Forget Thyself and Remember Him
నిన్ను నువ్వు మరచి ఆయన్ని స్మరించు
Forget Thyself అనేది బాబూజీ మహారాజ్ ఇచ్చిన సందేశం. అంటే నిన్ను నువ్వు మరచిపో అని అర్థం. అంతకు పూర్వం బుద్ధ భగవానుడు, ఆదిశంకరులవారు, అందరూ "నిన్ను నువ్వు తెలుసుకో" అని బోధించడం జరిగింది. కాని బాబూజీ "నిన్ను నువ్వు మరచిపో" అన్నారు. ఇది నా దృష్టిలో బాబూజీ అందించిన మహావాక్యాల్లో ఒకటి. దీనిపై కాస్త ధ్యానించే ప్రయత్నం చేద్దాం.
ఈ వాక్యానికి అనేక అర్థాలు స్ఫురిస్తున్నాయి: 1) "నేను" అనే స్పృహ లేకుండా జీవించు, అంటే అహం లేకుండా జీవించు, అని. 2) శారీరక స్పృహ లేకుండా, మానసిక స్పృహ లేకుండా, కర్తృత్వ భావం లేకుండా, నేను అనే స్పృహ లేకుండా జీవించు, అని. 3) నిరంతరమూ "ఆయన" స్పృహలో, ఆ భగవంతుని స్పృహలో జీవించు అని. 4) నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే కూడా నిన్ను నువ్వు మరచిపోయి జీవిస్తేనే సాధ్యం. 5) నిన్ను నువ్వు మరచిపోయి జీవించినప్పుడే యదార్థ సత్యం బోధపడుతుందని ఒక అర్థం. 6) అసలు జీవించే విధానమే, మనలను మనం మరచిపోయి జీవించడం అని మరో అర్థం. 7) నిన్ను నువ్వు సంపూర్ణంగా మరచిపోవడమే బహుశా ఆత్మసాక్షాత్కారం అంటే.
ఒక పుస్తకం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే మనలను మనం మరచిపోయి, మయిమరచి చదివినప్పుడే సాధ్యపడుతుందని మన అనుభవం చెబుతున్నది. అలాగే యే పనైనా సరే, నృత్యసంగీతాల వంటి కళలు కూడా మయిమరచి చేసినప్పుడే శ్రోతలను, ప్రేక్షకులను పరవశింపజేయగలిగేది; యే విద్యలోనైనా పరాకాష్ఠకు చేరుకోవాలంటే రహస్యం ఇదే. అంటే "నేను" లేక ఆహాన్ని మరచిపోయినప్పుడే మనం చేసే పనికి పరిపూర్ణత, సార్థకత సిద్ధిస్తాయి.
కానీ ఈ స్థితి సిద్ధించాలంటే ఎలా? సాధన ద్వారా. యే విద్యలోనైనా సరే, అభ్యాసం వల్ల, సాధన వల్ల మాత్రమే ఆ విద్యలో నైపుణ్యం, మెళకువలు, ప్రావీణ్యం సాధించడం వల్ల ఆయా విద్యల ద్వారా ఇతరులను పరవశింపజేసే విధంగా మనం చేసే పనుల్లో కౌశల్యం సంపాదించవచ్చు. యోగః కర్మసు కౌశలం అన్నాడు పతంజలి మహర్షి.
అలాగే మానవ జీవితం యొక్క సంపూర్ణ సార్థకత సిద్ధించాలంటే నన్ను నేను సంపూర్ణంగా మరచిపోవాలి. అయితే ఇది అనుకున్నంత తేలికైన పని కాదు. అందుకే బాబూజీ నేర్పించే ధ్యానం ద్వారా సాధకుడికి మొట్టమొదటి సిట్టింగు నుండే ఈ శిక్షణ ప్రారంభమైపోతుంది. సాధకుడు "ఆయన" స్పృహలో జీవించే కళను బోధించకుండా బోధిస్తారు బాబూజీ. నిరంతర స్మరణను, సాధనా పరికరంగా బోధించడం చేస్తారు. క్రమక్రమంగా సాధకుడు, శారీరక స్పృహ నుండి, మానసిక స్పృహ నుండి, చివరికి ఆత్మ యొక్క స్పృహ నుండి కూడా విముక్తుడై ఒక అనూహ్యమైన దివ్యస్పృహలో జీవించడం జరుగుతుంది. అటువంటి జీవనమే పరిపూర్ణ జీవనం. ఈ స్పృహలోనే బాబూజీ జీవించారనడానికి వారి జీవితమే గాక, వారు పలికిన మరో వాక్యం కూడా నిదర్శనమే - " నేను నేను అన్నప్పుడు, అది నన్ను సూచిస్తున్నడో, లేక నా మాస్టరును సూచిస్తున్నదో లేక ఆ భగవంతుని సూచిస్తున్నదో నాకు తెలియదు" అన్న వారి వాక్యం.
ప్రతీ సాధకుడూ ధ్యానించి తెలుసుకోవలసిన వాక్యాలివి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి