ఆయనని అలా వేచి ఉండేలా చేయకూడదు” అనుకుంటూ పరుగెత్తుకొని వచ్చి, ఆయన పాదాలపై సాష్టాంగ నమస్కారం చేసి క్షమించమని కోరతాడు. “క్షమించండి! మిమ్మల్ని వేచి ఉండేలా చేశాను. దానికి చాలా విచారిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి” అంటూ ప్రాధేయపడి, గురువుగారిని లోపలికి తీసుకువెళ్ళి సకల మర్యాదలు, సేవలు చేస్తాడు. అప్పుడు నెమ్మదిగా ఆ గురువు తన శిష్యుడిని దగ్గరకు పిలిచి, “నీకు ఈ పేరు-ప్రసిద్ధులు రావడానికి కారణం ఏమిటి?” అని అడుగుతాడు.
దానికి ఆ శిష్యుడు, “అయ్యా, నన్ను మీరు క్షమించాలి, మీరు బహూకరించిన కానుకను పోగొట్టుకున్నాను. మీరు నన్ను క్షమించాలి” అని పశ్చాత్తాపపడుతూ వేడుకుంటాడు. “మీ అనుగ్రహం చేతనే ఈ పేరు-ప్రఖ్యాతులొచ్చాయి. మీరిచ్చిన కానుక వల్లే; అది చనిపోతే ఇక్కడ పాతిపెట్టాను; దానిపై ఈ మఠాన్ని నిర్మించడం జరిగింది. అందుకే ఇదంతా జరుగుతోంది” అన్నాడు.
అప్పుడు గురువు ఎంతో దయతో, “బాధపడకు నాయనా! ఇందులో విచారించవలసినదేమీ లేదు. నా మఠంలో ఏముందనుకుంటున్నావు? ఈ గాడిద పిల్ల, తల్లే అక్కడ ఉన్నది” అన్నాడట.
ఈ కథ ద్వారా బాబూజీ చాలా సూక్ష్మంగా తనకుతాను ఎటువంటి ప్రాముఖ్యతనూ ఆపాదించుకోకుండా, ఎలాగైతే ఈ కథలో ఆ గురుశిష్యులు ప్రసిద్ధి పొందడంలో నిజానికి ఆధారం గాడిద పిల్ల తప్ప మరేదీ లేదో, అలాగే చారీజీ వ్రాసిన వ్రాతలు బాబూజీకి ఆపాదించడంలో కూడా ఏ కారణమూ లేదని చెప్తున్నారు. సరిగ్గా ఇలాంటి చోటే మహాపురుషులందరూ కూడా తమ నిజతత్త్వమైన ఆ శూన్యత్వాన్ని వెల్లడి చేస్తూనే దాటేస్తూ ఉంటారు. మనం దర్శించవలసింది ఇదే. ఈ విధంగా మనకు ఈ కథ ద్వారా బాబూజీని మూర్తీభవించిన శూన్యత్వంగా దర్శించవచ్చు. మనందరమూ ఆ దిశగా ప్రయాణించే ప్రేరణ పొందవచ్చు.
(సేకరణ –పై వాక్యాలు, ప్రశ్నలు-జవాబులు, పూజ్య చారీజీ వ్రాసిన యాత్ర అనే ఆంగ్ల గ్రంథం నుండి సేకరించినవి, పైన చెప్పుకున్న కథ ది బిలవెడ్ రిమెంబర్డ్ ఏప్రిల్ 30, 1999, సోదరులు సర్నాడ్ జీ, గుల్బర్గా , పేజీ 308 లోనిది )
అందరికీ మరోసారి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అభ్యాసులందరికీ ప్రత్యేక ఆధ్యాత్మికాభినందనలు. పూజ్య దాజీ ఆదేశానుసారం, బాబూజీ దివ్యస్మరణలో మనం ఈ సంవత్సరమంతా ప్రత్యేకంగా గడిపే ప్రయత్నం చేద్దాం.
పరమ పూజ్య బాబూజీ గారి మహావాక్యాలు, శూన్యత్వం, వ్యక్తిగత ప్రళయం గురించి వివరిస్తూ మమ్మల్ని మన సాహిత్యం లోని రుచిని, మన పధ్ధతి వైశిష్ట్యాన్ని తెలియ చేస్తూ విశిస్థ మూర్తిమత్వం గురించీ తెలియచేసారు. ఏమని చెప్పను....అమోఘం..అద్భుతం...
రిప్లయితొలగించండి