ఒత్తిళ్ళు
ఒత్తిడి. మనిషి జీవితం ఒత్తిళ్ళ మయం. పుట్టుకే ఒక ఒత్తిడి, తల్లి గర్భంలో ఒత్తిడి, తల్లికి ఒత్తిడి. బయట పడ్డాక యేడ్చే దాకా ఒత్తిడి. పెరగడం ఒత్తిడి. చదవడం ఒత్తిడి. ఉద్యోగం దొరికే వరకూ ఒత్తిడి. ఉద్యోగం దొరికిన తరువాత ఉద్యోగ ఒత్తిడి. తరువాత వివాహ ఒత్తిడి. వివాహం తరువాత సంతాన ఒత్తిడి. సంసార ఒత్తిడి. ఈ క్రమంలో అనారోగ్య ఒత్తిళ్లు, ఆర్థిక ఒత్తిళ్లు, సామాజిక ఒత్తిళ్ళు, బంధువుల ఒత్తిళ్ళు, ప్రభత్వ ఒత్తిళ్లు, ప్రకృతిపరమైన ఒత్తిళ్ళు. ఆ తరువాత ముసలితనం ఒత్తిళ్ళు, వ్యాధుల వల్ల వచ్చే ఒత్తిళ్ళు, రకరకాల భయాల వల్ల వచ్చే ఒత్తిళ్లు, మృత్యు భయం వల్ల ఒత్తిళ్ళు. మృత్యువు తరువాత యేం జరుగుతుందోనన్న ఒత్తిడి.
ఇవి గాక మగాడికుండే ఒత్తిళ్ళు, ఆడవారికుండే ఒత్తిళ్ళు, ఇరువురి మధ్య ఉండే ఒత్తిళ్ళు. ఈ ఒత్తిళ్ళ ప్రభావాలు ఎలా ఉంటాయో పైన చిత్రంలో గమనించవచ్చు.
ఇన్ని ఒత్తిళ్ళతో సతమతమవుతూ, వీటన్నిటినీ దాటాలన్న సంకల్పం వల్ల వచ్చే ఒత్తిడిని అంగీకరిస్తూ మనిషి తన మనుగడను సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు; ఈ భవసాగరాన్ని దాటాడానికి ప్రయత్నిస్తున్నాడు.
వీటి ప్రభావాలు మనిషి శరీరంపైన, మనసు పైన, హృదయం మీద కనిపిస్తూ ఉంటాయి. అనుభవించేది హృదయం లేక ఆత్మ. ఇది తట్టుకోలేనప్పుడు ముందు మనసుపైకి తోసేస్తుంది, అది తిరిగి శరీరంపైకి తోసేయడం వల్ల ముందు శారీరక వ్యాధుల రూపంలో ఈ ఒత్తిడి బయటకొస్తుంది. వీటికి ఎంతో కొంత చికిత్స ఉండవచ్చు. ఆ తరువాత మానసిక వ్యాధులొస్తాయి. వీటికి పరిష్కారం చాలా జటిలం. చాలా సమయం పట్టవచ్చు. పరిష్కారాలు తెలియకపోవచ్చు. ఆ తరువాత ఆధ్యాత్మిక రోగాలు వస్తాయి. అంటే నైతికపరమైన రోగాలు. మనస్సాక్షికి అనుకూలంగా జీవిస్తే ఈ నైతిక రోగాలుండవు. ఇలా జీవించాలంటే, ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో, చాలా సాహసం కావాలి. అంటే హృదయాన్ని అనుసరించి జీవించడం అన్నమాట. హృదయాన్ని అనుసరించాలంటే సాహసం కావాలి. అదీ లోపలి నుండి సహజంగా రావాలి. అందుకే దీనికి ధ్యానం ఒక్కటే పరిష్కారం.
అసలు ఒత్తిడి అంటే ఏమిటి?
ఒత్తిడి అంటే మన మనసు మీద, శరీరంలోని గుండె మీద, అవయవాల మీద, నరాల మీద, మెదడు మీద, కండరాల మీద ఎడతెగకుండా, పీడ కలగడం, ఒత్తిడి అంటే అది. ఈ పీడ భరింపరానిది.
ఒత్తిడి ఎటువంటి పరిస్థితుల్లో కలుగుతుంది?
జీవితం అంటేనే సమస్యలు. మన కంటే పెద్దదైనప్పుడే అది సమస్య. అప్పుడే సమస్య వల్ల ఒత్తిడి. మన కన్నా చిన్నదైతే అక్కడ ఒత్తిడి ఉండదు. సమస్య జటిల్యమైతే ఒత్తిడి. సమస్య పరిష్కరించే నైపుణ్యం లేకపోతే ఒత్తిడి. చేయవలసిన పని ఎక్కువ సమయం తక్కువ అయినప్పుడు ఒత్తిడి. ఈ ఒత్తిడి మోతాదు మించినప్పుడు మనిషికి అపకారం చేస్తుంది. మోతాదు మించకుండా ఉండే ఒత్తిడి మనిషికి అవసరం. అది సకారాత్మక ఒత్తిడి. మనిషిని చురుకుగా ఉండేలా బద్ధకం లేకుండా చేస్తుంది.
అన్నిటికంటే పెద్ద ఒత్తిడి
మనం ఇన్ని రకాల ఒత్తిళ్లు చూశాం. వీటన్నిటికంటే అతి పెద్ద ఒత్తిడేమిటో తెలుసా? మనస్సాక్షికి విరుద్ధంగా జీవించడం. నైతిక జీవనానికి దూరంగా జీవించడం.
పరిష్కారం
నైతికంగా, మనస్సాక్షికి అనుగుణంగా జీవించడమే దీనికి పరిష్కారం. అంటే హృదయాన్ని అనుసరించి జీవించడం. హృదయం మన్షి జీవితానికి దిక్సూచి. అది సరైన దీశాను మాత్రమే చూపిస్తుంది. హృదయ గళాన్ని వినాలి, వణ్ణదాన్ని అనుసరించాలి. ఇది సహజంగా జరగడం కోసమే ధ్యాన సాధన. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే సాహసాన్ని కూడా ఇచ్చేది కూడా ఈ ధ్యానసాధనే. ముఖ్యంగా ఈ హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ ధ్యాన సాధన. మొట్టమొదటి రోజు నుండి, మనలో పేరుకుపోయిన ఈ ఒత్తిడి నుండి ఉపశమనాన్ని అనుభూతి చెందుతారు. అందరూ తప్పక ప్రయత్నింతురుగాక.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి