31, జులై 2025, గురువారం

సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు - 1


సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు - 1 

అసతోమా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతజ్ఞ్గమయ.

తాత్పర్యము

అసత్యము నుండి సత్యము వైపుకు, అంధకారము నుండి వెలుతురు వైపుకు, మృత్యువు నుండి అమృతత్వము వైపుకు నడిపించు దేవా! 

- బృహదారణ్యక ఉపనిషత్తు 

ఓమ్ సహనావవతు సహ నౌ భునక్తు, సహ వీర్యం కరవావహై. తేజస్వి నావధీతమస్తు  మా విద్విషావహై 
ఓమ్ శాంతిః  శాంతిః  శాంతిః 

తాత్పర్యము

ఈశ్వరుడు మనల నిరువురిని రక్షించుగాక, అతడు మనల నిరువురను పోషించుగాక, మనము గొప్ప శక్తితో (దివ్యబలముతో) కలసి పని చేయుదుముగాక. అధ్యయనముచే మనమిరువురము మేధా సంపదను పొందుదుముగాక, మన ఒకరినొకరు ద్వేషింపకుందుముగాక. శాంతి, శాంతి, శాంతి సర్వత్రా వుండుగాక. 

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || 

తాత్పర్యము

అఖండ ప్రపంచాన్ని ఆకాశంలా వ్యాపించిన ఏ గురుతత్వమైతే 'తత్ 'అని పిలువబడే బ్రహ్మను దర్శింపజేసిందో, అట్టి శ్రీ గురువుకు నమస్కారము.

అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః

తాత్పర్యము

అజ్ఞానమనే చీకటి చేత అంధులైనవారికి జ్ఞానమనే అంజనాన్ని పూసి, కన్నులు తెరిపించిన గురువుకు నమస్కారం అని దీని భావం.

గురుర్బ్రహ్మా  గురుర్విష్ణుః  గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః
 ||

తాత్పర్యము

గురువే  బ్రహ్మ,  గురువే  విష్ణువు,  గురువే మహేశ్వరుడు. గురువు  మాత్రమే  పరబ్రహ్మ.  అట్టి  గురువుకు  నమస్కరిస్తున్నాను. 

స తు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢ భూమిః

తాత్పర్యం

దీర్ఘ కాలం అంతరాయం లేకుండగా గనుక శ్రద్ధాసక్తులతో  సాధన  చేసినట్లయితే దృఢమైన  పునాది  ఏర్పడుతుంది. 

విద్యార్థినా కుతోః సుఖం, సుఖార్థినా కుతో విద్యా,
విద్యార్థినా త్యజతే సుఖం
, సుఖార్థినా త్యజతే విద్యా. 

తాత్పర్యం

విద్యనర్థించేవాడికి సుఖం ఎక్కడుంటుంది, సుఖాన్ని కోరుకొనేవాడికి విద్య ఎక్కడుంటుంది? విద్యార్థి సుఖాన్ని వదులుకుంటాడు, సుఖాన్ని కోరుకొనేవాడు విద్యను వదులుకుంటాడు. 

ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః,
ప్రారభ్య విఘ్న విహితా విరమంతి మధ్యాః
,
విఘ్నైః  పునః పునరపి ప్రతిహన్యమానాః
,
ప్రారభ్య చోత్తమ జనా న పరిత్యజంతి. 

తాత్పర్యం

విఘ్నాలు కలుగుతాయన్న భయంతో నీచులు నిశ్చయంగా పనిని ప్రారంభించరు; విఘ్నములున్నవని తెలిసిన తరువాత మధ్యములు విరమిస్తారు; విఘ్నాలు మాటిమాటికీ గొడ్డలి పెట్టులా కష్టాలు కలిగినప్పటికీ ఉత్తములు చేపట్టిన కార్యమును విడిచి పెట్టరు. 

ధర్మస్య ఫలమిచ్ఛంతి ధర్మం నేచ్చంతి మానవః |
పాపస్య ఫలం నేచ్ఛంతి పాపం కుర్వంతి యత్నతః || 

తాత్పర్యం

ధర్మము వల్ల కలిగే ఫలాన్ని కోరుకుంటాడు మానవుడు, కాని ధర్మంగా ఉండటానికి వెనుకాడతాడు. పాపము వల్ల కలిగే ఫలితాన్ని కోరుకోడు కాని పాపాన్ని స్వేచ్ఛగా ఆచరిస్తాడు.  

పిబంతి నదయః స్వయం ఏవ న అంభః స్వయం న ఖాదంతి ఫలాని వృక్షాః |
న అదంతి సస్యం ఖలు వారివాహా పరోపకారాయ సతాం విభూతయః ||   

తాత్పర్యం

నదులు వాటి నీరు అవి త్రాగవు; వృక్షాలు అవిచ్చే పండ్లు అవి తినవు; మేఘాలు తమ వల్ల వచ్చిన పంటలను అవి తినవు; అలాగే సజ్జనులు కూడా తమ ధనాన్ని పరోపాకారానికే ఉపయోగిస్తారు  

1 కామెంట్‌:

సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు - 1

సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు - 1  అసతోమా సద్గమయ , తమసో మా జ్యోతిర్గమయ , మృత్యోర్మామృతజ్ఞ్గమయ. తాత్పర్యము అసత్యము నుండి సత్యము వైపుకు , అంధక...