3, మార్చి 2024, ఆదివారం

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ 2024 - విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవం

 

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ 

ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం 

అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి 


అమెరికాలోని షికాగో నగరంలో 1893 లో మొట్టమొదటిసారి ఇటువంటి సమావేశం - వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రెలీజియన్స్ పేరిట జరిగిన సమావేశంలో,  స్వామి వివేకానంద భారతదేశం  తరఫున, హిందూమతం తరఫున చేసిన విశ్వప్రసిద్ధ ప్రసంగాలు మనందరకూ విదితమే. అప్పుడు వారు మతసామరస్యాన్ని పెంపొందించుకోవాలని, మతమౌఢ్యాన్ని పూర్తిగా విడనాడాలని పిలుపునివ్వడం జరిగింది. స్వామి వివేకానంద మానవాళిని ఆధ్యాత్మికత ద్వారా ఏకం చేద్దామనుకున్న సంకల్పం ఇప్పుడు బహుశా నెరవేరబోతున్నది. 

షికాగోలో జరిగిన ఆ సమావేశం తరువాత ఇప్పుడు, అంతటి స్థాయిలో కాన్హా శాంతి వనంలో జరిగే ఈ సమావేశంలో, ప్రపంచం అంతా మతాతీతంగా, ఆధ్యాత్మికంగా ఎదగాలని, అంతరంగ శాంతి ద్వారా మాత్రమే ప్రపంచ శాంతి సాధ్యమన్న సత్యాన్ని, అన్ని మతాలు, అన్ని ఆధ్యాత్మిక సంస్థలూ కలిసి ముక్తకంఠంతో చాటి చెప్పే మహత్తర  క్షణాలకు మనం సాక్షులం కాబోతున్నాం.

శ్రీ రామ చంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రామ చంద్రజీ మహారాజ్ (అందరూ ఆప్యాయంగా పిలుచుకునే బాబూజీ) 1957 లో ఐక్యరాజ్య సమితికి ప్రపంచ శాంతి విషయమై ఒక లేఖ వ్రాస్తూ వ్యక్తిగత శాంతి ద్వారా మాత్రమే ప్రపంచ శాంతి సాధ్యమని సూచించి, దాన్ని సాధించాలంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రాత్రి 9:00 గంటలకు కొన్ని నిముషాలు విశ్వం కోసం ప్రార్థించమని  ఒక పద్ధతిని సూచించారు. దాని ఫలితంగానే ఈ రోజున అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి అనే నినాదంతో ఈ విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవం, పూజ్య దాజీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. 

మొట్టమొదటిసారిగా, భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారు, భారత దేశం అన్ని విధాలా 'విశ్వగురువు' గా మార్చాలన్న  నేపథ్యంలో, భారతదేశం విశ్వానికి ఆధ్యాత్మిక రాజధానిగా విలసిల్లే నేపథ్యంలో, హైదరాబాదు శివార్లలోని కాన్హా శాంతి వనం, హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ లో మార్చ్ 14 నుండి 17 వరకూ ఈ అద్భుత సమావేశాన్ని నిర్వహించబోతున్నది. ఈ అపూర్వ కార్యక్రమానికి  హార్ట్ఫుల్నెస్ సంస్థ, కన్వీనర్ గా వ్యవహరిస్తున్నది, ఆభూతులకు ఆతిథ్యం ఇస్తున్నది. 

ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 300 కు పైగా ఉన్న ధార్మిక సంస్థలు, వివిధ మతాలకు చెందిన సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు పాల్గొనబోతున్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన సమకాలీన గురువులు తమ అనుయాయులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కలిసి ఒక్కటిగా, ఒక్క త్రాటి మీదకొచ్చి, ఒక్క చూరు క్రిందకు వచ్చి, ప్రపంచ శాంతి, సామరస్యాల స్థాపన కోసం కృషి చేయనున్నాయి. ప్రత్యక్షంగానూ, వర్చువల్ గానూ కలిపి పది లక్షలకు పైగా జనం ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా. సుమారు 100 కు పైగా దేశాల నుండి ఇక్కడికి రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. 

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, మార్చ్ 15 వ తేదీ సాయంకాలం ఈ మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. మార్చ్ 16 న భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగ్దీప్ ధనకర్ గారు  ముగింపు ప్రసంగాన్నిస్తారు. 

ఈ కార్యక్రమంలో  హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ మార్గదర్శి, ఈ మహోత్సవ కన్వీనర్ పూజ్య దాజీ గాక, ఎందరో సమకాలీన గురువులు - ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధ్యక్షులు శ్రీశ్రీ రవిశంకర్ గారు, ఈశా సంస్థ అధ్యక్షులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు, పతంజలి యోగ్  ప్రతిష్ఠాన్ అధ్యక్షులు బాబా రామ్ దేవ్ గారు, చిన్న జీయర్ స్వామి వారు, రామకృష్ణ మఠం వారు, గౌర్ గోపాల్ దాస్ - ఇస్కాన్ వారు, ఇస్లాం మత  ప్రముఖులు, సూఫీ ప్రముఖులు, సిస్టర్ శివానీ గారు - బ్రహ్మ కుమారీ సంస్థ, మాతా అమృతానందమయి గారు, ట్రాన్సెండెంటల్  మెడిటేషన్  మార్గదర్శి టోనీనాడర్ గారు, బౌద్ధ మతస్థులు, సిఖ్  మతస్థులు, జైన మతస్థులు, యూద మతస్థులు, ఇంకా ఎన్నో యోగా సంస్థల పెద్దలు, ఇంకా మరెందరో ఈ మహోత్సవంలో ప్రసంగించ బోతున్నారు. వీరు గాక వివిధ రంగాలకు చెందిన మరెందరో ప్రముఖులు, పుల్లెల గోపీచంద్, కబీర్ బేదీ వంటి వారు కూడా పాల్గొనబోతున్నారు. 

ఈ కార్యక్రమంలో:

ప్లీనరీ సెషన్లుంటాయి. ఇందులో అందరూ పాల్గొంటారు. ఇక్కడ చర్చించబోయే అంశాలు - అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి; నిత్యజీవితంలో ఆధ్యాత్మికత; మతాల సంగమం; పరివర్తన -ఆధ్యాత్మికత; 2047 లో ఆధ్యాత్మికత; ఈ డిజిటల్ యుగంలో యువత - ఆధ్యాత్మికత. 

ఇవి గాక లోతైన విజ్ఞతతో నిండిన సెషన్లు  మరికొన్ని ఉంటాయి. ఆ అంశాలు ఇలా ఉన్నాయి:   పని - ఆధ్యాత్మికత; స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ ఆధ్యాత్మికత; ప్రకృతి-ఆధ్యాత్మికత; ఆరోగ్యం కోసం ఆధ్యాత్మికత - మానసిక, శారీరక ఆరోగ్యం; ఆధ్యాత్మికత యొక్క నిగూఢ అవగాహన. 

వీటితోపాటు సుప్రసిద్ధ కళాకారులచే సంగీత విభావరులు, భారతదేశ సంస్కృతిని దర్శింపజేసే వివిధ రకాల సంగీత వాయిద్యాల, గాన కచేరీలు మనలను అలరించనున్నాయి. 


కాబట్టి అందరూ ఆహ్వానితులే. ముఖ్యంగా ఈ ప్రపంచ ఉజ్వల భవిష్యత్తుగా ఉండవలసిన యువత తప్పక పాల్గొనాలని విజ్ఞప్తి. ప్రవేశం పూర్తిగా ఉచితం. కేవలం ఆధార్ కార్డు కానీ, మరే ఇతర ప్రభుత్వంచే ఇవ్వబడిన గుర్తింపు కార్డ్ అయినా దయచేసి తీసుకురాగలరు.  


మరిన్ని వివరాలకు సంప్రదించండి:

www.globalspiritualitymahotsav.org 

gsm@heartfulness.org 


2 కామెంట్‌లు:

  1. కృష్ణా రావు గారు.... మనం అందరం పాల్గోందాం... మన మిగతా సోదర, సోదరీలు, యువజనులు అంతా పాలోగేనేలా చేద్దాం !!

    రిప్లయితొలగించండి

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...