7, సెప్టెంబర్ 2026, సోమవారం

సత్సంగ్ ప్రాశస్త్యం


సత్సంగ్ ప్రాశస్త్యం 
 

సత్సంగ్ ప్రాశస్త్యం ముఖ్యంగా సహజ్ మార్గ్ / హార్ట్ఫుల్నెస్ సందర్భంలో అర్థం - సత్యముతో కూడి ఉండటం. సాధకులు నిరంతరాయంగా సత్యముతో కూడి ఉండాలి, అదే నిత్యసాధన. ముఖ్యంగా ధ్యానంలో లీనమైనప్పుడల్లా అంతరంగంలో నిగూఢంగా ఉన్న సత్య పదార్థంతో  కూడి ఉండటం జరుగుతుంది.  


సామూహికంగా సోదరసోదరీమణులందరూ కలిసి, ఒకే లక్ష్యంతో, ఒకే ధ్యానవస్తువును గూర్చి ధ్యానం చేయడాన్ని కూడా సత్సంగం అంటారు. సామూహికంగా ఆధ్యాత్మిక విషయాలను చర్చించుకోవడం కూడా సత్సంగం అనే అంటాం. 


సత్సంగ్ యొక్క ప్రయోజనాలు 

విచ్చలవిడిగా చంచలంగా ఉండే మనసు కాస్త అదుపులోకి వస్తుంది సామూహిక ప్రభావం వల్ల. నిత్యం ధ్యానించే సాధకులందరూ కలిసి ధ్యానం చేసినప్పుడు ఈ ప్రభావం మరింత ప్రబలంగా ఉంటుంది. మనసు నిర్మలంగా మారడం గమనించవచ్చు. ధ్యానం యందు ఆసక్తి పెరుగుతుంది.


సామూహిక ధ్యానంలో లేక సత్సంగంలో కూర్చొని ధ్యానించినప్పుడు, దాని ప్రభావం అందరూ విడివిడిగా చేస్తే వచ్చిన ప్రభావాలన్నీ కలిపిన ప్రభావం కంటే కూడా ఎన్నో రెట్లు ప్రభావం ఉంటుంది. అందువల్ల ఆధ్యాత్మిక ప్రగతి త్వరితంగా జరిగే అవకాశం ఉంటుంది.  మనసు భారంగా కకలావికలంగా ఉన్నప్పుడు, నకారాత్మక ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడు, సత్సంగానికి వెళ్ళాలన్న మనస్సు అస్సలు లేనప్పుడు తప్పక సత్సంగంలో మీ ఇచ్ఛాశక్తిని ఉపయోగించి కూర్చొని చూడండి. గంగా స్నానం చేస్తే మనసులోని పాపాలు పోతాయో లేదో గాని ఇటువంటి చేదిరిపోయిన మానసిక స్థితిలో సత్యసంగంలో తప్పక కూర్చొని చూడండి; నమ్మకం లేకపోయినా సరే. ఇవి మామూలు ప్రయోజనాలు: మనసు యొక్క స్థితిని మెరుగుపరచి జీవితంలో ముందుకు సాగేలా చేసేవి. 


పూజ్య బాబూజీ ఆదేశం ప్రకారం, ముఖ్యంగా సహజ్  మార్గ్ సాధన చేసేవారికి, మన సంస్థలో అన్నీ ప్రదేశాల్లోనూ ఆదివారం సత్సంగంలో పాల్గొన్నవారందరూ ఆయనకు టీవీలో కనిపించినట్లు ప్రతీ అభ్యాసి కనిపిస్తారట. అప్పుడు వారి దృష్టి ఆ అభ్యాసి పై పది జరుగవలసిన ఆధ్యాత్మిక కార్యం సజావుగా జరుగుతుందట. కాబట్టి అభ్యాసులు తప్పనిసరిగా ఆదివారం సత్సంగ్ లో మానకుండా పాల్గొనడం వారి వారి ఆధ్యాత్మిక పురోగతికి ఎంతగానో దోహదం చేస్తుందట. బాబూజీ వద్దకు వచ్చిన వారిలో ఆదివారాలు సత్సంగాలలో పాల్గొననివారిని తేలికగా గుర్తు పట్టేసేవారట. ప్రస్తుత మాస్టర్లు (చారీజీ, దాజీలు) కూడా అలాగే ఉన్నారు.


 కాబట్టి ముఖ్యంగా ఈ ఆదివారం సత్సంగాన్ని విస్మరించరాదు.  

22, ఆగస్టు 2026, శనివారం

గురుపరంపర ప్రాముఖ్యత - సహజ్ మార్గ్ గురుపరంపర

 


గురుపరంపర ప్రాముఖ్యత, 
సహజ్ మార్గ్ గురుపరంపర 

పరంపర అనేది ఒక సంస్కృత పదం. దీని అర్థం  వారసత్వం, కొనసాగింపు, ఒక గురువు నుండి ప్రధాన శిష్యునికి జ్ఞాన సిద్ధిని ప్రసరణ చేయడం. ఆ విధంగా గురుపరంపర అనేది వివిధ తరాల  గురువుల వారసత్వం. గురుపరంపర ద్వారా ఆధ్యాత్మిక ప్రజ్ఞను, ఆధ్యాత్మిక సిద్ధిని భద్రంగా పదిలపరచడం, అందించడం (ప్రసరించడం) జరుగుతూ ఉంటుంది. గురుపరంపర అంటే ఆది గురువు ఆర్జించిన పరమ ఆధ్యాత్మిక సిద్ధులను, ప్రజ్ఞను, తన ప్రధాన శిష్యుడికి అందజేయడం ద్వారా తరువాతి తరానికి సజీవంగా ప్రసరించడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అనుభవాన్ని, యౌగిక సాధనా ప్రక్రియలను, అనుగ్రహాన్ని, అంతరంగ పరివర్తననను  గురువు శిష్యునికి ప్రసరించడం. 

రకరకాల గురుపరంపరలు, వారి-వారి సాంప్రదాయాలను బట్టి మనకు ప్రపంచంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే 
సహజ్ మార్గ్ గురుపరంపర కూడా ఉన్నది. మొట్టమొదటి గురువును మన సాంప్రదాయంలో ఆదిగురువు అని సంబోధిస్తూ ఉంటాం. సహజ్ మార్గ్ గురుపరంపరలో ఆదిగురువు - పూజ్య లాలాజీ మహారాజ్. ఆఅ తరువాత బాబూజీ మహారాజ్ - చారీజీ మహారాజ్ - ప్రస్తుతం సజీవ గురువు దాజీ మహారాజ్. 

మన గురువుల ప్రకారం అప్పుడప్పుడు వాళ్ళ ప్రసంగాల్లో ఉల్లేఖించినడాన్ని బట్టి పూజ్య లాలాజీకి పూర్వం కూడా కొందరు గురువుల పరంపర ఉందని తెలుస్తున్నది. పైన చిత్రంలో ఉన్నట్లుగా శ్రీకృష్ణ భగవానుడితోనూ, రాధా మాతతో ప్రారంభమై బుద్ధ భగవానుడు, చైతన్య మహాప్రభు, స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ పరమహంస ఇంకా ఎందరో ఉన్నారట.

గురుపరంపర ప్రాముఖ్యత యేమిటంటే గురువు పొందిన ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధిని కేవలం గ్రంథాల  ద్వారా  సంపూర్ణంగా అందించడం సాధ్యపడదు, దివ్య ప్రేమను సజీవంగా సజీవంగా అందించడం సాధ్యపడదు, అది కేవలం పరిశుద్ధ హృదయం అంటే పవిత్రంగా శుద్ధీకరింపబడిన సూక్ష్మ శరీరాల ద్వారా మాత్రమే యథాతథంగా అందించడం సాధ్యపడుతుంది. అదే సజీవ గురువు యొక్క ప్రాముఖ్యత. అదే గురుపరంపర యొక్క ప్రాముఖ్యత.  

14, ఆగస్టు 2026, శుక్రవారం

లాలాజీ మహాసమాధి - 14

 


లాలాజీ మహాసమాధి - 14 ఆగష్ట్ 1931

శ్రీ రామ చంద్ర మిషన్, ఆదిగురువులైనటువంటి సమర్థ గురు మహాత్మా శ్రీ రామ చంద్రజీ మహారాజ్, కాలగర్భంలో కనుమరుగైపోయిన ప్రాణాహుతి-ప్రసరణ విద్యను, క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుపోయి, జీవితగమనాన్ని దారి తెలియక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఆధునిక మానవుల త్వరిత విముక్తి కోసం, అతిస్వల్ప కాలపరిధిలో, ఒకే జన్మలో  మానవ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసుకునే మహడవకాశాన్ని,  ఈ విద్యను,  కాలగర్భంలో నుండి తన యోగశక్తితో వెలికి తీసి పునరుద్ధరించి మానవాళిని ఉద్ధరించిన మహనీయుడు పూజ్య లాలాజీ మహారాజ్. 

వారి మహాసమాధి రోజు ఈ రోజు. ఫిబ్రవరి 2, 1873 న బసంత్ పంచమి నాడు జన్మించి, ఆగష్ట్ 14, 1931 న మహాసమాధిని పొడడం జరిగింది. ఇప్పటికీ వారు దివ్యలోకాల నుండి సందేశాల ద్వారా మనకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు, మన బాబూజీతో పాటుగా. 

ఈ సందర్భంగా వారి సచ్ఛీలతను, వారు అందించిన సంభాషణా సూత్రాలు, జీవిత పరమార్థాన్ని తెలుసుకునే జీవన విధానాన్ని, సంసార జీవితాన్ని కొనసాగిస్తూ అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకునే జీవన విధానాన్ని, బోధలను మనం పునః స్మరించుకుని, ప్రత్యేకమైన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ, ఎంతో భక్తిశ్రద్ధలతో ధ్యానించుకోవలసిన సందర్భం ఈ రోజు. 

మనందరమూ వారి అనుగ్రహానికి పాత్రులమై మన జీవితాలను సార్థకం చేసుకోవాలని పూజ్య లాలాజీని ప్రార్థిస్తూ...    

4, ఆగస్టు 2026, మంగళవారం

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

 


అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు 

ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అనే అద్భుత ఆంగ్ల గ్రంథం విడుదల చేయడం జరిగింది.  భగవద్గీత సాక్సక్షాత్తు  శ్రీకృష్ణ భగవానుడికి మానవ శ్రేష్ఠుడైన అర్జునుడికీ మధ్య జరిగిన సంవాదమయితే , అష్టావక్ర గీత ఇద్దరు జ్ఞానుల మధ్య, ఇద్దరు ఆధ్యాత్మిక దిగ్గజాల మధ్య జరిగిన సంవాదం - అష్టావక్ర మహర్షికి, మిథిలాపురిని శాసించే రాజైన జనక మహారాజుకు మధ్య జరిగిన సంవాదం.  

20 అధ్యాయాలు, 298 శ్లోకాలతో కూడిన ఈ మాహాగరంతంలో పూజ్య దాజీ కేవలం 2 శ్లోకాలను  మాత్రమే ప్రత్యేకంగా నిశితంగా, వివరించడం, నిజమైన జ్ఞానాన్ని పొందడం కోసం, మోక్షం సిద్ధించాలంటే , వైరాగ్యాన్ని పెంపొందించుకోవడం అనే ముఖ్య ప్రశ్నల ప్రాముఖ్యతను విస్తృతంగా వివరించారు. 

దాజీ వ్రాసిన ఈ గ్రంథం అష్టావక్ర మహాగీతలోని మొదటి రెండు వాక్యాలను గురించే. మొదటి శ్లోకంలో జనక మహారాజు 3 ప్రశ్నలను వేయడం జరుగుతుంది:

కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిరభవిష్యతి |
వైరాగ్యం చ కథం ప్రాప్తం ఏతద్ బ్రూహి మమ ప్రభో ||

నిజమైన జ్ఞానం పొందడం ఎలా?
మోక్షాన్ని సాధించడం ఎలా?
వైరాగయాన్ని పెంపొందించుకోవడం ఎలా?

ఈ ప్రశ్నలకు అష్టావక్రుడు సూటిగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. 

ముక్తిమిచ్ఛసి చేత్తాత విషయాన్ విషవత్ త్యజ |
   క్షమార్జవదయాతోషసత్యం పీయూషవద్భజ ||  

నువ్వు మోక్షాన్ని సాధించాలనుకుంటే ఇంద్రియపరమైన విషయాలను విషంగా తిరస్కరించు. క్షమ, ఆర్జవం, దయ, సంతోషం, సత్యం అనే అయిదు గుణాలను  అమృతంగా భావించి అభ్యాసం చెయ్యి. 

కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మనిషి హృదయానికి అవసరమైన 5 ఔషధాలను అష్టావక్రుడు సూచించడం జరిగింది. ఒక్కొక్క మందు తరువాతి దానికి రంగం సిద్ధం చేసుకుంటూ పోతుంది. ఆ వరుస క్రమంలోనే పని చేయడం ప్రారంభిస్తాయి. 

తప్పక గంభీరంగా సాధన చేసే ప్రతీ సాధకుడు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసి తన వ్యక్తిగత సాధనలో త్వరితంగా ఈ లక్ష్యాలను చేరుకుందురుగాక. 







11, జులై 2026, శనివారం

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రం / ఆశ్రమం – ఆధ్యాత్మిక వికాసానికి పవిత్ర ప్రదేశం


హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రం / ఆశ్రమం – ఆధ్యాత్మిక వికాసానికి పవిత్ర ప్రదేశం 

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రాన్ని లేదా ఆశ్రమాన్ని వ్యక్తిగత తపస్సుకు, సామూహిక తపస్సుకు పవిత్రమైన సాధనా క్షేత్రంగా వినియోగించుకోవాలి.

అలసి–సొలసిన ఆత్మకు విశ్రాంతి లభించే ఆధ్యాత్మిక నిలయంగా అక్కడ కొంత సమయాన్ని గడపాలి. ఆశ్రమంలో అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడానికి, ఆధ్యాత్మిక విషయాలపై చర్చించుకోవడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఆ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

పరాశిక్షకుల (Preceptors) ద్వారా వ్యక్తిగత సిట్టింగులు పొందడానికి సమయాన్ని కేటాయించాలి. ఆశ్రమాన్ని మన స్వంత గృహంగా భావించి, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్వచ్ఛంద సేవ చేయాలి. అభ్యాసుల మధ్య పరస్పర ప్రేమ, స్నేహం, సామరస్యం, సహకార భావాలు పెంపొందించే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి.

ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న కొత్తవారిని ఆశ్రమానికి ఆహ్వానించి, వారికి ధ్యానం నేర్పించే ఏర్పాట్లు చేయాలి. ఈ విధంగా ప్రతి అభ్యాసి ఆధ్యాత్మిక సేవలో భాగస్వామి కావాలి.

మన గురువులు ఒక అద్భుతమైన భావాన్ని తెలియజేశారు—“ఆశ్రమానికి లేదా సత్సంగానికి వెళుతున్నప్పుడు, మాస్టర్ సన్నిధికి వెళుతున్నామనే భావంతో వెళ్లాలి.” అటువంటి వినయపూర్వకమైన, పవిత్రమైన భావంతో ఆశ్రమంలో గడిపిన ప్రతి క్షణం మన ఆధ్యాత్మిక ప్రగతికి బలమైన పునాది అవుతుంది.


 

8, జులై 2026, బుధవారం

ధ్యానానికి సమయం లేదా ?

 


ధ్యానానికి సమయం లేదా?

దినచర్యలో భాగమై ఉండవలసిన ధ్యానం చేయమంటే, ఆధునిక సమయంలో చాలా మంది సమయం లేదని  అంటూంటారు.  "సమయం లేదు"- అంటే జీవితం ఇంకా ఎంతో కాలం లేదని అర్థం. ఇది నిజం కూడా.  అందుకే సమయం లేదు కాబట్టే ధ్యానానికి సమయం దొరికేలా మన దినచర్యను సవరించుకోవలసి ఉంది. "ధ్యానానికి సమయం లేదు" అనడం కన్నా "టైము మేనేజ్ చేసుకోలేకపోతున్నాను "అనడం నయం. 

విచిత్రంగా నిత్యం ధ్యానం చేసినట్లైతే మరింత సమయం దొరుకుటుందంటారు పూజ్య దాజీ. ఇది అనుభవంలో అందరికీ తెలుస్తుంది. ఉదయాన్నే ధ్యానంలో కూర్చున్నప్పుడు రోజులో మనం చేయవలసిన పనుల లిస్టు ఆలోచనల రూపంలో కనిపిస్తాయి. ఆఅ ధ్యానంలోనే ప్రాధాన్యత ప్రకారం పనులను అమార్చుకోవడం, అనవసరమైన పనులను ప్రక్కకు పెట్టేయడం వంటివి వాటంతటవే జరిగిపోవడం మనం గమనించవచ్చు. ఆఅ విధంగా ఆ రోజు పనులన్నీ సజావుగా సమయం వృథా అవకుండా అర్థవంతంగా నాణ్యంగా గడుస్తుంది. ప్రతి నిత్యం ఆ విధంగా జీవించడం అలవడటం వల్ల జీవితమే నాణ్యమైన జీవితంగా మారే అవకాశం ఉంటుందంటారు పూజ్య దాజీ. 

అలాగే తనను తాను "కాలోస్మి.." అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే కాలం అంటేనే భగవంతుడు. అంటే కాలాన్ని వ్యర్థం చేయడం అంటే భగవంతుని నిర్లక్ష్యం చేసినట్లే, భగవంతుని వృథా చేసినట్లే - అన్నారు పూజ్య చారీజీ. 

ధ్యానం చేస్తే వచ్చే ప్రయోజనాలు అందరికీ తెలిసినా, దానికి సమయం లేదనడం ఒక ప్యారడాక్స్ (వైరుధ్యం). మనలో ఉన్న శక్తి అన్నీ రకాలుగా ఖర్చైపోయే సోషల్ మీడియాకు, ఫోన్లకు,  అంతులేని చేయవలసిన పనుల జాబితాలకు, రీల్స్ చూడటానికి దొరికే సమయం ధ్యానానికి లేకపోవడం గమనార్హం. అంటే మన ప్రాధాన్యతలు తలక్రిందులైపోయాయి. ధ్యానంలో సమయం ఆదాయ అవుతుంది, శక్తి పుంజుకుంటాం, మనోబుద్ధ్యహంకారాలు శుద్ధి అవుతాయి, జీవితం అర్థవంతంగా గడుస్తుంది. 

ఇవన్నీ కనీసం ఆలోచిద్దాం. మన జీవితాలను మరింత మెరుగుపరచుకుందాం. 

17, జూన్ 2026, బుధవారం

మానవ సేవే మాధవ సేవ

 


మానవ సేవే మాధవ సేవ 

ఈ వాక్యాన్ని మనందరం ఈ దేశంలో చిన్నప్పటి నుండి వింటున్నాం. మనందరికీ అర్థమైపోయిందని అనుకుంటాం  కూడా. చాలా తేలికగా వాడుకభాషలో వాడేస్తూ ఉంటాం. 

మానవునిలో మాధవుని దర్శిస్తూ చేసే సేవ మాధవ సేవ. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే సేవ మాధవ సేవ.

చిన్నప్పుడు చిత్తూరు నాగయ్య గారి "భక్త పోతన" సినిమాలో  ఎటువంటి మానవ సేవ మాధవ సేవో ఒక పాటలో చెప్పడం జరిగింది. అది ఇలా ఉంది -
భోగ-భాగ్యముల రోసి 
ఆడంబరము తెగత్రోసి 
అహము మమత త్యాగము చేసి 
తనువు ధనము హరిపరముగ చేసే 
మానవ సేవ మాధవ సేవ. 
దీని భావాన్ని అందరూ గ్రహింతురు గాక. 

సహజ్ మార్గ్ ప్రకారం మనిషి చేయగల అత్యున్నత సేవ తనను తాను సంపూర్ణంగా దివ్యంగా పరివర్తన చెందేలా సాధన చేయడమే. పాశవిక మానవుడు, మానవత్వం గల మానవుడిగాను, మానవత్వం గల మానవుడు దివ్య మానవుడిగా పరివర్తన చెందడమే మనిషి చేయగల అతి ఉత్కృష్ట సేవ అన్నారు చారీజీ. అదే అత్యున్నత గురుదక్షిణ కూడా. 

సత్సంగ్ ప్రాశస్త్యం

సత్సంగ్ ప్రాశస్త్యం    సత్సంగ్ ప్రాశస్త్యం ముఖ్యంగా సహజ్ మార్గ్ / హార్ట్ఫుల్నెస్ సందర్భంలో అర్థం - సత్యముతో కూడి ఉండటం. సాధకులు నిరంతరాయంగా ...