ఎంత ధ్యానం చేసినా, ఎంత సాత్త్విక జీవితం గడపాలని చూసినా, జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోవడం తప్పదనిపిస్తూ ఉంటుంది. ఇది మహాత్ముల జీవనంలో కూడా కనిపిస్తుంది. జీవితం ఎంత విచిత్రమైనదో గదా!
దీనికి పెద్దలు సూచించిన శ్రేష్ఠమైన ఉపాయం, ఒత్తిడిని సాధ్యమైనంత ఎక్కువగా తగ్గించుకుంటూ ఆరోగ్యకరంగా జీవించడానికి చదవడం, ధ్యానం, నవ్వులు, సంగీతం - వీటికి తగిన ప్రాధాన్యతనిస్తూ జీవితాన్ని కొనసాగించినట్లయితే జీవితం ఆరోగ్యకరంగా ఉండటమే గాక, ఎన్ని ఇబ్బందులున్నా ఎదుర్కోవచ్చు, జీవితాన్ని ఆస్వాదించవచ్చు కూడా.
చదవడం
చిన్న వయసు నుండి చదవడం అలవరచుకున్నట్లయితే, ముఖ్యంగా ఆత్మ వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి, మహాత్ముల జీవిత చరిత్రలకు, మేధో వికాసానికి, సృజనాత్మకతాకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటే సూక్ష్మ శరీరాలకు చాలా ఆరోగ్యం చేకూరుతుంది.
ధ్యానం
ధ్యానం కూడా ముఖ్యంగా మన హార్ట్ఫుల్నెస్ ధ్యానం వంటిది 15 సంవత్సరాలకే ప్రారంభించి, కొనసాగించగలిగితే జీవితం అద్భుతంగా ఉండే అవకాశాలే ఎక్కువ. ధ్యానం వల్ల మనసు క్రమశిక్షణలో ఉండటం, ఏకాగ్రత పెరగడం, ఆలోచనలో స్పష్టత రావడం తద్వారా జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలగడం, ఆత్మవిశ్వాసం పెరగడం, చాలా అవసరమైన వివేకం వృద్ధి చెందడం, మానసిక ప్రశాంతత పెరగడం, మనసు నిశ్చలంగా తయారవడం, ఇలా అసంఖ్యాకంగా ఎన్నో ప్రయోజనాలు కనిపిస్తాయి. జీయితం ఎక్కడికక్కడ తనంతటదే సర్దుకుంటుంది.
నవ్వులు
ధ్యానం చేసేవాళ్ళు, చదువుకునేవారు, ఎప్పుడూ గంభీరంగా ఉండనవసరం లేదు. అలా ఉంటే సమతౌల్యతను కోలపోయ, వ్యక్తిత్వాలు అదో రకంగా తయారవడం వల్ల ఎవ్వరూ వద్దకు రావడానికి ఇష్టపడరు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మన జీవితంలో నవ్వుకు చాలా ముఖ్య ప్రాధాన్యతనివ్వాలి. నవ్వు భగవంతుడు మనుషులకు మాత్రమే ఇచ్చిన గొప్ప వరం. నవ్వడం యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడొక మహానుభావుడు. యోగం కాబట్టే నవ్వితే, హృదయం తేలికపడుతుంది.
సంగీతం
మనిషి మాత్రమే ఎక్కువగా ఆస్వాదించగలిగే మరొక కల సంగీతం. సంగీతం కూడా ఒక యోగమే. మనసును ఆహ్లాదపరచడమే గాక, పరవశింప జేస్తుంది; మయిమరిపిస్తుంది; అలౌకిక సుఖాన్నిస్తుంది. సంగీతం విన్నా, పాడుకున్నా, సంగీతం తెలిసినా, తెలియకపోయినా మనిషిలో ఆఅ రసాస్వాదన సహజంగా జరుగుతుంది. సాంప్రదాయ సంగీతం, భక్తి సంగీతం అయితే ఆధ్యాత్మిక లక్ష్యాలున్నవారికి భక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి కూడా. సంగీతం వల్ల భాష శుద్ధి జరుగుతుంది, సంస్కృతి పెరుగుతుంది. మనసు పవిత్రమయ్యే అవకాశం కూడా ఉంది.
ఈ విధంగా ప్రతీ మనిషి తన జీవితంలో ఈ నాలుగు సముచితమైన స్థానాన్ని గ్రహిస్తే జీవితం ఆరోగ్యంగా ఉండటమే గాక, జన్మ తరించే అవకాశం కూడా ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి