20, ఏప్రిల్ 2026, సోమవారం

ఒత్తిళ్ళు

ఒత్తిళ్ళు 

ఒత్తిడి. మనిషి జీవితం ఒత్తిళ్ళ మయం. పుట్టుకే ఒక ఒత్తిడి, తల్లి గర్భంలో ఒత్తిడి, తల్లికి ఒత్తిడి. బయట  పడ్డాక యేడ్చే దాకా ఒత్తిడి. పెరగడం ఒత్తిడి. చదవడం ఒత్తిడి. ఉద్యోగం దొరికే వరకూ ఒత్తిడి. ఉద్యోగం దొరికిన తరువాత ఉద్యోగ ఒత్తిడి. తరువాత వివాహ ఒత్తిడి. వివాహం తరువాత సంతాన ఒత్తిడి. సంసార ఒత్తిడి. ఈ క్రమంలో అనారోగ్య ఒత్తిళ్లు, ఆర్థిక ఒత్తిళ్లు,  సామాజిక ఒత్తిళ్ళు, బంధువుల ఒత్తిళ్ళు, ప్రభత్వ ఒత్తిళ్లు, ప్రకృతిపరమైన ఒత్తిళ్ళు. ఆ తరువాత ముసలితనం ఒత్తిళ్ళు, వ్యాధుల వల్ల వచ్చే ఒత్తిళ్ళు, రకరకాల భయాల వల్ల వచ్చే ఒత్తిళ్లు, మృత్యు భయం వల్ల ఒత్తిళ్ళు. మృత్యువు తరువాత యేం జరుగుతుందోనన్న ఒత్తిడి.

ఇవి గాక మగాడికుండే ఒత్తిళ్ళు, ఆడవారికుండే ఒత్తిళ్ళు, ఇరువురి మధ్య ఉండే ఒత్తిళ్ళు. ఈ ఒత్తిళ్ళ ప్రభావాలు ఎలా ఉంటాయో పైన చిత్రంలో గమనించవచ్చు. 

ఇన్ని ఒత్తిళ్ళతో సతమతమవుతూ, వీటన్నిటినీ దాటాలన్న సంకల్పం వల్ల వచ్చే ఒత్తిడిని అంగీకరిస్తూ మనిషి తన మనుగడను సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు; ఈ భవసాగరాన్ని దాటాడానికి ప్రయత్నిస్తున్నాడు.

వీటి ప్రభావాలు మనిషి శరీరంపైన, మనసు పైన, హృదయం మీద కనిపిస్తూ ఉంటాయి. అనుభవించేది హృదయం లేక ఆత్మ. ఇది తట్టుకోలేనప్పుడు ముందు మనసుపైకి తోసేస్తుంది, అది తిరిగి శరీరంపైకి తోసేయడం వల్ల ముందు శారీరక వ్యాధుల రూపంలో ఈ ఒత్తిడి బయటకొస్తుంది. వీటికి ఎంతో కొంత చికిత్స ఉండవచ్చు. ఆ తరువాత మానసిక వ్యాధులొస్తాయి. వీటికి పరిష్కారం చాలా జటిలం. చాలా సమయం పట్టవచ్చు. పరిష్కారాలు తెలియకపోవచ్చు. ఆ తరువాత ఆధ్యాత్మిక రోగాలు వస్తాయి. అంటే నైతికపరమైన రోగాలు. మనస్సాక్షికి అనుకూలంగా జీవిస్తే ఈ నైతిక రోగాలుండవు. ఇలా జీవించాలంటే, ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో, చాలా సాహసం కావాలి. అంటే హృదయాన్ని అనుసరించి జీవించడం అన్నమాట. హృదయాన్ని అనుసరించాలంటే సాహసం కావాలి. అదీ లోపలి నుండి సహజంగా రావాలి. అందుకే దీనికి ధ్యానం ఒక్కటే పరిష్కారం. 

అసలు ఒత్తిడి అంటే ఏమిటి? 
ఒత్తిడి అంటే మన మనసు మీద, శరీరంలోని గుండె మీద, అవయవాల మీద, నరాల మీద, మెదడు మీద, కండరాల మీద ఎడతెగకుండా, పీడ కలగడం, ఒత్తిడి అంటే అది. ఈ పీడ భరింపరానిది. 

ఒత్తిడి ఎటువంటి పరిస్థితుల్లో కలుగుతుంది? 
జీవితం అంటేనే సమస్యలు. మన కంటే పెద్దదైనప్పుడే అది సమస్య. అప్పుడే సమస్య వల్ల ఒత్తిడి. మన కన్నా చిన్నదైతే అక్కడ ఒత్తిడి ఉండదు. సమస్య జటిల్యమైతే ఒత్తిడి. సమస్య పరిష్కరించే నైపుణ్యం లేకపోతే ఒత్తిడి. చేయవలసిన పని ఎక్కువ సమయం తక్కువ అయినప్పుడు ఒత్తిడి. ఈ ఒత్తిడి మోతాదు మించినప్పుడు మనిషికి అపకారం చేస్తుంది. మోతాదు మించకుండా ఉండే ఒత్తిడి మనిషికి అవసరం. అది సకారాత్మక ఒత్తిడి. మనిషిని చురుకుగా ఉండేలా బద్ధకం లేకుండా చేస్తుంది. 

అన్నిటికంటే పెద్ద ఒత్తిడి 
మనం ఇన్ని రకాల ఒత్తిళ్లు చూశాం. వీటన్నిటికంటే అతి పెద్ద ఒత్తిడేమిటో తెలుసా? మనస్సాక్షికి విరుద్ధంగా జీవించడం. నైతిక జీవనానికి దూరంగా జీవించడం. 

పరిష్కారం 

నైతికంగా, మనస్సాక్షికి అనుగుణంగా జీవించడమే దీనికి పరిష్కారం. అంటే హృదయాన్ని అనుసరించి జీవించడం. హృదయం మన్షి జీవితానికి దిక్సూచి. అది సరైన దీశాను మాత్రమే చూపిస్తుంది. హృదయ గళాన్ని వినాలి, వణ్ణదాన్ని అనుసరించాలి. ఇది సహజంగా జరగడం కోసమే ధ్యాన సాధన. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే సాహసాన్ని కూడా ఇచ్చేది  కూడా ఈ ధ్యానసాధనే. ముఖ్యంగా ఈ హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ ధ్యాన సాధన.   మొట్టమొదటి రోజు నుండి, మనలో పేరుకుపోయిన  ఈ ఒత్తిడి నుండి ఉపశమనాన్ని అనుభూతి చెందుతారు. అందరూ తప్పక ప్రయత్నింతురుగాక. 

18, ఏప్రిల్ 2026, శనివారం

ఏప్రిల్ 19, బాబూజీ మహాసమాధి రోజు

 


ఏప్రిల్ 19, బాబూజీ మహాసమాధి రోజు 

సమర్థ గురు మహాత్మా శ్రీ రామ చంద్ర జీ మహారాజ్ (షాజహాన్ పూర్, ఉ. ప్ర.), అందరూ ఆప్యాయంగా బాబూజీ మహారాజ్ అని పిలుచుకునేవారు. శ్రీరామ చంద్ర మిషన్ అనే లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థను తమ గురుదేవులైన సమర్థ గురు మహాత్మా శ్రీ రామ చంద్ర జీ మహారాజ్ (ఫతేగఢ్, ఉ. ప్ర.), అందరూ లాలాజీ మహారాజ్ అని పిలుచుకునేవారు, వారికి గురుదక్షిణగా ఈ సంస్థను 1945 లో షాజహాన్ పూర్ లో స్థాపించడం జరిగింది. సహజ్ మార్గ్ జన్మస్థానం షాజహాన్ పూర్.  అక్కడే ఏప్రిల్ 30, 1899 న జన్మించిన పూజ్య బాబూజీ మహారాజ్ ఏప్రిల్ 19, 1983 న మహాసమాధిని  కూడా పొందడం జరిగింది. 

మహాసమాధి అంటే మాస్టర్ భౌతిక దేహం చాలించి, ఆఅ పరతతత్వంలో లీనమైన రోజు; అయినా ఒక సూక్ష్మ స్థితిలో అభ్యాసులకు తమ-తమ అంతరంగం ద్వారా ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ఆధ్యాత్మికంగా మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు. 
ప్రతీ సంవత్సరమూ అభ్యాసులు ఈ రోజున ఏప్రిల్ 19 న, వారి దివ్య స్మృతిలో ప్రత్యేకంగా ధ్యానం చేసుకోవడం, వారి బోధనలను, వాక్కులను, జీవితాన్ని మరలా-మరలా నెమరువేసుకోవడం,  వారి సాహిత్యాన్ని చదువుకోవడం చేస్తూంటారు శ్రద్ధా-భక్తులు గల అభ్యాసులు.

మన పూజ్య గురుదేవులు, ప్రస్తుత సహజ్ మార్గ్ మాస్టర్ అయిన దాజీ మహారాజ్, రేపు ఉదయం 7.30 గంటలకు ఈ సందర్భంగా వారణాసి నుండి ధ్యానం నిర్వహించనున్నారు. అందరూ శ్రద్ధతో పాల్గొందురుగాక. 

17, ఏప్రిల్ 2026, శుక్రవారం

 


Eight Rules for Spiritual Gatherings

Master told me the following things to be observed during Bhandara (Spiritual Congregation)

Everyone should respect others.

The question of high and low should not arise.

Nothing should be done which is disliked by others.

One should desist from uncultured behaviour.

One should keep his mind steady.

One should not indulge in unnecessary argumentation and useless criticism. One should ask only relevant questions.

The real purpose of Bhandara is to refresh our memory of the one whose festival is being observed.

There should be no differentiation between the gurus or disciples of other institutions and one's own.

(from Autobiography of Ram Chandra , 31-7-1944)



ఆధ్యాత్మిక సమావేశాలకు ఎనిమిది నియమాలు 

భండారా (ఆధ్యాత్మిక సమావేశం) జరుగుతున్నప్పుడు అనుసరించవలసినవి కొన్ని విషయాలు మాస్టర్ నాతో చెప్పినవి ఇలా ఉన్నాయి:

ప్రతి ఒక్కరూ ఇతరులను గౌరవించాలి. 

ఒకరెక్కువ, ఒకరు తక్కువ అనే ప్రశ్నే తలెత్తకూడదు. 

ఇతరులకు ఇష్టం లేని పని యేదీ చేయకూడదు. 

ప్రవర్తన సంస్కారహీనంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ చూసుకోవాలి. 

ప్రతి ఒక్కరూ తమ మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. 

అనవసరమైన వాదనల్లోనూ, పనికిరాని విమర్శలలోనూ తలదూర్చకుండా జాగ్రత్తపడాలి. సంబంధిత ప్రశ్నలు మాత్రమే అడగాలి. 

మనం ఎవరి స్మరణలో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నామో, వారి స్మృతిని తాజా చేసుకోవాడమే, భండారా యొక్క నిజమైన ప్రయోజనం.   

ఇతర గురువుల పట్ల, ఇతర సంస్థల శిష్యుల పట్ల,  మనకూ మధ్య ఎటువంటి బేధభావమూ ఉండరాదు. 


(రామ చంద్రుని స్వీయ చరిత్ర, 31-7-1944)


16, ఏప్రిల్ 2026, గురువారం

నిరంతర స్మరణ

 

నిరంతర స్మరణ 
అభ్యాసి: గమ్యాన్ని అతిత్వరగా చేరుకోవాలంటే మార్గం ఏమిటి?
బాబూజీ: నిరంతర స్మరణ. 

నిరంతర స్మరణ అంటే ఏమిటి? 
సహజ మార్గ గురువులు నలుగురూ తమ అభ్యాసులకు నిరంతర స్మరణ అంటే ఏమిటో, ఎలా అభ్యాసం చేయాలో ఎప్పటికప్పుడు తమ ప్రశంగాల ద్వారా, సంభాషణల్లోనూ, తెలియజేస్తూనే ఉన్నారు. 
నిరంతర స్మరణ అంటే అంతరాయం లేకుండా అంతర్యామిగా హృదయంలో ఉన్న ఆ దివ్య వెలుగు యొక్క స్మరణలో ఉండటం. దివ్యత్వం యొక్క సాన్నిధ్యాన్ని ప్రయత్నం లేకుండా అనుభూతి చెందుతూ ఉండటం. 
నిరంతర స్మరణ అంటే హృదయంలోని దివ్యత్వం యొక్క పరిమళాన్ని సూక్ష్మంగా అనుభూతి చెందుతూ ఉండటం. ఇది సర్వకాల సర్వావస్థల్లోనూ అనుభూతి చెందేది.  
జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థల్లో కూడా అప్రయత్నంగా జరిగే ప్రక్రియ.

ఆకలి వేసినప్పుడు కడుపు యే విధంగా ఆహారాన్ని స్మరిస్తుందో, దాహం వేసినప్పుడు గొంతుక యే విధంగా నీరును స్మరిస్తుందో, అదే విధంగా హృదయం దివ్యత్వం కోసం పరితపించడమే నిరంతర స్మరణ. - చారీజీ 

మరి ఈ నిరంతర స్మరణను అభ్యాసం చేసేదెలా? 
హార్ట్ఫుల్నెస్ (సహజ్ మార్గ్) పద్ధతిలోని ఉదయం ధ్యానం, సాయంకాల శుద్ధీకరణ, రాత్రి ప్రార్థనా-ధ్యానం అనే మూడు యౌగిక ప్రక్రియలను అభ్యాసం చేయగా, చేయగా సహజంగా ఆ సాధన నిరంతర స్మరణకు దారి తీస్తుంది. 
ముఖ్యంగా ఉదయం ధ్యానం పూర్తయిన తరువాత కలిగిన ధ్యాన స్థితిని గుర్తించి, ఆస్వాదిస్తూ, (దాజీ చెప్పిన a,e,i,o,u) పద్ధతి ద్వారా రోజంతా ఆ స్థితిని నిలుపుకునే ప్రయత్నం ద్వారా ఈ నిరంతర స్మరణ సిద్ధిస్తుంది. 
ప్రారంభ దశలో, నిరంతర స్మరణను అభ్యాసం చేసే మార్గం బాబూజీ సూచించినది ఇలా ఉంది: మనం చేస్తున్న ప్రతీ పని, ప్రతీ ఆలోచన, మన స్థానంలో  ఆయనే స్వయంగా చేస్తున్నారన్న భావనలో నిర్వర్తించడానికి ప్రయత్నించమన్నారు. 

నిరంతర స్మరణ అంటే యేది కాదు? 
నిరంతర స్మరణ అంటే "మాస్టర్, మాస్టర్  ... " అనుకోవడం కాదు. స్మరణ అంటే మాస్టర్ తో జ్ఞాపకాలు కూడా కావు. కానీ ఆఅ జ్ఞాపకాలను పునరజీవించగలిగితే అది స్మరణ అవుతుందన్నారు, చారీజీ.  

నిరంతర స్మరణ వల్ల సిద్ధించేదేమిటి?
నిరంతర స్మరణ, సాధకుడిని దివ్యత్వానికి చేరువ చేస్తుంది. శుద్ధ చైతన్య స్థితి మనకు కవచంలా పని చేస్తుంది. నిరంతర స్మరణ పరిపక్వ దశలో దైవం పట్ల దివ్యప్రేమగా మారుతుంది. ఆ దివ్యప్రేమ శరణాగతికి దారి తీస్తుంది. శరణాగతి మానవ జీవిత యదార్థ లక్ష్యమైన ఆ దివ్యత్వంలో ఐక్యమయ్యేలా చేస్తుంది.

Stages of Constant Remembrance
First, we forget to remember.
Then we remember to remember.
Then we remember to forget. 
- Babuji  

నిరంతర స్మరణలో దశలు 
మొదట్లో మనం స్మరించడం మరచిపోతాం. 
ఆ తరువాత, స్మరించాలని గుర్తుంచుకుంటాం. 
ఆ తరువాత , మరచిపోవాలని గుర్తుంచుకుంటాం.
- బాబూజీ   


15, ఏప్రిల్ 2026, బుధవారం

కన్నీళ్ళు

 


కన్నీళ్ళు 

కన్నీళ్ళు లేకుండా మనిషి జీవితం ఉండదు. కన్నీళ్ళకి హృదయ స్థితికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. కాబట్టి కన్నీళ్ళు వచ్చినప్పుడు రానివ్వాలి - మగవారైనా, ఆడువారైనా. కన్నీళ్ళు బలవంతంగా ఆపినప్పుడు హృదయం జడంగా, బండగా తయారవుతుంది.  

మనిషి పుట్టగానే ఏడుస్తాడు; ఏడవకపోతే తల్లి ఏడుస్తుంది; పట్టలేని ఆనందం కలిగినపుడు కన్నీళ్ళొస్తాయి. కృతజ్ఞత లోలోతుల్లో నుండి ఊరుతున్నప్పుడు కన్నీళ్ళొస్తాయి; పసికందు ఆకలి వేస్తే ఏడుస్తుంది; పక్క తడిపినప్పుడు ఏడుస్తుంది; ఇబ్బంది కలిసినప్పుడు ఏడుస్తుంది. తట్టుకోలేని బాధ కలిగినప్పుడు ఏడుపొస్తుంది.  ఉల్లిపాయ తరిగినప్పుడు కూడా కన్నీళ్ళొస్తాయి. కళ్ళకు చాలా మంచిదని కూడా చెప్తారు. భయం వేస్తే కూడా కన్నీళ్ళొస్తాయి. ఇతరుల కష్టాలు చూసినప్పుడు నిస్సహాయ స్థితిలో కన్నీళ్ళు వస్తాయి. ఎవరైనా దగ్గర వాళ్ళు మరణించినప్పుడు కన్నీళ్ళు తిరుగుతాయి.  ప్రేమను లోతుగా అనుభూతి చెందినప్పుడు కూడా కన్నీరవస్తుంది. భక్తి పారవశ్యంలో కూడా వస్తాయి కన్నీళ్ళు. హృదయం ద్రవించినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. 

వన్నీ కన్నీళ్ళు గుండె బరువెక్కిస్తాయి. భయం, కష్టాలు, దుఃఖం, నొప్పి కలిగినప్పుడు వచ్చిన కన్నీళ్ళు గుండెను బరువెక్కిస్తాయి. 
 మరికొన్ని కన్నీళ్ళు హృదయాన్ని ద్రవింపజేసి గుండెను తేలికపరుస్తాయి. ప్రేమ వల్ల, ఆనందం వల్ల, కృతజ్ఞత వల్ల, భక్తి పారవశ్యం వల్ల, పశ్చాత్తాపం వల్ల  వచ్చే కన్నీళ్ళు హృదయాన్ని కరిగిస్తాయి. శాంతిని చేకూరుస్తాయి. 

కన్నీళ్ళు మనిషిలో మానవత్వాన్ని సూచిస్తుంది. మనిషి వివిధ సందర్భాలలో స్పందించే విధానం. కన్నీరు బలహీనత కాకూడడంటారు మన మహర్షులు. అందుకే సాధన. కానీ మహాత్ములు రెండు సందర్భాల్లో వచ్చే కన్నీరు శ్రేష్ఠమైనవి అని అంటారు - ఒకటి, గుండె అంతా కృతజ్ఞతతో నిండిపోయినప్పుడు, రెండు, భగవంతుని పట్ల, గురువుపైన నిజమైన ప్రేమ కలిగినప్పుడు.   

ధ్యానం, చదవడం, నవ్వులు, సంగీతంతో కూడిన ఆరోగ్యకర జీవితం

 


 ధ్యానం, చదవడం, నవ్వులు, సంగీతం తో కూడిన ఆరోగ్యకర జీవితం 

ఎంత ధ్యానం చేసినా, ఎంత సాత్త్విక జీవితం గడపాలని చూసినా, జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోవడం తప్పదనిపిస్తూ ఉంటుంది. ఇది మహాత్ముల జీవనంలో కూడా కనిపిస్తుంది. జీవితం ఎంత విచిత్రమైనదో గదా!

దీనికి పెద్దలు సూచించిన శ్రేష్ఠమైన ఉపాయం, ఒత్తిడిని సాధ్యమైనంత ఎక్కువగా తగ్గించుకుంటూ ఆరోగ్యకరంగా జీవించడానికి చదవడం, ధ్యానం, నవ్వులు, సంగీతం - వీటికి తగిన ప్రాధాన్యతనిస్తూ జీవితాన్ని కొనసాగించినట్లయితే జీవితం ఆరోగ్యకరంగా ఉండటమే గాక, ఎన్ని ఇబ్బందులున్నా ఎదుర్కోవచ్చు, జీవితాన్ని ఆస్వాదించవచ్చు కూడా. 

చదవడం 
చిన్న వయసు నుండి చదవడం అలవరచుకున్నట్లయితే, ముఖ్యంగా ఆత్మ వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి, మహాత్ముల జీవిత చరిత్రలకు, మేధో వికాసానికి, సృజనాత్మకతాకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటే సూక్ష్మ శరీరాలకు చాలా ఆరోగ్యం చేకూరుతుంది.

ధ్యానం 
ధ్యానం కూడా ముఖ్యంగా మన హార్ట్ఫుల్నెస్ ధ్యానం వంటిది 15 సంవత్సరాలకే ప్రారంభించి, కొనసాగించగలిగితే జీవితం అద్భుతంగా ఉండే అవకాశాలే ఎక్కువ. ధ్యానం వల్ల మనసు క్రమశిక్షణలో ఉండటం, ఏకాగ్రత పెరగడం, ఆలోచనలో స్పష్టత రావడం తద్వారా జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలగడం, ఆత్మవిశ్వాసం పెరగడం, చాలా అవసరమైన వివేకం వృద్ధి చెందడం, మానసిక ప్రశాంతత పెరగడం, మనసు నిశ్చలంగా తయారవడం, ఇలా అసంఖ్యాకంగా ఎన్నో ప్రయోజనాలు కనిపిస్తాయి. జీయితం ఎక్కడికక్కడ తనంతటదే  సర్దుకుంటుంది.  

నవ్వులు 
ధ్యానం చేసేవాళ్ళు, చదువుకునేవారు, ఎప్పుడూ గంభీరంగా ఉండనవసరం లేదు. అలా ఉంటే సమతౌల్యతను కోలపోయ, వ్యక్తిత్వాలు అదో రకంగా తయారవడం వల్ల ఎవ్వరూ వద్దకు రావడానికి ఇష్టపడరు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మన జీవితంలో నవ్వుకు చాలా ముఖ్య ప్రాధాన్యతనివ్వాలి. నవ్వు భగవంతుడు మనుషులకు మాత్రమే ఇచ్చిన గొప్ప వరం. నవ్వడం యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడొక మహానుభావుడు. యోగం కాబట్టే నవ్వితే, హృదయం తేలికపడుతుంది. 

సంగీతం 
 మనిషి మాత్రమే ఎక్కువగా ఆస్వాదించగలిగే మరొక కల సంగీతం. సంగీతం కూడా ఒక యోగమే. మనసును ఆహ్లాదపరచడమే గాక, పరవశింప జేస్తుంది; మయిమరిపిస్తుంది; అలౌకిక సుఖాన్నిస్తుంది. సంగీతం విన్నా, పాడుకున్నా, సంగీతం తెలిసినా, తెలియకపోయినా మనిషిలో ఆఅ రసాస్వాదన సహజంగా జరుగుతుంది. సాంప్రదాయ సంగీతం, భక్తి సంగీతం అయితే ఆధ్యాత్మిక లక్ష్యాలున్నవారికి భక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి కూడా. సంగీతం వల్ల భాష శుద్ధి జరుగుతుంది, సంస్కృతి పెరుగుతుంది. మనసు పవిత్రమయ్యే అవకాశం కూడా ఉంది. 

ఈ విధంగా ప్రతీ మనిషి తన జీవితంలో ఈ నాలుగు సముచితమైన స్థానాన్ని గ్రహిస్తే జీవితం ఆరోగ్యంగా ఉండటమే గాక, జన్మ తరించే అవకాశం కూడా ఉంటుంది. 

11, ఏప్రిల్ 2026, శనివారం

భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఉల్లేఖించిన సాధకుడు అనుభూతి చెందే వివిధ ఆధ్యాత్మిక అవస్థలు (స్థితులు)



భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఉల్లేఖించిన సాధకుడు అనుభూతి చెందే వివిధ ఆధ్యాత్మిక అవస్థలు (స్థితులు)


ఆధ్యాత్మిక అధిరోహణలో సాధకుడు తాను ఉన్న స్థితి నుండి అత్యున్నత స్థితి వరకూ ఉండే అవస్థలను శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతలో అర్జునుడికి, అర్జునుడి ద్వారా మానవాళికి  ఉల్లేఖించడం జరిగింది. అత్యున్నత స్థితినే హార్ట్ఫుల్నెస్-సహజ్ మార్గ్ పద్ధతిలో సహజ సమాధి అంటారు. అంటే చంచలంగా అశాంతితో కూడిన మనసు నుండి మనిషి ఆధ్యాత్మికంగా  ఏకత్వ స్థితిని సాధించే క్రమంలో ఎదురయ్యేటువంటి భగవానుడు తెలియజేసిన అవస్థలను/స్థితులను పరిశీలిద్దాం.  వీటిని సహజ్ మార్గ్ లో ప్రతీ సాధకుడు తన అనుభవంలోకి రావడం గమనించగలుగుతాడు. 

1. విక్షిప్త మనస్సు: చంచల మనస్సు, అన్నీ దిశల్లోనూ అడుపులేకుండా తిరుగుతూ ఉండే మనస్సు. (భగవద్గీత అధ్యాయం 6, శ్లోకం 34)

2. ఏకాగ్ర మనస్సు: చంచలమైన మనస్సు నిశ్చల ఏకాగ్ర స్థితికి చేరుకోవడం. (భగవద్గీత అధ్యాయం 6, శ్లోకం 26)  

3. స్థితప్రజ్ఞ స్థితి: సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా చలించకుండా, మనస్సు కదలని స్థితి; సమస్థితి. (భగవద్గీత అధ్యాయం 2, శ్లోకం 56) 

4. యుక్త స్థితి: జ్ఞానంతోనూ, అనుభవంతోనూ తృప్తితో ఉండే స్థితి యుక్త స్థితి. (భగవద్గీత అధ్యాయం 6, శ్లోకం 8)

5. బ్రహ్మభూత స్థితి:  బ్రహ్మభూత స్థితిలో మనస్సు దుఃఖించదు, ఆశించదు, అందరి పట్ల సామాన్య దృష్టితో వ్యవహరిస్తుంది. (భగవద్గీత అధ్యాయం 18, శ్లోకం 54)

6. పరాభక్తి స్థితి: ఎవరి పట్ల ద్వేషం లేకుండా స్నేహంతోనూ, కారుణతోనూ ఉండే మనఃస్థితి.(భగవద్గీత అధ్యాయం 12, 13, ) 

7. తురీయ స్థితి: మనిషి జీవించే మూడు అవస్థలకతీతంగా (జాగృత, స్వప్న, సుషుప్తావస్థలు) ఉండే నాల్గవ స్థితే తురీయావస్థ. (భగవద్గీత అధ్యాయం 6, శ్లోకం 20,)

8. తామరాకుపై నీటి బొట్టులా ఉండటం: నీటిలో ఉంటూ కూడా తామరాకు నీటి బొట్టు అంటకుండా యే విధంగా ఉంటుందో, అలాగే మానవుడు కూడా సంసారంలో ఉంటూ కూడా సంసారం అంటకుండా జీవించగలడు. (భగవద్గీత అధ్యాయం 5, శ్లోకం 10)

9. నిష్కామ కర్మ: యే ఫలితమూ ఆశించకుండా తన కర్మలను తాను ఈశ్వరార్పణ భావంతో తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూ పోవడం. (భగవద్గీత అధ్యాయం 2, శ్లోకం 47) 

10. శరణాగతి: అన్ని ధర్మాలూ విడిచిపెట్టేసి, సంపూర్ణ భారం ఆయణపైనే ఉంచి జీవించడం. (భగవద్గీత అధ్యాయం 18, శ్లోకం 66)

11. పరమ గమ్యం: అక్కడ సూర్యని వెలుగు కానీ, చంద్రుని వెలుగు కానీ, మరే రకమైన వెలుగూ ఉండదు. అక్కడికి చేరుకున్నవాడు ఇక తిరిగి రావడం ఉండదు. (భగవద్గీత అధ్యాయం 15, శ్లోకం 6)

భగవద్గీత మార్గాన్ని చూపిస్తుంది, హార్ట్ఫుల్నెస్-సహజ్ మార్గ్ ఆఅ మార్గంలో నడిపిస్తుంది, అనుభవాన్నిస్తుంది.  

9, ఏప్రిల్ 2026, గురువారం

మానవ శరీర వ్యవస్థలో 3 శరీరాలు - పంచ కోశాలు


మానవ శరీర వ్యవస్థలో 
3 శరీరాలు - 5 కోశాలు 

మన మహర్షులు మన అస్తిత్వానికి, మన చుట్టూ ఉన్న అస్తిత్వానికి గల మూల కారణం ఏమిటో తెలుసుకునే క్రమంలో, వాళ్ళ తపోధ్యానాదుల ద్వారా ఈ మానవ శరీరాన్ని ఈ విధంగా దర్శించారు. 

మనందరికీ కనిపించే మానవ శరీరం, నిజానికి 3 శరీరాల వ్యవస్థ అని మహర్షులు దర్శించారు. వాటినే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలని చెప్తారు. అలాగే ఈ శరీర వ్యవస్థను పంచ కోశాల వ్యవస్థగా కూడా దర్శించడం జరిగింది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని 5 కోశాలు. ఈ 5 కోశాలకు అతీతమైనది శుద్ధ చైతన్యం లేక ఆత్మ అని అంటాం. 


స్థూల శరీరం
 ఇది కనిపించే భౌతిక శరీరం. అంటే  బయటున్న అవయవాలు, లోపలున్న అవయవాలు, యముకలు, రక్తం, నరాలు, రక్తనాళాలు, కండరాలు ఉతయాదివన్నీ కలిపిస్తే స్థూల శరీరం అవుతుంది. అన్నమయ కోశం స్థూల శరీరానికి సంబంధించినది. 

సూక్ష్మ శరీరం
 5 కరమేమదరుయాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 వాయువులు, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. మొత్తం కలిపి 19 సూక్ష్మ శరీరాలంటారు మన శాస్త్రకారులు. సహజ్ మార్గ్ ఆధ్యాత్మిక పథంలో ప్రధానంగా మనసు, బుద్ధి, అహంకారం, చిత్తము అనే నాలుగ సూక్ష్మ శరీరాలపైనే పని జరుగుతూ ఉంటుంది. ఈ నాలుగు సూక్ష్మ శరీరాలను అంతఃకరణ అని కూడా అంటారు. అంతఃకరణ శుద్ధి అనే పద్యం వాడుతూ ఉంటాం; దీని అర్థం ఈ 4 సూక్ష్మ శరీరాల శుద్ధి జరగటమే. అప్పుడే మనిషిలో ఆత్మ పరివర్తన జరుగుతుందని సహజ్ మార్గ్ బోధిస్తుంది. 
సూక్ష్మ శరీరంలోనే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలుటాయి.  

కారణ శరీరం
  ఆత్మకు అతి సమీపమైన ఆవరణను ఆనందమయ కోశం అని లేక అతి సమీపంగా ఉండే శరీరాన్ని కారణ శరీరం  అని అంటారు. మూడ్ శరీరాలకు అతీతమైనది ఆత్మ; లేక శుద్ధ కైతన్యం. అలాగే 5 కోశాలకు అతీతమైనది ఆత్మ ఇనికి లేక శుద్ధ కజాయితన్యం ఉనికి. దీని స్పర్శ కేవల ధ్యానం వల్లనే సాధ్యం. 

భగవద్గీత 7 వ అధ్యాయం, 7 వ శ్లోకం 
మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ ।
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥
భావం 
హృదయంలో ఉన్న ఆ ఆత్మే, ఆఅ శుద్ధ చైతన్యమే, ఆ అంతర్యామియే, ఆ దివ్యత్వమే, ఆ “సూత్రం”, ఆ దారం మనం ధ్యానం ద్వారా ఆ అంతర్యామిని అనుభవిస్తాము.  అన్ని హృదయాలను (మణులను)  ఒకే దైవ శక్తి (సూత్రం) కలిపి ఉంచుతుంది. 

7, ఏప్రిల్ 2026, మంగళవారం

గురు తేజ్ బహాదుర్ (1621-1675)

 



గురు తేజ్ బహాదుర్ (1621-1675) 

హార్ట్ఫుల్నెస్ సంస్థ ఈ సంవత్సరం ఏప్రిల్ 29 - మే 1 తేదీ వరకూ జరుపుకునే పూజ్య బాబూజీ మహారాజ్  జయంత్యుత్సవాలతో పాటుగా, సిక్కు ధర్మానికి సంబంధించిన మన తోటి సాధకులతో ప్రత్యేకంగా గురు తేజ్ బహాదుర్, సిక్కుల 9 వ గురువు జయంత్యుత్సవాలు కూడా జరుపుకోబోతున్నాం. మనం ప్రతీ సంవత్సరం ఈ భండారా సమయంలో టుకడోజీ మహారాజ్ జన్మదినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్న విషయం అందరికీ విదితమే. 

ఈ సందర్భంగా సిక్కు ధర్మానికి చెందిన 9 వ గురువైన గురు తేజ్ బహాదుర్ గురించి చిరు పరిచయం చేసుకుందాం. 

గురు తేజ్ బహాదుర్, 1621 ఏప్రిల్ 1 వ తేదీన అమృత్సర్  లో జన్మించారు. వీరు చిన్నప్పటి నుండి ధైర్యసాహసాలు కనబరచేవారు. సరళమైన వ్యక్తిత్వం, ధ్యానం అంటే ప్రత్యేక మక్కువ కనబరచేవారు. వీరు ఆనందపూర్ సాహెబ్ గురుద్వారాలో ఉంటూ సిక్కు మాట బోధనలను వ్యాపింపజేస్తూండేవారు. ఉత్తర భారతం అంతా విస్తృతంగా పర్యటించి ఆధ్యాత్మిక బోధనలనందిస్తూ ప్రజలను ఉద్ధరించే పనిలో జీవితంలో చాలా కాలం వెచ్చించారు. వీరి ముఖ్య బోధనలు - నిర్భయత్వం, వైరాగ్యం, సమత్వం, కరుణ, సరళయత్వం, ధ్యానమయ జీవనాన్ని బోధించేవారు. 

బలవంతపు ధర్మ పరివర్తన విషయంలో  మొగల్ సామ్రాజ్యాధినేతల ఆగడాలు, భరించలేక, కాష్మీరీ పండితులు,  వీరి సహాయం కోరితే, వెంటనే అంగీకరించారు. అందరికీ ఎవరికి నచ్చిన మతం వారు  అనుసరించే స్వేచ్ఛ అందరికీ ఉండాలని నమ్మేవారు. బలవంతం చేస్తున్నవారికి ఎదురు తిరిగేవారు.  ఆ సందర్భంలో ఔరంగజేబ్, అప్పటి మొగల్ చక్రవర్తి, ఆజ్ఞ మేరకు ఇస్లాం మతంలోకి మారడానికి నిరాకరించినందుకు గురు తేజ్ బహాదుర్ తలను బహిరంగంగా నరికేయడం జరిగింది. ఆ విధంగా 1675 లో, ఢిల్లీలో వారి దుర్మరణం సంభవించింది, మత స్వేచ్ఛను కాపాడటం కోసం ప్రాణాలు అర్పించి అమర వీరుడయినాడు. మత స్వేచ్ఛ కోసం, మానవ హక్కుల కోసం పోరాడటంలో ప్రపంచానికే ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోయారు. 

మన సిక్కు సోదర సోదరీమణులందరితో కలిసి పూజ్య దాజీ సమక్షంలో గురు తేజ్ బహాదుర్ గారిని మనసారా స్మరించుకుందాం. 

6, ఏప్రిల్ 2026, సోమవారం

నిశ్శబ్దం

 


నిశ్శబ్దం 

శబ్దం అంటే సంస్కృతంలో తరంగం అని అర్థం. ఆంగ్లంలో వైబ్రేషన్ అంటారు. ఈ సృష్టిలో, పరికించి చూసినట్లయితే  ప్రతీదీ శబ్దమే, ప్రతీదీ వైబ్రేషనే. సృష్టే ఒక శబ్దం, ప్రతీ జీవి ఒక శబ్దమే, మాట శబ్దం, భాష శబ్దం, అణువు శబ్దం, పరమాణువు శబ్దం, పదార్థం శబ్దం, ఆలోచన శబ్దం, ఉద్వేగం శబ్దం, భావం శబ్దం, కోరిక శబ్దం, వికారాలు శబ్దాలు ఇలా అన్నీ శబ్దాలని అర్థం అవుతుంది. ఈ శబ్దాలు కొన్ని బాహ్యంగా ఉన్నాయి, కొన్ని అంతరంగంలో ఉన్నాయి. 

మరి నిశ్శబ్దం అంటే ఏమిటి? బహుశా ఈ శబ్దాలన్నీటినీ దాటిన స్థితి అయి ఉండాలి, శబ్దాతీత స్థితి. అందులో నుండే ఈ శబ్దాలన్నీ ఆవిర్భవించి ఉండవచ్చు. నిశ్శబ్దం అంటే శూన్యమా? శూన్యంలో కూడా ఓంకార శబ్దం వినిపిస్తుందంటారు మన మహర్షులు. బహుశా అస్సలు యే శబ్దమూ పరమ శూన్య స్థితి కూడా ఉందేమో. అదే మనం అనుకునే దైవత్వం కావచ్చు. సమస్తానికి మూలం. అటువంటి అస్సలు శబ్దం లేని నిశ్శబ్దమే భగవంతుని బాష అని మన మాస్టర్లు అంటూ ఉంటారు. 

మరి ఈ నిశ్శబ్దాన్ని అనుభూతి చెందగలమా? అంటే తప్పకుండా అనుభూతి చెందవచ్చునంటారు మన మహర్షులు, మహాత్ములు. దానికి ధ్యాన సాధనే మార్గం. బాహ్య శబ్దాలను కొంత వరకూ తగ్గించుకోవచ్చు. అంతరంగ శబ్దాలను (ఆలోచనలు, ఉద్వేగాలు, కోరికలు, వికారాలు, సంస్కారాలు) తగ్గించుకోవడం కష్టసాధ్యమే. మనలో చాలా మందిమి ఇక్కడే ఇరుక్కుపోయి ఉన్నాం. 

అయితే వీటిని, ఈ అంతరంగ శబ్దాలను (గోలను) తగ్గించుకునే ఉపాయం ఏమిటి? బాబూజీ చెప్పిన చక్కని సరళమైన ఉపాయం: హృదయంలో దివ్యవెలుగు ఉంది అనే భావనపై ప్రాణాహుతి అనే దివ్యశక్తితో కూడిన ధ్యానం చేయమన్నారు. అటువంటి ధ్యానం వల్ల కలిగిన ధ్యానస్థితిని ఆస్వాదిస్తూ సాధ్యమైనంత ఎక్కువ సమయం నిలుపుకోమన్నారు. నెమ్మదిగా, క్రమక్రమంగా  మనసు లక్షణమే సూక్ష్మంగా మారుతుంది. నిజమైన నిశ్శబ్ద స్థితి అనతికాలంలోనే అనుభూతి చెందగలుగుతారు. ఈ నిశ్శబ్ద శితి యొక్క స్పర్శ మొట్టమొదటి రోజు నుండి అనుభూతి చెందడం కొంతమంది గమనించగలుగుతారు. 

కాబట్టి ధ్యానం ద్వారానే గాకుండగా మనందరమూ ప్రయత్న పూర్వకంగా లోపల, బయట కూడా నిశ్శబ్దాన్ని పాటించడానికి ప్రయత్నించినట్లయితే మన జీవితంలో అనేక సమస్యలకు పరిష్కార మార్గంగా పరిణమించడం మనం గమనించగలుగుతాం. ఈ నిశ్శబ్దానికి అతీతమైన దివ్యవెలుగు దిశగా చేసే యాత్రే  ఆధ్యాత్మిక యాత్ర. 





31, మార్చి 2026, మంగళవారం

24 వ తీర్థంకరుడు - మహావీర్ జయంతి

 



24 వ తీర్థంకరుడు - మహావీర్ జయంతి 

ఈ రోజు 24 వ తీర్థంకరుడు - మహావీర్ జయంతి. జైన సాంప్రదాయంలో, అనేక జన్మల తరువాత వారు చేసిన ఆధ్యాత్మిక సాధనాల వల్ల, అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని చేరుకున్న వ్యక్తిని తీర్థంకరుడు  అని అంటారు. ఆఅ అత్యున్నత స్థితిని కైవల్యం అంటారు. తీర్థంకర్ అనే పదానికి - అనేక జన్మ-మరణాల తరువాత ఈ సంసార దుఃఖ సాగరాన్ని దాటాడానికి ఏర్పరచిన తీర్థం లేక నీటి కాలువ అని అర్థం.

అటువంటి తీర్థంకరులు జైన సాంప్రదాయంలో 24 మంది ఉన్నారు. ఈ రోజు 24 వ తీర్థంకరుడైన వర్ధమాన్ మహావీర్ జయంతి. ఈ 24 తీర్థంకరులూ కూడా తలోక రకమైన వృక్షం క్రింద కూర్చొని ధ్యానించేవారట. అటువంటి వృక్షాన్ని దీక్షా వృక్షం అని అంటారు. 24 వ తీర్థంకరుడైన  వర్ధమాన్ మహావీరుడు సాళువ వృక్షం క్రింద ధ్యానించి కైవల్యాన్ని పొందారట. దీన్నే గుగ్గిలం చెట్టు అని కూడా అంటారు. 

ఈ 24 దీక్షా వృక్షాలను గురించి, 24 తీర్థంకరుల గురించి, ఈ మహాపురుషులకు పర్యావరణానికి మధ్య సన్నిహిత సంబంధం, తద్వారా మానవాళికి వారందించిన సందేశాన్ని చాలా విపులంగా మన పూజ్య గురుదేవులు దాజీ, మన ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు "హోలీ తీర్థంకర్స్" అనే గ్రంథంలో వివరించడం జరిగింది. తప్పక ప్రతీ ఆధ్యాత్మిక సాధకుడూ అధ్యయనం చేయవలసిన గ్రంథం.  ఈ గ్రంథ రచన ద్వారా ఎన్నో ఇప్పటి వరకూ వెల్లడి కాని ఆధ్యాత్మిక సత్యాలు, రహస్యాలు పూజ్య దాజీ వారా ఆవిష్కరింపబడ్డాయి.

24 వ తీర్థంకరుడైన వర్ధమానుడికి "మహావీర్" అనే నామకరణం దేవతలకే రాజైన ఇంద్రుడే చేశాడట. వర్ధమానుడి అత్యద్భుత సాహసం, అమితమైన సహనం, అత్యద్భుతమైన యథాతథంగా స్వీకరించే   తత్త్వాన్ని చూసి, ఈ బిరుదు ప్రదానం చేయడం జరిగిందట. మహావీరుడి జీవితంలో ఆయన ధ్యానాన్ని భంగం చేయడానికి అనేక మంది అనేక రకాలుగా చిత్రావధాలకు గురి చేసినప్పటికీ, ఎన్నో అతి కఠినమైన సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, ఊహించలేని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ వారు ధ్యానానికి భంగం కలుగానీయ లేదు. అన్నిటినీ సహనంతో భరించడమే గాక ఇబ్బందులు పెట్టినవారందరి పట్ల ప్రతీకార భావం లేకుండా అందరినీ పూర్తిగా క్షమించేవారు కూడా. కలిగిన కష్టాలన్నీ తన కర్మలను నష్టం చేయడానికేనాని భావించేవారు. ఒక దేవత, ఆయన తపస్సుకు మెచ్చి, తనను శరీరంతో సహా స్వర్గానికి తీసుకువెడతానని, ఆఅ తరువాత మోక్షాన్ని కూడా ప్రసాదిస్తానని ప్రలోభ పెడితే కూడా లొంగక ఈ సమాధానం ఇస్తారాయన - "నాకు ఎవ్వరూ మోక్షం ఇవ్వలేరు. మనిషి తన కృషీ, ప్రయత్నాల వల్ల మాత్రమే మోక్షాన్ని పొందగలాడు. మొట్టమొదటగా దానికి అర్హత సంపాదించాలి, అప్పుడే మోక్షాన్ని అందుకోగలుగుతాడు" అని అన్నారట. వెంటనే ఆఅ దేవత తన పొరపాటును గ్రహించి, మహావీరుడి పాడాలపై పది క్షమాపణ  వేడుకుంటాడట. 

వారు కైవల్య స్థితిని పొందిన తరువాత పలికిన మాటలు ఇలా ఉన్నాయి - "నేను పరమ పవిత్ర ఆత్మను. నేను అంతటా చూస్తునది ఆ పరమ పవిత్ర ఆత్మనే. పరిస్థితులు శరీరానికి కష్టాలను, నొప్పిని కలిగించవచ్చు, కానీ ఇప్పుడు నేను సర్వత్ర ఆ పవిత్రాత్మనే చూడగలుగుతున్నాను."

ఆఅ దివ్య తీర్థంకరుని మన గురుదేవుల కృప వల్ల ఈ మాత్రం తెలుసుకో గలిగినందుకు, వారికి కృతజ్ఞతను అనుభూతి చెందుతూ, ఆధ్యాత్మిక సాధకులు తమ మార్గంలో వచ్చే ఇబ్బందులను, కష్టాలను యే విధంగా ధైర్యంగా ఎదుర్కొనే అవసరం ఉందో జీవించి చూపించిన ఈ దివ్య పురుషుని జన్మదినాన, కైవల్యం పొందిన దినాన కనీసం ఒకసారి హృదయపూర్వకంగా స్మరించుకుందాం. పూజ్య గురుదేవులు వ్రాసిన "హోలీ తీర్థంకర్స్" గ్రంథాన్ని చదువుకుందాం. 

30, మార్చి 2026, సోమవారం

అభ్యాసి దినచర్య

 


అభ్యాసి  దినచర్య

సహజ్ మార్గ్ పథంలో నడిచే అభ్యాసి దినచర్యలో మన మాస్టర్ల ప్రకారం ఉండవలసిన అంశాలు:
ఉదయం ధ్యానం (సూర్యోదయానికి ముందు పూర్తయ్యేలా సమయం ఎంచుకోవడం; అదే సమయంలో, అదే ఆశనంలో, అదే ప్రదేహంలో ప్రతి నిత్యం ధ్యానానికి కూర్చోవడం. )

సాయంకాల శుద్ధీకరణ/నిర్మలీకరణ ( ఆ రోజు పనంతా పూర్తయిన తరువాత సాధ్యమైనంత వరకూ రాత్రి భోజనానికి పూర్వం)

రాత్రి 9:00 గంటలకు విశ్వప్రార్థన

రాత్రి పడుకొనే ముందు ప్రార్థనా-ధ్యానం 

వ్యక్తిగత సిట్టింగ్ (వారానికి ప్రశిక్షకుని వద్ద కనీసం రెండు సిట్టింగులు)

వారానికి రెండు సత్సంగాలు  (బుధవారం, ఆదివారం)

ప్రతి రోజూ ధ్యానం తరువాత ఆధ్యాత్మిక సాహిత్య పఠనం 

ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకూ బయట ప్రపంచంతో వ్యవహరించేప్పుడు దశ నియమాలను అనుసరించే ప్రయత్నంలో ఉండటం.

ఇతరులతో సంభాషించే సమయంలో పూజ్య లాలాజీ అందించిన సంభాషణా సూత్రాలను పాటించే ప్రయత్నంలో ఉండటం. 

అభ్యాసి దినచర్య పై విధంగా ఉంటూ జీవన విధానాన్ని కొనసాగించినట్లయితే మనిషి జీవితం పరిపూర్ణతను సంతరించుకుంటుందంటారు మన మాస్టర్లు. మానవ జీవిత యదార్థ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు అభ్యాసి. ఆత్మోద్ధరణ అనేది దేనినైతే అంటామో అది సిద్ధిస్తుంది.    

29, మార్చి 2026, ఆదివారం

మన ఆధ్యాత్మిక పథము - సహజ్ మార్గ్ పథము

 


హృదయ గుహ చివరిలో వెలుతురు  

మన ఆధ్యాత్మిక పథము - సహజ్ మార్గ్ పథము

సత్యాన్వేషి తన ప్రస్తుత స్థితి నుండి పరమ సత్య తత్త్వాన్ని, మూలాన్ని తెలుసుకోవడానికి అవలంబించే పథమే ఆధ్యాత్మిక పథం. మూలాన్ని లేక భగవంతుని కనుగొనడానికి ఎన్ని పుర్రెలున్నాయో అన్ని పథాలున్నాయంటారు. ప్రతీ హృదయమూ తనకు అనుకూలమైన పథం ఎన్నుకుంటూ తన ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇదంతా సంఘర్షణే. ఈ సంఘర్షణలో భాగంగానే అప్పుడప్పుడు రకరకాల పథాలను అవలంబిస్తూ ఉంటాడు కూడా సాధకుడు. 'ఇదీ నా అసలైన పథము, నేను వెతుకుతున్న పథం ఇదే' అని ఘంటాపదంగా మనసులో కచ్చితంగా అనిపించేమత వరకూ అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఆధ్యాత్మిక పథాలు  మారవలసి వస్తే మారడానికి సాధకుడు సంకోచించరాడు. సంకోచించడం వల్ల సమయం వృథా అయ్యే ప్రమాదం ఉంది. 

మూలానికి జేర్చే మార్గాలు అనేకం ఉండవచ్చు. కానీ అన్నిటికంటే దగ్గర మార్గం ఒక్కటే ఉంటుందని, అనేకం ఉండవని, అందరూ అంగీకరించవలసిందే. అన్నిటి కంటే చేరువైనది మనిషికి తన హృదయం. కాబట్టి హృదయం ద్వారా గమ్యాన్ని జేర్చే పథమే అతి దగ్గర పథము. అందుకే సహజ్ మార్గ్ అటువంటి అతి చేరువైన మార్గం. హృదయం మీద ధ్యానించే మార్గం. అందునా సహజమైన మార్గం, సరళమైన మార్గం. 

ఆధ్యాత్మిక పథం ద్వారా చేసే ప్రయాణం ఆధ్యాత్మిక యాత్ర. ఈ యాత్ర భూమిపైన చేసే ప్రయాణం లాంటిది కాదు; ఆకాశంలో చేసే ప్రయాణం లాంటిది కూడా కాదు; నీటిలో చేసే ప్రయాణం లాంటిది కూడా కాదు; ఆఖరికి అంతరిక్షయానం  లాంటిది కూడా కాదు.  మరి ఈ యాత్ర ఎలా జరుగుతూ ఉంటుంది? ఈ యాత్ర చేస్తున్నదెవరు? 


ఇక్కడ యాత్ర చేస్తున్నది 'నేను' అనే జీవుడే. జీవుడంటే ఒక చేతనం. తన ప్రస్తుత చేతనంలో ఉన్న వెలితి వల్ల మరింత ఉన్నత చేతనం పొందాలన్న తపనతో ఈ యాత్ర కొనసాగిస్తూ ఉంటాడు. అంటే ఈ యాత్ర చేతనాపరమైన యాత్ర అన్నమాట. ఈ చేతననే మనం ఎరుక, స్పృహ, చైతన్యం అన్నపదాలతో కూడా సంభోదయిస్తూ ఉంటాం. ఈ యాత్రను అందుకే చైతన్య వికాస యాత్ర అని కూడా అంటాం. ఈ వికాసం చరమ స్థాయికి చేరుకునే వరకూ, అంటే ఇక వికాసం చెందడానికి, పరిణామం చెందడానికి అవకాశం లేని అవస్థకు చేరుకునేంత వరకూ జీవుడు ప్రశాంతంగా ఉండలేడు, తాపిస్తూనే ఉంటాడు. ఈ యాత్ర ద్వారా జీవుడు తన అస్తిత్వాన్ని, తన ఉనికిని, కొంచెం-కొంచెంగా యాత్ర కొనసాగుతున్న క్రమంలో యథాతథంగా తెలుసుకుంటూ ఉంటాడు. ఈ యాత్రలో కొన్ని ప్రధాన మైలురాళ్ళే - ముక్తి, మోక్షం, ఆత్మ సాక్షాత్కారం, లయావస్థ, అలా యాత్ర అనంతంగా కొనసాగే యాత్ర. 


ఈ యాత్ర పూర్తవడానికి ఎన్ని రోజులైనా కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, ఎన్ని జనమలైనా పట్టచ్చు, క్షణంలో అయిపోవచ్చు, కొన్ని మాసాలలో అయిపోవచ్చు; అంతా జీవుడి తపన, శ్రద్ధాసక్తులపై, తన నిష్ఠపై, ఎంచుకున్న మార్గంపై, అన్నిటికంటే ముఖ్యం ఎంచుకున్న గురువుపై ఆధారపడి ఉంటుంది. 

25, మార్చి 2026, బుధవారం

నాలుగు మహావాక్యాలు

 


నాలుగు మహావాక్యాలు 

నాలుగు మహావాక్యాలు వేదోపనిషత్తుల ఉద్ఘోషలు.  మన ప్రాచీన ఋషుల ప్రత్యక్షానుభూతులు.  వీటిపై మహాభాష్యాలు వ్రాయడం ద్వారా ప్రాచుర్యంలోకి వీటిని తీసుకు వచ్చిన మహాత్ములు, శ్రీ ఆది శంకరాచార్యులవారు. జీవాత్మ, పరమాత్మలో సంపూర్ణ ఐక్యం పొందడమనే మానవ జీవిత పరమార్థాన్ని, వెల్లడించే నాలుగు మహా వాక్యాలు ఇలా ఉన్నాయి:
1) ప్రజ్ఞానం బ్రహ్మ : ఐతరేయ ఉపనిషత్తులో నుండి గ్రహించినది, ఋగ్వేదానికి సంబంధించినది.  చైతన్యమే బ్రహ్మము అని దీని అర్థం. అందుకే బ్రహ్మ నిర్వచన వాక్యం, బ్రహ్మ లక్షణ వాక్యం అని కూడా సంభోదిస్తారు.  

2) అహం బ్రహ్మాస్మి : బృహదారణ్యక ఉపనిషత్తులో నుండి గ్రహించినది, యజుర్వేదానికి సంబంధించినది. దీన్ని అనుభవ వాక్యం అని కూడా అంటారు. 

3) తత్త్వమసి : ఛాందోగ్యోపనిషత్తు నుండి గ్రహించినది, సామవేదానికి సంబంధించినది. దీన్ని ఉపదేశ వాక్యం అని కూడా అంటారు. 

4) అయమాత్మ బ్రహ్మ : మాండూక్యోపనిషత్తులో నుండి గ్రహించినది, అథర్వ వేదానికి  సంబంధించినది. ఈ వాక్యం ప్రత్యక్షానుభవాన్ని  సూచిస్తుంది. సాక్షాత్కార వాక్యం అని కూడా అంటారు. 


24, మార్చి 2026, మంగళవారం

సహజ్ మార్గ్ లో మార్చ్ 24, 1945 ప్రాశస్త్యం


సహజ్ మార్గ్ లో మార్చ్ 24, 1945 ప్రాశస్త్యం

 ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ కనీ, విని ఎరుగని, యే పవిత్ర ఆధ్యాత్మిక సాహిత్యంలో కనిపించనిది, నమ్మడానికి కూడా  కష్టసాధ్యమయ్యే సత్యం, ఒక అత్యద్భుత సంఘటన ఈ మార్చ్ 24, 1945 న చోటు చేసకుందట.  పూజ్య దాజీ ఇటీవల బసంత పంచమి మొట్టమొదటి సందేశంలో లాలాజీని స్మరిస్తూ వెల్లడించిన సత్యం ఇది. 

మనందరికీ ఒక గురువు తన శిష్యునికి దీక్షనివ్వడం విన్నాం, చదివ్యయం, మనలో కొంతమంది అనుభూతి కూడా చెంది ఉంటాం. దీన్నే ఉపదేశం అని కూడా అంటారు. ఈ దీక్ష అనేది అనేక ఆధ్యాత్మిక ఉన్నత స్థాయిల్లో జరుగుతూ ఉంటుంది; సాధకుడు ఎంతో ఆధ్యాత్మికోన్నతి, శరణాగతి, ప్రేమ, పవిత్రత వినమ్రత, వంటి అనేక అంశాలలో పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు, ఆయా స్థాయిల్లో దీక్షానివ్వడం జరుగుతూ ఉంటుందట. ఈ మార్చ్ 24, 1945 వ తేదీన మానవ జన్మలో ఉన్న ఒక శిష్యునికి తన గురువు గాక, సాక్షాత్తు ఆ పరతత్త్వమే, ఆ పరమాత్మే స్వయంగా, నేరుగా దీక్షనిచ్చారట. వారే పూజ్య మన బాబూజీ మహారాజ్.  ఈ మానవ ఊహకందని నిజాన్ని పూజ్య బాబూజీ తన ఆధ్యాత్మిక డైరీలో స్వయంగా వ్రాసుకున్నారు. ఈ సంఘటనను, శ్రీ కృష్ణ భగవానుడు, స్వామి వివేకానంద వారిని కీర్తిస్తూ, ఇటువంటి సంఘటన ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ జరగలేదని ప్రశంసిస్తారు. 

మనం ఉన్న పరిస్థితుల్లో ఈ మహత్తర అంశాన్ని అర్థం చేసుకోవాలంటే, ఈ విషయంపై బాబూజీని స్మరిస్తూ అత్యంత భక్తిప్రపత్తులతో సుదీర్ఘ ప్రార్థనా పూర్వక ధ్యానం చేసి ప్రయత్నించడమే తప్ప మరో మార్గం లేదు. మేధస్సుతో అర్థం చేసుకునే విషయం అస్సలు కాదు. వారి అనుగ్రహం ద్వారా తప్ప అర్థం కాని నిగూఢ అంశం ఇది. వారి అపార అనుగ్రహాన్ని ఆకర్షించే విధంగా మనలను మనం మలచుకునే ప్రయత్నంలో నిమగ్నులై ఉందాం. 

23, మార్చి 2026, సోమవారం

హార్ట్ఫుల్నెస్ లో ధ్యాన కేంద్రాల ప్రారంభోత్సవాలు

 


దోమల్గుడా యోగాశ్రమం  హైదరాబాదు ప్రారంభోత్సవం - బాబూజీ 

హార్ట్ఫుల్నెస్ లో ధ్యాన కేంద్రాల ప్రారంభోత్సవాలు 

హార్ట్ఫుల్నెస్ - శ్రీ రామ చంద్ర మిషన్ సంస్థలో ఆశ్రమాల లేక ధ్యాన కేంద్రాల ప్రారంభోత్సవం ఒక విశిష్ఠమైన ఆధ్యాత్మిక వాతావరణంతో కూడుకుని ఉంటాయి. అందులోనూ సాక్షాత్తు మాస్టర్లు ప్రారంభిస్తున్నప్పుడు వీక్షిస్తున్నవారందరి, అక్కడున్నవారందరి హృదయాల్లో  ఒక అలౌకిక ఆనందం చోటు చేసుకుంటుంది. 

పైన చిత్రం 1967 మే లో దోమలగుడా, హైదరాబాదులో, బాబూజీ కరకమలాలచే  యోగాశ్రమ ప్రారంభోత్సవం చేస్తున్న చిత్రం. చిత్రం చూస్తేనే భక్తులు పరవశిస్తారు. అలాగే పూజ్య చారీజీ మణప్పాకంలో, బాబూజీ మెమోరియల్ ఆశ్రమం ప్రారంభిస్తున్నప్పుడు అనుభూతి చెందడం జరిగింది. అలాగే పూజ్య దాజీ కాన్హాశాంతి వనం లో మన గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభించినప్పుడు  కూడా హృదయాలు పులకించిపోవడం మనందరమూ అనుభూతి చెందాం. 

అంతే కాదు, ఇతర ఆశ్రమాలు గాని, చిన్న-చిన్న ధ్యాన కేంద్రాలను ప్రారంభోత్సవ సందర్భాలలో కూడా అటువంటి వాతావరణమే ఆయా ప్రదేశాలలో నెలకొని ఉండటం గమనించడం జరిగింది. దీనికి మూల కారణం గురుదేవుల సంకల్పం అయితే, స్థానికంగా అభ్యాసుల హృదయాల్లో ఉన్న శ్రద్ధాభక్తులు,  సంబంధించిన పనుల్లో, ఆలోచనల్లో, మనసుల్లో  కనబరచే ఉత్సాహం వల్ల ద్విగుణీకృతం అవుతుంది. అందుకే అభ్యాసులు ఇటువంటి సందర్భాలలో ఆనందంగా ఎవరి పనులు వాళ్ళు ప్రేమ, సామరస్యాలతో చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ వాతావరణం కొట్టొచ్చినట్లుగా అక్కడున్న ప్రతి ఒక్కరూ తమ హృదయాలలో అనుభూతి చెందడం జరుగుతుంది. హృదయాంతరాళంలో కలిగే ఈ ఆనందం, ఈ ఆత్మసుఖం, మనలో పరివర్తనకు తగిన పునాదులు ఏర్పరస్తుంది. ఆ విధంగా జీవితం అంతా జీవించే అవకాశం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది. 

ఈ ధ్యాన కేంద్రాల్లో ఆధ్యాత్మిక సమావేశాలు, నిత్యం ధ్యానం జరుగుతూ ఉంటుంది. శక్తి భాండాగారాలుగా ఉంటాయి. మనిషి ఆత్మపరంగా జీవితంలో అలసిపోయినప్పుడు సేద తీర్చుకునే ప్రదేశాలు. మనిషి మరింత మెరుగయ్యే వాతావరణం ఉన్న కేంద్రాలు. ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడే కాంతి కేంద్రాలు. హృదయంలోని అంధకారాన్ని తొలగించగలిగే సత్తా ఉన్న కేంద్రాలు. 

చారీజీ వీటిని కాంతి కేంద్రాలుగా అభివర్ణించేవారు. వీటిని మాస్టర్లు తమ ఆధ్యాత్మిక సంకల్పంతో ఛార్జ్ చేస్తారు. ఈ కేంద్రాలకు వెళ్ళేప్పుడు, సాధకుడు మాస్టర్ వద్దకు, గురువు వద్దకు వెడుతున్నామన్న భావనతో వెళ్ళమన్నారు చారీజీ.

ఇక్కడ సోదరభావం, సమష్టి చైతన్యం (ఎగ్రెగోర్) వల్ల కలిగే ప్రయోజనాలు ప్రత్యక్షంగా అనుభవిస్తేనే కానీ తెలియదు. హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రాలు అంతా ప్రశస్తమైనవి. అందరూ వీటిని సద్వినియోగం చేసుకుందురుగాక. 



14, మార్చి 2026, శనివారం

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7

 

కరీంనగర్ ఆశ్రమంలో ఆవులు 2020 
తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7

పూజ్య దాజీ ప్రసాదించిన మరో వరం. కరీంనగర్లో పని చేస్తున్న రోజుల్లో 2020 లో మన స్థానిక అభ్యాసులు మన ఆశ్రమంలో ఆవులు పెంచడం జరిగింది. అప్పుడొక ఆవు, ఒక దూడకు జన్మనిచ్చింది. ఈ సమాచారాన్ని తెలియజేస్తూ, ఆ దూడకు యేదైనా పేరు పెట్టమని పూజ్య దాజీని కోరడం జరిగింది, ఫోటో కూడా పంపించడం జరిగింది. దానికి వారు  ఎంతో కరుణతో "భోలీ" అని నామకరణం చేశారు.
 
పైన చిత్రంలో కుడి ప్రక్కన ఉన్నది భోలీ. ఎడమ ప్రక్కన ఉన్నది అన్నపూర్ణ. సోదరులు మధుసూదన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ఆవుల పట్ల మంచి శ్రద్ధ చూపించేవారు. ధన్యులు. 


12, మార్చి 2026, గురువారం

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 6


తెలంగాణా గ్రామాల్లో  ధ్యానం  

ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 6

భారత దేశ గ్రామాల్లో ధ్యానం పరిచయం చేసే సౌభాగ్యం మనందరికీ  గురుదేవుల దయ వల్ల కలుగుతూ ఉంది. అది ఒక చక్కని అనుభూతి. పైన వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి. ఇందులో మాట్లాడుతున్నవాళ్ళందరూ ధ్యానం సాధన చేస్తున్న మన అభ్యాసులే. ఈ వీడియో మన గురుదేవులైన పూజ్య దాజీకి బాగా నచ్చిన వీడియో. 

ఆయా గ్రామాల సర్పంచ్ ల సహాయంతో లేక మన అభ్యాసుల సహాయంతో అక్కడ ప్రవేశించి అనేక గ్రామాల్లో 3 రోజుల గ్రామ-ధ్యానోత్సవాలు నిర్వహించడం కొనసాగుతూ ఉంది.  ఒక గుడిలోనో లేక బడిలోనో లేక గ్రామ పంచాయితీ కేంద్రంలోనో లేక గ్రామ గ్రంథాలయంలోనో నిర్వహించడం జరుగుతూ ఉంది. కొన్ని కేంద్రాలలో సాధన చక్కగా కొనసాగిస్తున్నారు కూడా; అటువంటి చోట మన పరాశిక్షకులు తమ సేవలు అందిస్తున్నారు కూడా. 

నేను నిర్వహించిన మొట్టమొదటి గ్రామం కరీంనగర్ జిల్లాలోనో హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజజూపల్లిలో ధ్యానోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. హనుమంతుడి గుడిలో నిర్వహించాం. ఇప్పటికీ ఆ కేంద్రం కొనసాగుతూ ఉంది. 

ఆ తరువాత అనేక గ్రామాల్లో ఈ గ్రామ-ధ్యాయణోత్సవాలు నిర్వహించడం జరిగింది. కుల, జాతి, మత బేధం లేకుండా ఆసక్తి గలవారందరికీ ఈ ధ్యానాన్ని పరిచయం చేయగలగడం మన గొప్ప అదృష్టం. మనిషి చేయగల ఉత్కృష్ట సేవ మనిషి హృదయానికి ప్రశాంతత, మనసును స్థిరంగా చేయడమే గదా. అది మన ధ్యానం ఎటువంటి నేపథ్యం నుండి వచ్చినవారికైనా తేలికగా అందిస్తుంది. 

మన గ్రామాలన్నీ సాధ్యమైనంత త్వరగా ధ్యానమయమవ్వాలని  అందరూ ప్రార్థిద్దాం, కృషి చేద్దాం. 



28, ఫిబ్రవరి 2026, శనివారం

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 5

 


జయ్యారం గ్రామ ఆశ్రమం - ధ్యాన మందిరం 

తెలంగాణాలో 

శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా 

నా ప్రస్థానం - 5


పూజ్య గురుదేవల కృపా దృష్టి కొనసాగుతూ మహబూబాబాద్ జిల్లా లోని జయ్యారం అనే ఒక చిన్న గ్రామంలో మన ఆశ్రమ నిర్మాణ పనిలో కూడా ఒక చిరు పాత్ర లభించింది.
 
ఇక్కడ సుమారు 30 అభ్యాసులున్నారు.  ఈ కేంద్రం విశేషం ఏమిటంటే వాతావరణం ప్రేమతో నిండి ఉంటుంది. అభ్యాసులందరూ ప్రేమపూర్వకంగా మెలుగుతూ ఉంటారు. ఆశ్రమ నిర్మాణ సమయంలో ఆశ్రమ నిర్మాణ వర్కర్ల పట్ల వీరు కనబరచిన ఆతిథ్యం, ప్రేమ అద్వితీయం. ఈ అభ్యాసులందరూ ఆశ్రమం కోసం, నిర్మాణ లేబర్ తో సమానంగా (నిర్మాణ సమయం అంతా) శ్రమించడం హృదయాన్ని ద్రవించింది.   ఇక్కడ చుట్టు-ప్రక్కల ఉన్న అభ్యాసీలు కూడా ఎంతో సహృదయంతో తమ విరాళాలతో సునాయాసంగా ఆశ్రమ నిర్మాణానికి తోడ్పడ్డారు. వీళ్ళు అజ్ఞాతంగా ఉండటానికే ఇష్టపడే అభ్యాసులు.  జయ్యారం బృందమే గాక బంగ్లా, ఖమ్మం బృందాలు కూడా  గొప్ప సహకారాన్ని అందించారు. 10 మాసాల్లోనే  ఈ నిర్మాణం వీళ్ళందరి సహకారంతో చక్కగా తీర్చి దిద్దబడింది. పూజ్య గురుదేవులు రిమోట్ గా సత్సంగాన్ని నిర్వహించి ప్రారంభించడం జరిగింది. 

దీని చరిత్ర చాలా ఆసక్తికరమైనది. 1976 లో ఈ గ్రామానికి చెందిన మన ప్రశిక్షకులు, ఉపాధ్యాయులు అయిన  కీ.శే. భిక్షమయ్యగారు 15 మంది అభ్యాసులతో ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. 1981 లో 436 రూపాయలతో చిన్న భూమి కొనుగోలు చేయడం జరిగింది. జనవరి 10,1983 న పూజ్య బాబూజీ మహారాజ్ ఎంతో కరుణతో ఇక్కడ ఆశ్రమ నిర్మాణానికని 6000 రూపాయలు అనుగ్రహించడం జరిగింది. ఆ భూమిని కొంచెం పెద్దది చేసి ఈ నాడు ఈ ఆశ్రమ నిర్మాణం జనవరి, 2023 లో పునరుద్ధరించబడి, ప్రారంభించబడింది. 

ఈ ఆశ్రమ నిర్మాణ క్రమంలో సామరస్యం, పరస్పర గౌరవం, ప్రేమ ఉంటే పనులు ఎంత త్వరగా జరుగుతాయో ప్రత్యక్షంగా నేర్చుకోవడం జరిగింది. 
 


ఒత్తిళ్ళు

ఒత్తిళ్ళు  ఒత్తిడి. మనిషి జీవితం ఒత్తిళ్ళ మయం. పుట్టుకే ఒక ఒత్తిడి, తల్లి గర్భంలో ఒత్తిడి, తల్లికి ఒత్తిడి. బయట  పడ్డాక యేడ్చే దాకా ఒత్తిడి....