సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది?
పైన చిత్రంలో చూపించిన విధంగా సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్ర 13 ప్రధాన బిందువుల గుండా కొనసాగుతుంది. ఇదే ఆధ్యాత్మిక పురోగతి అంటే.
ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వారందరి మనసుల్లో మెదిలే ప్రశ్నే ఇది. చాలా సహజం కూడా. ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? ఎక్కడి దాకా వచ్చామో ఎలా తెలుస్తుంది? యే పాయింట్ దాకా వచ్చాము? యే క్షేత్రాన్ని దాటాము?అసలు ఈ ఆధ్యాత్మిక సోపానంలో మెట్లేమిటి? ఇలా కొన్ని ప్రశ్నలు వస్తూంటాయి.
తప్పకుండా తెలుస్తుంది. రోజు-రోజుకీ మరింత మెరుగైన మనిషిగా తయారవడం జరుగుతుంది. సహజంగా మార్పులు చోటు చేసుకుంటాయి. విస్పర్శ్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ ద్వారా బాబూజీ ఈ ఆధ్యాత్మిక పురోగతి చాలా వరకూ అభ్యాసికి తెలియకుండానే జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ కొన్ని సంకేతాలు మనం గమనించవచ్చు.
ఇక్కడ యాత్రను గురించిన అవగాహన మనం అంచెలంచెలుగా పెంచుకోవలసిన అవసరం కనిపిస్తుంది.
ఆధ్యాత్మిక యాత్ర చాలా సూక్ష్మస్తాయిల్లో జరిగే యాత్ర; చాలా సూక్ష్మమైన యాత్ర కూడా; మనం కూడా అంత సూక్ష్మంగానూ తయారైతే తప్ప సరిగ్గా గుర్తించలేకపోవచ్చు. మన ప్రయాణం స్థూలం నుండి సూక్ష్మం; సూక్ష్మం నుండి సూక్ష్మాతి సూక్ష్మం; ఇలా అనంతంగా సూక్ష్మంగా కొనసాగుతూనే ఉంటుంది యాత్ర; అనంత యాత్ర; సూక్ష్మత్వానికి అంతు లేదు. భగవంతుడు సూక్ష్మాతిసూక్ష్ముడు కాబట్టి సాధకుడు కూడా అంతా సూక్ష్మంగానూ తయారవకపోయినట్లయితే ఆయనలో సంపూర్ణ లయం కాలేడు.
మానవ వ్యవస్థలో సూక్ష్మంగా తయారయ్యేది ఏమిటి? మన చేతనం. అంటే, మనసు, బుద్ధి, అహంకారం. ఈ మూడిటి శుద్ధి జరగడమే సూక్ష్మత్వం. కాబట్టి రోజు-రోజుకూ సూక్ష్మంగా తయారవుతున్న అనుభూతి, మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నామనడానికి గొప్ప నిదర్శనం.
మనం రైల్లోనో, బస్సులోనో ప్రయాణిస్తూ ఉంటే గమ్యానికి ఎంత దూరంలో ఉన్నామో తెలుసుకోవచ్చు; విమానంలో ప్రయాణిస్తే? రాకెట్లో ప్రయాణిస్తే? గమ్యం చేరిన తరువాతే తెలుస్తుంది. ఇక్కడ మనోవేగంతో నడుస్తుంది ప్రయాణం.
అయితే పూజ్య చారీజీ కొన్ని సంకేతాలు ప్రతీ రోజూ గమనించుకోవచ్చన్నారు. ఏమిటవి? నిష్ఠగా నిత్యం సాధన చేస్తున్నట్లయితే, రోజు-రోజుకీ హృదయంలో తేలికదనాన్ని అనుభూతి చెండుతాం; రోజు-రోజుకీ భగవంతునిపై ఆధారపడటం ఎక్కువవుతూ ఉంటుంది; ఆలోచనలో స్పష్టత పెరుగుతూ ఉంటుంది; ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది; అకారణ ప్రేమ పెరుగుతూ ఉంటుంది; కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే బలం పెరుగుతూ ఉంటుంది; తపన, ఆసక్తి పెరుగుతూ ఉంటాయి; ఎంత చెప్పినా పెంపొందని విలువలు తెలియకుండానే కొంచెం-కొంచెంగా సహజంగా వృద్ధి అవుతూ ఉంటాయి. ఇవన్నీ గమనించుకుంటే తెలుస్తాయి; సాధారణంగా మనం దైనందిక జీవనం యొక్క హడావుడిలో మనం వీటిపై దృష్టి పెట్టకపోవడం వల్ల గమనించలేకపోతూంటాం; కానీ ఇవన్నీ గమనించకపోయినా జరుగుతూ ఉంటాయి; గమనించినట్లయితే, వాటిని కృతజ్ఞతతో పదిలపరచుకోవడమే గాక మన ప్రయత్నంతో మరింత వృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది; తద్వారా పురోగతి మరింత తీవ్రతరమవుతుంది.
పూజ్య చారీజీ సహజ మార్గ ఆధ్యాత్మిక పథంలో సూచించిన పరమపద సోపానం:
అభ్యాసి -> తీవ్ర అభ్యాసి (ఇంటెన్స్ అభ్యాసి) -> శిష్యుడు (డిసైపుల్).
ఇది ప్రతి సాధకుడు గుర్తుంచుకోవలసిన విషయం.
పూజ్య దాజీ ప్రకారం ఆధ్యాత్మిక యాత్రలో, ఈ అనంత యాత్రలో కొన్ని దశలను ముఖ్యమైన ఘట్టాలుగా చెప్పుకోవచ్చు: మోక్షము, ఆత్మ-సాక్షాత్కారం/దైవసాక్షాత్కారం, లయావస్థ అని మూడు ప్రధాన ఘట్టాలు. ఈ ఘట్టాలు సాధకుని యాత్రలో సంభవించినప్పుడు వాటిని గుర్తించకుండా ఉండే ప్రశ్నే ఉండదంటారు. మిస్ అయ్యే అవకాశమే లేదంటారు దాజీ.
అయితే అన్నిటికీ మనలో సున్నితత్త్వం పెంచుకోవలసిన అవసరం మాత్రం ఉంది. కాస్త ఆసక్తి, కాస్త ప్రయత్నం, కాస్త నిబద్ధత, కాస్త ఓర్పుతో ఈ సాధనను ప్రారంభించాలి; తరువాత ఇవన్నీ క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. యాత్రను తీవ్రతరం చేసేవి భక్తి, శ్రద్ధ, తీవ్ర తపన, గురువుపై ఆధారపడటం.
అందరూ వారి కృపచే ఈ జన్మలోనే గమ్యాన్ని చేరుకొందురుగాక!
Excellent explanation Krishna. Thank you so much. Much needed 🤝🤝🤝
రిప్లయితొలగించండిExcellent brother
రిప్లయితొలగించండి