బాబూజీ పలికిన కొన్ని వాక్యాలపై మననం, నిధిధ్యాసనం - 1
The end of religion is the begining of spirituality.
మతం అంతమైన చోట ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది.
భగవంతుడు మనిషిని సృష్టించాడు, మనిషి మతాలను సృష్టించాడు. - బాబూజీ.
ప్రతీ మనిషి యేదొక మతంలో జన్మిస్తాడు, కానీ మతంలోనే మరణించకూడదు; మతానికి అతీతంగా ఎదగాలి మనిషి.
- స్వామి వివేకానంద
మతాలు విభజిస్తాయి; ఆధ్యాత్మికత కలుపుతుంది.
- బాబూజీ
సాధారణంగా వాడుకలో మతం అన్నా ఆధ్యాత్మికత అన్నా ఒకే అర్థంలో తీసుకుంటూ ఉంటారు జనం. కానీ సహజ మార్గ మాస్టర్ల ప్రకారం వీటి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది.
మతం అనగానే మనకు పూజలు, పునస్కారాలు, నమ్మకాలు, యజ్ఞాలు, యాగాలు, ఆచారాలు, గ్రంథాలు, సాకార ఆరాధనా పద్ధతులు, నిరాకార ఆరాధనా పద్ధతులు, క్రతువులు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వగైరావి అన్నీ గుర్తొస్తాయి. ఇవన్నీ చాలా వరకూ అన్ని మతాలకూ వర్తిస్తాయి; ఆచరించే విధానాలలో తేడాలుండవచ్చు తప్ప, అన్ని మతాలలో మనం వీటిని కనుగొనవచ్చు. మతంలోని ప్రక్రియలన్నీ బాహ్యోన్ముఖంగా ఉండే ప్రక్రియలే. భగవంతుడిని బాహ్యంగా కనుగొనే ప్రక్రియలు.
నిజానికి యే మతం లక్ష్యమైనా మనిషిని ఆ సృష్టికర్తతో లేక ఆ పరమాత్మతో కలిపే ప్రయత్నమే. కారణాలేమయినప్పటికీ. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆరాధనా పద్ధతి ఏర్పడింది. అన్ని మతాలు దైవాన్ని హృదయంలోనే కనుగొనాలని ఏకగ్రీవంగా అంగీకరించినప్పటికీ కూడా అనుసరించే పద్ధతులన్నీ బాహ్యోన్ముఖంగానే ఉంటాయి. ఆ విధంగానే ప్రతీ మనిషి ప్రారంభించడం జరుగుతుంది; కానీ జీవితం అంతా అలాగే ఉండిపోకూడదు అంటారు స్వామి వివేకానంద వంటి మహాత్ములు. దైవాన్ని అంతరంగంలో అంతర్ముఖులై కనుగొనే ప్రయత్నమే ఆధ్యాత్మికత. కాబట్టి మతం అంతమవడం అంటే, దైవాన్ని కనుగొనే పద్ధతిలో, మార్గంలో, దృక్పథంలో మార్పు రావడం. ధ్యానమే దీనికి మార్గం. సరళంగా చెప్పాలంటే ధ్యానం అంటే, లేక ఆధ్యాత్మికత అంటే కూడా - లోపలికి తొంగి చూడటమే; హృదయంలోకి చూడటమే.
తరచి చూసినట్లయితే, మహాత్ములందరూ కూడా ధ్యానించినవారే. బుద్ధుడైనా, క్రీస్తు అయినా, శివుడైనా, కృష్ణుడైనా, స్వామి వివేకానంద అయినా, ఎవరైనా..
విచిత్రంగా బుద్ధుడు బౌద్ధుడు కాడు; యేసు క్రీస్తు క్రైస్తవుడు కాడు; వీళ్ళ తరువాత బౌద్ధ మతం, క్రైస్తవ మతం వచ్చాయి. ఇరువురూ యదార్థ సత్యాన్ని తెలుసుకున్నవారే. కాబట్టి మనిషి యదార్థ సత్యాన్ని తెలుసుకోవాలంటే యే మతానికి చెందనవసరం లేదని అర్థమవుతుంది. కానీ అందరూ యేదోక మతంలో పుట్టినా దానికి అతీతంగా లోపలి నుండి ఎడగవలసిన అవసరం ఉంది. దీన్నే మనం ఆధ్యాత్మిక వికాసమని, చైతన్య వికాసమని, ఆత్మవికాసమని అంటాం. మనిషి జన్మ యొక్క ప్రయోజనమే ఆత్మ వికాసం.
"మతం అనేది సాధకుడిని కేవలం మోక్ష మార్గంలో నడవడానికి సిద్ధం చేసే ఒక ప్రాథమిక దశ మాత్రమే" - బాబూజీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి