17, జూన్ 2026, బుధవారం

మానవ సేవే మాధవ సేవ

 


మానవ సేవే మాధవ సేవ 

ఈ వాక్యాన్ని మనందరం ఈ దేశంలో చిన్నప్పటి నుండి వింటున్నాం. మనందరికీ అర్థమైపోయిందని అనుకుంటాం  కూడా. చాలా తేలికగా వాడుకభాషలో వాడేస్తూ ఉంటాం. 

మానవునిలో మాధవుని దర్శిస్తూ చేసే సేవ మాధవ సేవ. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే సేవ మాధవ సేవ.

చిన్నప్పుడు చిత్తూరు నాగయ్య గారి "భక్త పోతన" సినిమాలో  ఎటువంటి మానవ సేవ మాధవ సేవో ఒక పాటలో చెప్పడం జరిగింది. అది ఇలా ఉంది -
భోగ-భాగ్యముల రోసి 
ఆడంబరము తెగత్రోసి 
అహము మమత త్యాగము చేసి 
తనువు ధనము హరిపరముగ చేసే 
మానవ సేవ మాధవ సేవ. 
దీని భావాన్ని అందరూ గ్రహింతురు గాక. 

సహజ్ మార్గ్ ప్రకారం మనిషి చేయగల అత్యున్నత సేవ తనను తాను సంపూర్ణంగా దివ్యంగా పరివర్తన చెందేలా సాధన చేయడమే. పాశవిక మానవుడు, మానవత్వం గల మానవుడిగాను, మానవత్వం గల మానవుడు దివ్య మానవుడిగా పరివర్తన చెందడమే మనిషి చేయగల అతి ఉత్కృష్ట సేవ అన్నారు చారీజీ. అదే అత్యున్నత గురుదక్షిణ కూడా. 

13, జూన్ 2026, శనివారం

చెవిటితనం, మూగతనం, దృష్టిలోపం - ధ్యానం

 


చెవిటితనం, మూగతనం, దృష్టిలోపం - ధ్యానం

ఒక వ్యక్తిలో చెవిటితనం, మూగతనం, దృష్టిలోపం పూర్తిగా ఉన్నాయనుకోండి, అటువంటి వ్యక్తికి ధ్యానం ఎలా చేయాలో చెప్పడం ఎలా? ఇది చాలా ఆలోచింపజేసే ప్రశ్న. దృష్టి దోషం ఉండేవాళ్ళు వాడే బ్రైలీ భాషలో చెప్పవచ్చు అని అనుకోవచ్చు. అసలు బ్రైలీ ఎలా నేర్పించడం? ఇలా ఆలోచిస్తూ ఉంటే అటువంటి వ్యక్తి పట్ల అపారమైన సానుభూతి, నిస్సహాయత, దయ, ప్రేమ, ఉదాసీనత అన్నీ కాలగలపిన అనుభూతి యేదో కలుగుతుంది. 

ఈ ప్రశ్న ఒకసారి పూజ్య గురుదేవులు చారీజీ మహారాజ్ విశాఖపట్నంలో ఒక ప్రసంగంలో అడిగినట్లు గుర్తు. ఈ ప్రశ్న వినగానే నా మనసు అల్లకల్లోలమై పోయింది. కానీ వెంటనే మనసుకు హాయిని కలిగించే మాట కూడా చెప్పారు: ఆ వ్యక్తిని కూర్చోబెట్టి సిట్టింగ్ ఇస్తే సరిపోతుంది, అన్నారు. ఇంద్రియాల వైకల్యం కానీ, హృదయ వైకల్యం కాదు కదా, అన్నారు. హృదయంలో కలిగే అనుభూతి ద్వారా అటువంటి వ్యక్తిలో పరివర్తన త్వరగా వచ్చే అవకాశం ఉంటుందేమో. ఇది బహుశా హార్ట్ఫుల్నెస్ సాధనలో మాత్రమే సాధ్యం అవుతుందేమో. 

కాస్త ఆలోచిస్తే, నిజంగా ధ్యానంలో జరిగేది కూడా ఇదే కదా! చెవులు, కళ్ళు, నోరు మూసుకుని ఇంద్రియాలన్నీ అంతర్ముఖం చేసుకున్నప్పుడే సరైన ధ్యానం కుదురుతుంది కదా!  

ఇది కేవలం ప్రాణాయాహుతి విద్య వల్లే సాధ్యపడుతుంది. ఇది అత్యున్నత స్థాయిలో జరిగే కమ్యూనికేషన్ విధానం. మనుష్యత్వం దైవత్వంగా పరివర్తన చెందేలా తోడ్పడే విధానం. అటువంటి ప్రాణాయాహుతిని ప్రసరించే సమర్థుడైన గురువు లభించడం ఎంత సుకృతమో కదా! 



హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రం / ఆశ్రమం – ఆధ్యాత్మిక వికాసానికి పవిత్ర ప్రదేశం

హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రం / ఆశ్రమం – ఆధ్యాత్మిక వికాసానికి పవిత్ర ప్రదేశం  హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన కేంద్రాన్ని లేదా ఆశ్రమాన్ని వ్యక్తిగత...