13, మార్చి 2024, బుధవారం

ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం - మార్చ్ 14-17, 2024

 



ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం - మార్చ్ 14-17, 2024

హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అయిన హైదరాబాదు శివార్లలో ఉన్న కాన్హా శాంతి వనంలో, హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆతిథ్యంతో మార్చ్ 14 నుండి 17 వరకూ భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించబోతున్న  "ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం యొక్క ప్రధాన లక్ష్యాల గురించి పూజ్య దాజీతో పాటు, జీయర్ ట్రస్ట్ కు సంబంధించిన చిన్న జీయర్ స్వామివారు, రామకృష్ణ మఠానికి చెందిన స్వామి బోధమయానంద గారు, హైదరాబాదులోని  హోటల్ తాజ్ కృష్ణాలో  ప్రెస్ మీట్ లో ప్రసంగించడం జరిగింది. ఆ తరువాత కాన్హా శాంతి వనంలో ఆదివారం మార్చ్ 10 న ఉదయం సత్సంగం తరువాత మరలా కొన్ని విషయాలు పంచుకోవడం జరిగింది. 

దాజీ పంచుకున్న కొన్ని మహోత్సవ లక్ష్యాలు 

మనందరమూ మన ఆదర్శాలలో ఉండే తేడాలను ప్రక్కకు పెట్టి,  ప్రపంచంలో శాంతి-సామరస్యాలు నెలకొలపే ప్రయత్నం  చేయవలసిన సమయం  ఆసన్నమయ్యింది. 
తీవ్రవాదులు, టెర్రరిస్టులు  సమైక్యంగా ఉండగలిగినప్పుడు ధార్మిక, ఆధ్యాత్మిక వేత్తలు కలిసి ఐక్యంగా ఉండలేకపోవడం ఏమిటి?
ప్రతీ మతం, ప్రతీ ఆధ్యాత్మిక సంస్థ ఒక ప్రత్యేకమైన పువ్వు లాంటిది; ప్రతీ పువ్వూ ఒక ప్రత్యేకమైన పరిమళాన్ని వాతావరణంలోకి వెదజల్లుతుంది; ఈ పూవులన్నిటినీ ఒక చక్కటి మాలగా చేసి మనందరమూ కొలిచే దైవానికి సంపూర్ణ సమర్పణ భావంతో అర్పించలేమా?
మనలో ఉండే మత-మౌఢ్యాన్ని తొలగించుకోలేమా? భగవంతుని యందు విశ్వాసం ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక శిఖరాలకు ఎదిగినవాళ్ళూ ఉండవలసినది ఇలాగేనా? వర్షం మంటలు ఆర్పుతుంది; కానీ వర్షమే మంటలు రగిలిస్తే ఇంకేం  చేయగలం? 
కాబట్టి ఈ సమావేశంలో అందరమూ కలిసి, కేవలం భావాత్మకంగా, తత్త్వాలు మాట్లాడుకోవడమే గాక ప్రాక్టికల్ గా ఆచరించదగ్గ పరిష్కారాలను ఆలోచిద్దాం. 1893లో స్వామి వివేకానంద మతమౌఢ్యం పూర్తిగా తొలగిపోవాలన్న పిలుపునివ్వడం జరిగింది; ఇక కలలు గనడమే గాక నిజంగా చేతల్లో మనం కోరుకుంటున్న వాటిని సుసాధ్యం చేద్దాం. 
అన్నీ కాలుష్యాల్లోకి (నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, మట్టి కాలుష్యం, వగైరాలు) ఆలోచనా కాలుష్యమే భయంకరమైనది. ఈ ఒక్క కాలుష్యం పోయిందంటే మిగిలిన అన్నీ కాలుష్యాలూ మాయమైపోతాయి. 
ఇలాంటి ప్రపంచం మన పిల్లలకు, పిల్లల పిల్లలకు, భావి తరాలకు ఇవ్వద్దు. తగిన విధంగా అందరమూ కృషి చేద్దాం. ఒక్కొక్క వ్యక్తికీ మానసిక ప్రశాంతతను అందించే దిశగా కృషి చేద్దాం. మనం చేయకపోతే మరెవరూ చేస్తారు? ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం? ఆలోచించండి. 

అందరమూ పరస్పరం గౌరవించుకుందాం; ఒకర్నొకరిని నమ్ముదాం. నేను అవతలి వ్యక్తికి పాదాలకు దణ్ణం పెట్టడానికి వెనుకాడను; అవతలి వ్యక్తి మన కంటే గొప్పవాడని భావిద్దాం; వంగినంత మాత్రాన అవతలి వ్యక్తి కంటే తక్కువ అని కాదు.

పూజ్య దాజీ పలుకుతున్న ఈ ఉదాత్త భావాలను గురించి తీవ్రంగా లోతుల్లోకి ధ్యానిద్దాం, జీర్ణం చేసుకుందాం; వారు కోరుకున్న విధంగా ప్రతీ సమాజంలో ప్రత్యక్షంగా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం.  

1 కామెంట్‌:

  1. తప్పకుండా ! ఇవన్నీ ఇప్పటి మహోత్సవం తో మనందరి జీవితాలలో, ప్రపంచంలో ప్రతిబింబించు గాక !

    రిప్లయితొలగించండి

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...