ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం
పూజ్య దాజీ ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా సామూహిక ధ్యానం తరువాత, కాన్హా శాంతి వనంలో ఒక అద్భుత ప్రకటన చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంటే 2025 లో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సమర్థగురు శ్రీ రామ చంద్రజీ మహారాజ్ (పూజ్య లాలాజీ ), శ్రీరామ చంద్ర మిషన్ ఆదిగురువుల వార్షిక జన్మదినోత్సవాన్ని ఈసారి ఆది శక్తి మహోత్సవంగా జరుపుకోబోతున్నామని ప్రకటించారు. దశరథ మహారాజుకు 72 తరాలకు పూర్వం అమలులో ఉన్న విద్యను, తరువాతి తరాల వారికి ఆ అందించడానికి వారసులు ఎవరూ లేక కాలగర్భంలో కనుమరుగైపోయిన ప్రాణాహుతి ప్రసరణ విద్యను పునరుద్ధరించిన మహాత్ముడు పూజ్య లాలాజీ మహారాజ్. ఆయన జన్మదినాన్ని అంటే ఫిబ్రవరి 2 వ తేదీన మనం ఆదిశక్తి మహోత్సవంగా జరుపుకోబోతున్నాం.
ప్రాణాహుతి శక్తే ఈ ఆది శక్తి సృష్టి ఆరంభానికి పూర్వం ఉన్న శక్తిని ఆది శక్తి అని దాజీ తెలియజేయడం జరిగింది. మరొక సందర్భంలో ఈ ప్రాణాహుతి ప్రసరణతో ఆధ్యాత్మిక శిక్షణానందించిన మహర్షి పేరు కూడా పూజ్య దాజీ ఋషభ్ నాథ్ అని కూడా సూచించడం జరిగింది.
ఈ ప్రాణాహుతి ప్రసరణ ద్వారానే హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ్ ఆధ్యాత్మిక శిక్షణ అందించడం జరుగుతూ ఉంది. ప్రాణాహూతితో కూడిన ధ్యానమే హార్ట్ఫుల్నెస్ విశిష్టత. ప్రాణాహుతి శక్తి లేక ఈ ఆది శక్తి, మూలం నుండి ఒక ఉత్కృష్ట స్థాయి యోగి హృదయం ద్వారా ధారగా ప్రవహించే శక్తి.
ప్రాణాహుతి ఆత్మను మూలంతో అనుసంధానం చేస్తుంది ఆత్మకు మూలం యొక్క అంజుభూతిని కలిగించడం ద్వారా మూలాన్ని గుర్తు చేస్తుంది; మూలానికి తిరుగు ప్రయాణమయ్యేలా హృదయ పరివర్తన కలిగిస్తుంది. సంస్కార బీజాలను దగ్ధం చేస్తుంది. వికారాలను నశింపజేస్తుంది; చంచల మనస్సును క్రమబద్ధం చేస్తుంది; మానసిక ప్రశాంతతనువృద్ధి చేస్తుంది; కోరికలను తగ్గిస్తుంది. దివ్యప్రేమను, పరిశుద్ధ ప్రేమను, అకారణ ప్రేమను, అనుభవంలోకి తీసుకువస్తుంది. ఆత్మను ఆవరించి ఉన్న కలుపుమొక్కలను తొలగిస్తుంది; ఉన్నతోన్నత చేతనాస్థితుల అనుభూతిని కలిగిస్తుంది; అలుముకున్న అంధకారాన్ని నిర్మూలిస్తుంది; ఆహాన్ని వినమ్రతగా మారుస్తుంది; జీవితాలను శుద్ధి చేసి, సరళం చేస్తుంది.
ఈ మహత్తర ఆది శక్తి మహోత్సవానికి ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరూ విచ్చేసి ప్రాణాహుతి వృష్టిని అనుభూతి చెందుదురుగాక.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి