11, జులై 2026, శనివారం

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రం / ఆశ్రమం – ఆధ్యాత్మిక వికాసానికి పవిత్ర ప్రదేశం


హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రం / ఆశ్రమం – ఆధ్యాత్మిక వికాసానికి పవిత్ర ప్రదేశం 

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రాన్ని లేదా ఆశ్రమాన్ని వ్యక్తిగత తపస్సుకు, సామూహిక తపస్సుకు పవిత్రమైన సాధనా క్షేత్రంగా వినియోగించుకోవాలి.

అలసి–సొలసిన ఆత్మకు విశ్రాంతి లభించే ఆధ్యాత్మిక నిలయంగా అక్కడ కొంత సమయాన్ని గడపాలి. ఆశ్రమంలో అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడానికి, ఆధ్యాత్మిక విషయాలపై చర్చించుకోవడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఆ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

పరాశిక్షకుల (Preceptors) ద్వారా వ్యక్తిగత సిట్టింగులు పొందడానికి సమయాన్ని కేటాయించాలి. ఆశ్రమాన్ని మన స్వంత గృహంగా భావించి, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్వచ్ఛంద సేవ చేయాలి. అభ్యాసుల మధ్య పరస్పర ప్రేమ, స్నేహం, సామరస్యం, సహకార భావాలు పెంపొందించే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి.

ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న కొత్తవారిని ఆశ్రమానికి ఆహ్వానించి, వారికి ధ్యానం నేర్పించే ఏర్పాట్లు చేయాలి. ఈ విధంగా ప్రతి అభ్యాసి ఆధ్యాత్మిక సేవలో భాగస్వామి కావాలి.

మన గురువులు ఒక అద్భుతమైన భావాన్ని తెలియజేశారు—“ఆశ్రమానికి లేదా సత్సంగానికి వెళుతున్నప్పుడు, మాస్టర్ సన్నిధికి వెళుతున్నామనే భావంతో వెళ్లాలి.” అటువంటి వినయపూర్వకమైన, పవిత్రమైన భావంతో ఆశ్రమంలో గడిపిన ప్రతి క్షణం మన ఆధ్యాత్మిక ప్రగతికి బలమైన పునాది అవుతుంది.


 

8, జులై 2026, బుధవారం

ధ్యానానికి సమయం లేదా ?

 


ధ్యానానికి సమయం లేదా?

దినచర్యలో భాగమై ఉండవలసిన ధ్యానం చేయమంటే, ఆధునిక సమయంలో చాలా మంది సమయం లేదని  అంటూంటారు.  "సమయం లేదు"- అంటే జీవితం ఇంకా ఎంతో కాలం లేదని అర్థం. ఇది నిజం కూడా.  అందుకే సమయం లేదు కాబట్టే ధ్యానానికి సమయం దొరికేలా మన దినచర్యను సవరించుకోవలసి ఉంది. "ధ్యానానికి సమయం లేదు" అనడం కన్నా "టైము మేనేజ్ చేసుకోలేకపోతున్నాను "అనడం నయం. 

విచిత్రంగా నిత్యం ధ్యానం చేసినట్లైతే మరింత సమయం దొరుకుటుందంటారు పూజ్య దాజీ. ఇది అనుభవంలో అందరికీ తెలుస్తుంది. ఉదయాన్నే ధ్యానంలో కూర్చున్నప్పుడు రోజులో మనం చేయవలసిన పనుల లిస్టు ఆలోచనల రూపంలో కనిపిస్తాయి. ఆఅ ధ్యానంలోనే ప్రాధాన్యత ప్రకారం పనులను అమార్చుకోవడం, అనవసరమైన పనులను ప్రక్కకు పెట్టేయడం వంటివి వాటంతటవే జరిగిపోవడం మనం గమనించవచ్చు. ఆఅ విధంగా ఆ రోజు పనులన్నీ సజావుగా సమయం వృథా అవకుండా అర్థవంతంగా నాణ్యంగా గడుస్తుంది. ప్రతి నిత్యం ఆ విధంగా జీవించడం అలవడటం వల్ల జీవితమే నాణ్యమైన జీవితంగా మారే అవకాశం ఉంటుందంటారు పూజ్య దాజీ. 

అలాగే తనను తాను "కాలోస్మి.." అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే కాలం అంటేనే భగవంతుడు. అంటే కాలాన్ని వ్యర్థం చేయడం అంటే భగవంతుని నిర్లక్ష్యం చేసినట్లే, భగవంతుని వృథా చేసినట్లే - అన్నారు పూజ్య చారీజీ. 

ధ్యానం చేస్తే వచ్చే ప్రయోజనాలు అందరికీ తెలిసినా, దానికి సమయం లేదనడం ఒక ప్యారడాక్స్ (వైరుధ్యం). మనలో ఉన్న శక్తి అన్నీ రకాలుగా ఖర్చైపోయే సోషల్ మీడియాకు, ఫోన్లకు,  అంతులేని చేయవలసిన పనుల జాబితాలకు, రీల్స్ చూడటానికి దొరికే సమయం ధ్యానానికి లేకపోవడం గమనార్హం. అంటే మన ప్రాధాన్యతలు తలక్రిందులైపోయాయి. ధ్యానంలో సమయం ఆదాయ అవుతుంది, శక్తి పుంజుకుంటాం, మనోబుద్ధ్యహంకారాలు శుద్ధి అవుతాయి, జీవితం అర్థవంతంగా గడుస్తుంది. 

ఇవన్నీ కనీసం ఆలోచిద్దాం. మన జీవితాలను మరింత మెరుగుపరచుకుందాం. 

గురుపరంపర ప్రాముఖ్యత - సహజ్ మార్గ్ గురుపరంపర

  గురుపరంపర ప్రాముఖ్యత,  సహజ్ మార్గ్ గురుపరంపర  పరంపర అనేది ఒక సంస్కృత పదం. దీని అర్థం  వారసత్వం, కొనసాగింపు, ఒక గురువు నుండి ప్రధాన శిష్యున...