బాబూజీ గురించి చారీజీ వద్ద విన్న కొన్ని సన్నివేశాలు
*
నా హాస్యంలో కూడా ఒక సందేశం ఉంటుంది - బాబూజీ
*
బాబూజీ వద్దకు ఒక వ్యక్తి వచ్చి, "బాబూజీ అసలు దేవుడున్నాడా?" అని అడిగాడు. దానికి బాబూజీ సమాధానం చెప్పకుండా కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయారు. ఆయన వెనుకే చారీజీ కూడా వెళ్ళి, "అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా వచ్చేశారేంటి?" అని అడిగారట. దానికి బాబూజీ,"చూడు ఆ ప్రశ్న వేసిన వ్యక్తికి, దేవుడున్నాడు అని చెప్పినా, దేవుడు లేడని చెప్పినా ఉపయోగం లేదు", అందుకే లేచి చక్కా వచ్చాను అన్నారట. ఇదే ప్రశ్న మరో సందర్భంలో అడిగినప్పుడు, "నేను దేవుడిని చూపించాననుకో, నువ్వెలా గుర్తు పడతావు?" అని అడిగారట.
*
మరో వ్యక్తి బాబూజీ వద్దకు వచ్చి, "బాబూజీ నాకు మీ విశ్వరూపదర్శనం చేసుకోవాలనుంది, దర్శనం కలిగిస్తారా?" అని అడిగాడట. దానికి బాబూజీ, "సోదరా, నువ్వు అర్జునుడివి కావచ్చునేమో గాని, నేను శ్రీకృష్ణుడిని కాను" అన్నారట.
*
మరో సందర్భంలో ఒక వ్యక్తి బాబూజీ దగ్గరకొచ్చి, "బాబూజీ మీరు మహాత్ములు కదా, గురువులు కదా, ఆధ్యాత్మిక ఎత్తులకు ఎదిగినవారు కదా, మరి మీరు హుక్కా పీలుస్తున్నారేమిటి? పొగ త్రాగుతున్నారేమిటి?" అని అడిగాడట. దానికి బాబూజీ, "నేను విషాన్ని తీసుకుని, మీకు అమృతాన్ని ఇస్తూ ఉంటే, నీకు అభ్యంతరం ఏమిటి?" అని అడిగారట. ఇదే ప్రశ్నకు మరో సందర్భంలో మరొక వ్యక్తితో, "నిజమే ఒప్పుకుంటాను. కానీ నేను పొగ త్రాగుతూ ఈ స్థితికి చేరుకున్నాను, నువ్వు పొగ త్రాగకుండా ఈ స్థితికి చేరుకోగలవా?" అని ప్రశ్నించారట.
*
మరో సందర్భంలో బాబూజీ కుర్చీలో హుక్కా త్రాగుతూ కూర్చున్నప్పుడు, తన ముందు కొంతమంది అభ్యాసులు దశనియమాలను గురించి చర్చించుకుంటున్నారట. ఆ సంభాషణలో, ఒక అభ్యాసి మరొక అభ్యాసిని 5 వ నియమం ఏమిటని అడిగాడు; ఆ తరువాత ఆ అభ్యాసి 8 వ నియమం ఏమిటని అడిగాడు. ఇలా చర్చ కొనసాగుతూ ఉండగా, బాబూజీ కుర్చీలో నుండి లేచి వెళ్లిపోయారట. చారీజీ, "ఎందుకని అలా వచ్చేశారు బాబూజీ?" అని అడిగినప్పుడు, బాబూజీ, ఆ చర్చలో నన్ను కూడా ఫలానా నియమం ఏమిటి అని నన్నడిగితే నా పరిస్థితేమిటి? నేను చెప్పలేకపోతే.. . ఏమి గురువు, ఈయనకే తెలియదా అని అనుకోరూ? అందుకే వచ్చేశాను" అన్నారట.
*
ఒకసారి బాబూజీ తన ఇంట్లో ఎన్నో యేళ్ళుగా పని చేసే "మాలిన్" ను తనకున్న చనువుతో హాయిగా దేశవాళీ తిట్లు హిందీలో తిడుతున్నారట. అక్కడే కొంతమంది విదేశీ అభ్యాసీలు నిలబడి ఉన్నారట. అకస్మాత్తుగా వాళ్ళున్నారని గుర్తించి, చారీజీతో, "మంచిదయ్యింది, వీళ్ళకు భాష అర్థంకాడు, లేకపోతే, ఈయనేం గురువు, ఇలా బూతులు తిడుతున్నాడు? అని అనుకోరూ?" అని అన్నారట బాబూజీ. అంతా పసి మనసు బాబూజీది.
*
బ్రహ్మాండం కృష్ణా రావు గారు. జ్ఞానమౌక్తికాలు ఇవేనేమో ! ఇంకా ఇంకా వేతికి అందించండి.... ఇక్కడ భద్రంగా ఉంటాయి..ఇప్పటి తరం వారికి ఒక్క చోట అన్నీ అందుతాయి.
రిప్లయితొలగించండి