1, జులై 2025, మంగళవారం

Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం

 


Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం  

*

హార్ట్ఫుల్నెస్ - సహజ మార్గ సాహిత్యంలో ఈ బ్రైటర్ వరల్డ్ అనే  పదం తరచూ తటస్థం అవుతూ ఉంటుంది. ఈ బ్రైటర్ వరల్డ్ అంటే ఏమిటి? ఈ దివ్యలోకం అనేది ఎక్కడుంటుంది? దీనికి మార్గం ఏమిటి? అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? వీటికి సమాధానాలు శోధించినప్పుడు కలిగిన అవగాహనను ఇక్కడ పంచుకునే ప్రయత్నం చేస్తాను. 

సహజ మార్గ సాధకులు, తమ అనంత ఆధ్యాత్మిక యాత్రలో,  తగినంత ఆధ్యాత్మిక పరిణతిని సాధించిన తరువాత చేరుకునే ఆధ్యాత్మిక లోకం ఈ బ్రైటర్ వరల్డ్. ఇక్కడ, ఆత్మల యొక్క తదుపరి పురోగతి, ఇక్కడున్న దివ్యాత్ములైన మన గురుపరంపరలోని మన మాస్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో ముందుకు కొనసాగుతుంది. 

ఈ బ్రైటర్ వరల్డ్ కి ఆవల కూడా ఎన్నో ఉన్నత దివ్యలోకాలున్నాయట. భూమ్మీద అవతరించిన వ్యక్తిత్వాలే గాక, ఇంకా అవతరించని మాస్టర్లు కూడా (ఈ బ్రైటర్ వరల్డ్ కి ఆవల ఉన్న లోకాల నుండి) ఇక్కడికి వచ్చి మానవాళికి సేవలందిస్తున్నారట.  

బాబూజీ తన జీవితకాలంలో ఈ లోకంతో ప్రత్యక్ష సంపర్కం కలిగి ఉండేవారు. ఈ సంపర్కం ద్వారా వారందుకున్న దివ్యసందేశాలు, ఆదేశాలు, మార్గదర్శనాలు మనకు 1944 విస్పర్శ్ అనే ఉద్గ్రంథంలో కనిపిస్తాయి. బాబూజీ తరువాత అటువంటి సంపర్కం ఫ్రాన్స్ దేశస్థురాలైన, అభ్యాసి అయిన శ్రీమతి హెలీన్ పైరే అనే మన లేఖిని (Scribe) గారు కలిగి ఉండేవారు; దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఆ సంపర్కంతో కొన్ని వేల సందేశాలను వివిధ మాస్టర్ల నుండి 2018 వరకు అందుకున్నారు. అవే విస్పర్శ్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అనే గ్రంథాలుగా ఇప్పటికి 6 సంపుటాలు వెలువడ్డాయి. 

పైన చిత్రం: విస్పర్శ్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అనే గ్రంథంలోని సందేశాల ద్వారా ఈ దివ్యలోకాన్ని గురించిన విశేషాలు, మానవాళి మనుగడకు సంబంధించిన విషయాలు, రహస్యాలు, మార్గదర్శనాలు, వివిధ మాస్టర్ల సందేశాలు - శ్రీకృష్ణుడు, రాధారాణి, స్వామి వివేకానంద, శ్రీరామ కృష్ణ పరమహంస, శ్రీచైతన్య మహాప్రభు లాలాజీ, బాబూజీ, చారీజీ వంటి మహాత్ముల నుండి సందేశాలు దర్శనమిస్తాయి. ఈ గ్రంథమే ఈ బ్రైటర్ వరల్డ్ కి మార్గాన్ని సూచిస్తోందని, ఇహానికి-పరానికి వారధి అని తెలియజేస్తున్నది. 

ఈ పవిత్ర గ్రంథాన్ని సాధకులు అత్యంత భక్తిశ్రద్ధలతో అధ్యయనం చేయవలసిన గ్రంథం; తద్వారా ఎవరికి వారు తమ ఆధ్యాత్మిక సంపదను పెంచుకోగలిగే అవకాశం. 

(ఇంకా ఉంది...)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం - 3

  Brighter World - బ్రైటర్ వరల్డ్ - దివ్యలోకం - 3 అద్భుతం ఏమిటంటే - ఈ గ్రంథం యే విధంగా చదవాలి? బ్రైటర్ వరల్డ్ లో ఉండే మహాత్ములు, ఇక్కడుండే ఇ...