గురు తేజ్ బహాదుర్ (1621-1675)
హార్ట్ఫుల్నెస్ సంస్థ ఈ సంవత్సరం ఏప్రిల్ 29 - మే 1 తేదీ వరకూ జరుపుకునే పూజ్య బాబూజీ మహారాజ్ జయంత్యుత్సవాలతో పాటుగా, సిక్కు ధర్మానికి సంబంధించిన మన తోటి సాధకులతో ప్రత్యేకంగా గురు తేజ్ బహాదుర్, సిక్కుల 9 వ గురువు జయంత్యుత్సవాలు కూడా జరుపుకోబోతున్నాం. మనం ప్రతీ సంవత్సరం ఈ భండారా సమయంలో టుకడోజీ మహారాజ్ జన్మదినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్న విషయం అందరికీ విదితమే.
ఈ సందర్భంగా సిక్కు ధర్మానికి చెందిన 9 వ గురువైన గురు తేజ్ బహాదుర్ గురించి చిరు పరిచయం చేసుకుందాం.
గురు తేజ్ బహాదుర్, 1621 ఏప్రిల్ 1 వ తేదీన అమృత్సర్ లో జన్మించారు. వీరు చిన్నప్పటి నుండి ధైర్యసాహసాలు కనబరచేవారు. సరళమైన వ్యక్తిత్వం, ధ్యానం అంటే ప్రత్యేక మక్కువ కనబరచేవారు. వీరు ఆనందపూర్ సాహెబ్ గురుద్వారాలో ఉంటూ సిక్కు మాట బోధనలను వ్యాపింపజేస్తూండేవారు. ఉత్తర భారతం అంతా విస్తృతంగా పర్యటించి ఆధ్యాత్మిక బోధనలనందిస్తూ ప్రజలను ఉద్ధరించే పనిలో జీవితంలో చాలా కాలం వెచ్చించారు. వీరి ముఖ్య బోధనలు - నిర్భయత్వం, వైరాగ్యం, సమత్వం, కరుణ, సరళయత్వం, ధ్యానమయ జీవనాన్ని బోధించేవారు.
బలవంతపు ధర్మ పరివర్తన విషయంలో మొగల్ సామ్రాజ్యాధినేతల ఆగడాలు, భరించలేక, కాష్మీరీ పండితులు, వీరి సహాయం కోరితే, వెంటనే అంగీకరించారు. అందరికీ ఎవరికి నచ్చిన మతం వారు అనుసరించే స్వేచ్ఛ అందరికీ ఉండాలని నమ్మేవారు. బలవంతం చేస్తున్నవారికి ఎదురు తిరిగేవారు. ఆ సందర్భంలో ఔరంగజేబ్, అప్పటి మొగల్ చక్రవర్తి, ఆజ్ఞ మేరకు ఇస్లాం మతంలోకి మారడానికి నిరాకరించినందుకు గురు తేజ్ బహాదుర్ తలను బహిరంగంగా నరికేయడం జరిగింది. ఆ విధంగా 1675 లో, ఢిల్లీలో వారి దుర్మరణం సంభవించింది, మత స్వేచ్ఛను కాపాడటం కోసం ప్రాణాలు అర్పించి అమర వీరుడయినాడు. మత స్వేచ్ఛ కోసం, మానవ హక్కుల కోసం పోరాడటంలో ప్రపంచానికే ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోయారు.
మన సిక్కు సోదర సోదరీమణులందరితో కలిసి పూజ్య దాజీ సమక్షంలో గురు తేజ్ బహాదుర్ గారిని మనసారా స్మరించుకుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి