గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం - మూడవ రోజు ముగింపు సమావేశం16.3.2024
మూడవ రోజు, సాయంకాలం ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధనకర్ గారు, శ్రీమతి సుధేష్ణ ధనకర్ గారు, తెలంగాణా రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళ సై గారు, కామన్ వెల్త్ సెక్రటరీ జనరల్ శ్రీమతి ప్యాట్రీషియా స్కాట్లండ్, భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖామాత్యులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక ఎమ్. ఎల్. ఎ. శ్రీ శంకర్ గారు, పూజ్య దాజీ, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ పెద్దలైన టోనీ నాడర్ గారు, బ్రహ్మకుమారి శ్రీ మృత్యుంజయ గారు, బాబా జైన్ గారు, మాస్టర్ జీ, వేదికను అలంకరించడం జరిగింది.
అనేక ప్రముఖులు ప్రసంగించిన తరువాత పూజ్య దాజీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు ఈ మహోత్సవాన్ని నిర్వహించేందుకు కాన్హా శాంతి వనాన్ని ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు పలికారు. అలాగే ఈ గ్లోబల్ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని జరపడం ఇదే మొదటి సారి అని, చరిత్ర ఇక్కడే సృష్టించబడుతోందని, బహుశా ఈ మహోత్సవం ప్రతీ సంవత్సరం ప్రపంచామంతటా జరిగే అవకాశం ఉందని వారు ప్రకటించారు. ఈ ఉదయం దాజీ, ఇక్కడ పాల్గొన్న ఇమామ్ గారిని సాగనంపడానికి వెళ్ళినప్పుడు, ఇమామ్ గారు పూజ్య దాజీతో, " దాజీ, నా కొడుకు ధ్యానం ప్రారంభిస్తాడు; అలాగే మా ఆధ్వర్యంలో ఉన్న 3 లక్షల మదరసాల పిల్లలకు మీ కాన్హాలో బ్రైటర్ మైండ్స్ శిక్షణానివ్వాలని" కోరడం జరిగిందని దాజీ చక్కటి వార్తను తెలియజేశారు. ఇన్ని సంస్థలు కలిసి రావడం చాలా అమితమైన ఆనందాన్ని కలిగించింది, కానీ మరిన్ని సంస్థలు కలవాలని ఆశిస్తున్నాను, అన్నారు. కలిసి రావడం మొదటి మెట్టు మాత్రమే, ప్రారంభం మాత్రమే, కలిసి పని చేయడం రెండవ అడుగవ్వాలి. అప్పుడే అది పురోగతిగా తర్జుమా అవుతుంది. చాలా మంది ఈ మహోత్సవ ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు; దానికి నేను, ప్రస్తుతానికి అందరమూ కలవడం, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం, ఒకర్నొకరు అర్థం చేసుకోవడం, ఒకర్నొకరు తెలుసుకోవడం. ఆ తరువాత మనం ప్రపంచామంతటా కార్యక్రమాలను అమలు చేసినప్పుడు, వివిధ సంస్థల వలంటీర్లందరూ కలిసి ఒకే కార్యక్రమాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తారు. ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యాలున్నాయి, వాటిని ఎస్. డి. జి. గోల్స్ అంటారు - అన్ని రకాల కాలుష్యాలను పోగొట్టడం -మట్టి కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, స్త్రీలకు విద్య, సమానత్వం, పేదరికాన్ని నిర్మూలించడం ఇలా ఎన్నో లక్ష్యాలున్నాయి. కానీ అన్నీ సమస్యలకూ మూల కారణమైనదాన్ని వాళ్ళు మరచిపోయారు - అదే మానసిక కాలుష్యం, ఆలోచనా కాలుష్యం. అన్ని కాలుష్యాలకీ మూల కారణం ఆలోచనా కాలుష్యమే. అందుకే ధ్యానం చాలా అవసరం. క్రమశిక్షణలో ఉన్న మనసు సరైన విచక్షణ కలిగి ఉంటుంది, ప్రలోభాలకు గురి కాదు, అతీతంగా ఎదిగిన మనసు తప్పుడు ఆలోచనలు చేసే అవకాశమే ఉండదు; ఇది కేవలం ధ్యానం వల్లనే సాధ్యం; అందుకే ధ్యానం అందరికీ అవసరం. దైవం ఒక్కటే. అన్నీ మతాలు చెప్పేది అదే. దైవం అంటే ప్రేమ ; ప్రేమ అంటేనే శరణాగతి. శరణాగతి అంటే ఓడిపోవడం కాదు. నా ఆహాన్ని సంపూర్ణంగా తొలగించేసుకున్నాను, నీవే నా సర్వస్వం అనే అంతరంగ స్థితి శరణాగతి అంటే. ఎ మతానికి చెందినా సరే, ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, హిందువు మంచి హిందువవుతాడు, ముస్లిం మంచి ముస్లిం అవుతాడు, క్రైస్తవుడు సరైన క్రైస్తవుడవుతాడు, వగైరా, వగైరా. మీ ధర్మాన్ని మీరు సక్రమంగా పరిపూర్ణంగా పాటిస్తే యుద్ధాలుంటాయా? ఉండవు; ఉండటానికి వీల్లేదు. నా గురుదేవులు బాబూజీ మహారాజ్ గారు అంటూండేవారు, మిమ్మల్ని మీరు గొప్పవారిగా భావించుకోవడంలో తప్పేమీ లేదు, కాని అవతలివారిని మరింత గొప్పవారుగా భావించమనేవారు. మిమ్మల్ని మీరు గొప్పవారిగా భావించుకోండి, తప్పు లేదు; కాని అవతలి వ్యక్తి మీకంటే గొప్పవారని భావించండి.
కాబట్టి ఈ అవగాహనతో, ఈ ప్రశాంత చిత్తంతో, ప్రతి రోజూ ధ్యానించండి; రోజూ చేసే నమాజ్ చేయండి; మీరు చేసే పూజలు చేయండి; ఇవన్నీ చేస్తూ హృదయాలు తెరిచి ఉంచండి, ప్రేమతోఉండండి, భగవదనుగ్రహాన్ని అందుకునే స్థితిలో ఉండండి; హృదయాన్ని ఖాళీగా ఉంచండి; భయంతో కాదు, కేవలం ఒక ఆచారం కాకూడదు, ప్రలోభంతో కాకూడదు. ప్రేమ కోసమే ప్రేమతో ఇవన్నీ పాటించడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు మీరు మారతారు; ఒకసారి మీరు మారారంటే, ప్రపంచం కూడా మారుతుంది.
ఆ తరువాత వేదికపై ఉన్న పెద్దలందరూ మాట్లాడటం జరిగింది. ముఖ్యమైన ముగింపు ప్రసంగం భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధనకర్ గారు చేస్తూ, ఆధ్యాత్మికత యొక్క అవసరాన్ని, ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యతను, మన దేశానికి గల ఆధ్యాత్మిక సంపదను గుర్తు చేయడం జరిగింది. కాన్హా శాంతి వనం నుండి ఒక గొప్ప తరంగం ఎగిసి మొత్తం ప్రపంచాన్నంతటినీ ఆవరించబోతోందని ఎంతో ఆత్మవిశ్వాసంతో పలికారు. కాన్హా శాంతి వనం ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా అభివర్ణించారు. నిజానికి ఈ సమావేశం తరువాత కార్యక్రమం ప్రకారం నేను వెళ్ళిపోవాలి గాని, నేను ఇక్కడే మీ అతిథిగా మరో పూట ఉండబోతున్నాను అని పూజ్య దాజీని కోరారు.
ఉపరాష్ట్రపతి ప్రసంగం తరువాత అందరూ జాతీయగీతాన్ని ఆలపించారు. ఆ తరువాత ఒక సాంస్కృతిక కార్యక్రమంతో ఈ గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవం అధికారికంగా ముగింపుకు వచ్చింది.
ఇది చరిత్రలో ఒక గొప్ప మహా దినం గా నిలిచిపోతుంది.
రిప్లయితొలగించండి