20, మార్చి 2024, బుధవారం

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం - రెండవ రోజు 15.3.2024

 గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ  మహోత్సవం - రెండవ రోజు  15.3.2024

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ  మహోత్సవం, రెండవ రోజు అంటే మార్చ్ 15 వ తేదీన ఉదయం 9 గంటలకు ప్లీనరీ సెషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేదికపై ఇస్కాన్ కు చెందిన గౌర్ గోపాల్ దాస్, రామకృష్ణ మిషన్ కు చెందిన స్వామి ఆత్మప్రియానంద, బ్రహ్మ కుమారీ ఉషా బెహన్, పద్మభూషణ్ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు పూజ్య దాజీతో పాటు ఉన్నారు. భారత్ ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తరఫున శ్రీమతి రంజనా చోప్రా గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది.
 
ఆ తరువాత హార్ట్ఫుల్నెస్ తరఫున పూజ్య దాజీ మొట్టమొదటగా ప్రసంగిస్తూ, వచ్చినవారిని ఋషులని సంబోధించారు.  ప్రసంగంలోని కొన్ని ముఖ్య అంశాలు - ఇంతమంది మహానుభావులు ఒక ఉత్కృష్టమైన లక్ష్యం కోసం, ఒక్కచోట  సమావేశమవడం చాలా ప్రశంసనీయం. మతాలనబడే, విశ్వాసాలనబడే వాటి ద్వారా ఎన్నో యుద్ధాలు జరగటం, వీటి పేరుతో జనాలను విడదీయడం ఈ ప్రపంచం సాక్షిగా ఉంటూనే ఉంది. మతాలతో సమస్య లేదు కానీ, మతాన్ని నమ్మేవారితోనే, వాటిని వ్యాఖ్యానించేవారి వల్లే అనవసరమైన సమస్యలున్నాయని కోఫీ అన్నన్ గారన్నారని ఉటంకించడం జరిగింది. వివిధ మతాలు, వివిధ ఆధ్యాత్మిక సంస్థలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేక పరిమళం వెదజల్లేటువంటి పువ్వుల్లాంటివి; ఒక్కొక్క మతం/సంస్థ ఒక్కొక్క గొప్ప గుణానికి నిదర్శనం; ఇస్కాన్ భక్తికి, క్రైస్తవం కరుణకు, ఇస్లాం సోదరభావానికి, ఇలా ... ; ఒక్కసారి ఊహించండి, ఈ గుణాలన్నీ కలిపితే ఏమవుతుందో.. మనం విడి-విడిగా ఎందుకుండాలి? సహనం ఉండాలని ఎప్పుడు విన్నా నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఒక భర్త ఒక భార్యను గాని, ఒక భార్య ఒక భర్తను గాని నేను నిన్ను సహిస్తున్నాను అని అంటే ఎలా ఉంటుంది? సహించడం కాదు, మనం అంగీకరించాలి, యథాతథంగా ఒకర్నొకరు స్వీకరించగలగాలి. అప్పుడే శాంతి, సామరస్యం సాధ్యం. అన్నీ ఆత్మలు వర్షంలో నీటి చుక్కల్లా సముద్రంలో కలిసిపోవాలి;  నూనె చుక్క సముద్రంలో కలవగలదా? సముద్రంలో ఉన్నా ఎప్పటికీ కలవదు. ఇక్కడ విషయం ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క తత్త్వం ప్రతీ ఆత్మలోనూ ఉండాలి, అప్పుడే అందులో లయమవుతుంది. విశ్వాసం ఎప్పుడొస్తుంది? అనుభవం ద్వారా వస్తుంది. సరైన దారిలో ఉన్నామని మార్గదర్శనం చేసేది మనలో ఉన్న ఈ హృదయం. 

ఆ తరువాత వేదికపై ఉన్న ఇతర ప్రతినిధులు మాట్లాడటం జరిగింది. 

సాయంకాలం భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆమె కాన్హా శాంతి వనానికి విచ్చేయడం ఇది రెండవసారి. ఆమె అద్భుతమైన ప్రసంగం చేశారు. రాష్ట్రపతి వేదికపైకి వచ్చిన వెంటనే, ఆ తరువాత ఆమె ప్రసంగం ముగిసిన తరువాత  జాతీయ గీతం ఆలపించడం జరిగింది. 
ఈ సందర్భంగా భారత ప్రభుత్వం, మినిస్టర్ ఆఫ్ స్టేట్, భారత పార్లమెంటరీ అఫైర్స్, సంస్కృతి మంత్రిత్వ శాఖకు చెందిన శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు స్వాగతోపన్యాసం చేయడం జరిగింది. ఆ ప్రసంగంలో ఆయన చెప్పిన ఆసక్తికరమైన విషయం - 1895 లో మిచిగాన్ యూనివర్సిటీ, అమెరికాలో స్వామి వివేకానందను ఒక మహిళ ప్రశ్న వేస్తుంది - మీ దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడొస్తుంది?  అని అడిగింది, దానికి స్వామీజీ, సుమారు 50 సంవత్సరాలు ఆ ప్రాంతంలో వచ్చేస్తుంది, అటువంటి పరిస్థితులు అప్పటికి ఏర్పడతాయని సమాధానమిచ్చారు. అలాగే కార్ల్ మార్క్స్ జన్మించిన 100 సంవత్సరాలకు రష్యాలో ఒక విప్లవం వస్తుందన్నారు. అలాగే భారత దేశం 21 వ శతాబ్దంలో ప్రపంచానికే ఆధ్యాత్మిక గురువుగా పరిణమిస్తుందన్నారు. ఈ మూడు భవిష్య వాణీలను స్వామి వివేకానంద 1895 లోనే పలికారని మంత్రిగారు చెప్పడం జరిగింది; అందులో రెండు ఇప్పటికే సాకారమయ్యాయి; ఇక మూడవది ఈ అమృత్ కాల్ లో సంభవించనున్నదని ఈ గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం తెలియజేస్తున్నదని ప్రసంగాన్ని ముగించారు. 

1 కామెంట్‌:

  1. పూజ్య దాజీ గారి సహనం వివరణ ఎంతో చక్కగా హృదయాలకు హత్తుకునట్లుగా ఉండదమే కాక చివర్న నూనె చుక్క నీటి చుక్క ఉదాహరణ, ఇంకా నీటి చుక్క సాగరం అవడం లేదా తన ఉనికిని కోల్పోవడం అద్భుతం.

    రిప్లయితొలగించండి

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...