7, మార్చి 2024, గురువారం

చైతన్య వికాసానికి అవరోధాలు



చైతన్య వికాసానికి అవరోధాలు 

చైతన్య వికాసానికి, లేక అంతఃకరణ శుద్ధికి, లేక దైవ సాక్షాత్కారానికి లేక మనకు మనలోని అంతర్యామిగా ఉన్న దైవానికి అడ్డుగా, అవరోధాలుగా నిలిచేవి ఏమిటి? మన మానస, బుద్ధి, అహంకార చిత్ లను కలుషితం అవడానికి, అశుద్ధమవడానికి, మలినమవడానికి గల కారణాలేమిటి? మనలను, మనలో అంతర్యామిగా ఉన్న దైవాన్నీ, వేరు చేసేవి మూడే మూడు అంశాలు: కోరికలు, సంస్కారాలు/ముద్రలు/కర్మలు/వాసనలు, అహంకారము. వీటి వల్లనే మనకున్న  ప్రస్తుత స్థితి. ఇవే మన జీవితాలను శాసించేది. వీటి వల్లనే మనోబుద్ధ్యహంకారచిత్తాలు కలుషితమయ్యేది.

ఇవన్నీ మనకు కనిపించనివే. అయినా మనలను శాసిస్తున్నాయి. వీటిని శుద్ధి చే విద్యే యోగవిద్య లేక బ్రహ్మ విద్య, లేక ఆధ్యాత్మిక విద్య లేక హార్ట్ఫుల్నెస్ వంటి ధ్యాన పద్ధతి.  

కోరికలు తగ్గించుకుంటూ ఉండాలి. కోరికలు ఎంత తగ్గితే అంత ఆనందమే గాక, అన్ని జన్మలు తగ్గిపోతాయి. కోరికలు పెంచుకోవడం అంటే జన్మలు పెంచుకోవడమే. కోరికలే సంస్కారాలను పుట్టిస్తాయి. కోరికలు పెరుగుతున్న కొద్దీ హృదయభారం పెరుగుతూ ఉంటుంది. ముందు కోరికలను తగ్గించుకుని అవసరాలకు దిగాలి. ఆ తరువాత అవసరాలు కూడా కనీసంగా ఉండే విధంగా మన జీవన విధానం ఉండాలని బాబూజీ చెప్తూండేవారు. 

మనం ప్రపంచంతో వ్యవవహరిస్తున్నప్పుడు, నాలుగు రకాలుగా మన హృదయంపై ముద్రలను ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ ముద్రలే పదే పదే  ఏర్పడి సంస్కారాలుగా, పతంజలి మహర్షి చెప్పే చిత్త వృత్తులుగా ఏర్పడి అవి మన జీవితాలను శాసిస్తూ ఉంటాయి. ఈ సంస్కారాలు నాలుగు రకాలు - 1) రాగద్వేషాలు (ఇష్టాయిష్టాలు), 2) ప్రాపంచిక చింతలు 3) ఇంద్రియపరమైన, లైంగికపరమైన ముద్రలు 4) అపరాధభావాన్ని సృష్టించే ముద్రలు. 

ఇవన్నీ గతంలో ఏర్పరచుకున్నవి, ఈ జన్మలోనే గాక, ఇంతకు పూర్వం ఏర్పరచుకున్నవాటి ప్రభావం వల్ల మన ప్రస్తుత జన్మ నిర్ధారింపబడుతుంది. కాబట్టి మన జీవితశైలిని యే విధంగా మలచుకోవాలంటే, పుట్టుకతో తెచ్చుకున్న సంస్కారాలను భోగిస్తూ, అనుభవిస్తూ; ఇంకా ఖర్చవ్వాల్సిన బీజరూపంలో ఉన్న సంస్కారాలను యోగ సాధన ద్వారా తొలగించుకుంటూ, కొత్త సంస్కారాలు  ఏర్పడకుండా ఉండే విధమైన జీవన విధానాన్ని అవలంబించాలి. అటువంటి జీవన విధానమే హార్ట్ఫుల్నెస్ జీవన విధానం. ఈ సంస్కారాలన్నీ బీజరూపంలో మన చేతనలో, సూక్ష్మ-కారణ శరీరాల్లో పొరలుపొరలుగా నిక్షిప్తమై ఉంటాయి. 

ఇక అహంకారం: అంటే 'నేను',  'నాది' అనే స్పృహతో జీవించడం. దీన్ని వినయం ద్వారా అంటే, 'ఆయన', 'ఆయనది' అంటే భగవంతునిది అన్న స్పృహతో జీవించగలిగితే జీవితం డైవోన్ముఖం అవుతుంది. 

ఈ విధంగా సగటు మానవ జీవన విధానంలో పరివర్తన తీసుకురాగలిగేది మన సంకల్ప శక్తి, మన కృషి ఇటువంటి జీవన విధానాన్ని అవలంబించడం ద్వారా సుసాధ్యమవుతుంది; కనీసం రోజు-రోజుకూ మెరుగైన మనిషిగానైనా జీవించగలుగుతాం. 


2 కామెంట్‌లు:

  1. అబ్బ ! ఎంత స్పష్టంగా చెప్పారు. ఎందుకు మనం సాధన చేయాలి, ఏవి తొలగించుకోవాలి ... విశదంగా చెప్పారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

భక్త హనుమాన్ జయంతి

    భక్త హనుమాన్ జయంతి  హనుమజ్జయంతి ప్రతి సంవత్సరమూ చైత్ర శుక్ల పౌర్ణమినాడు ప్రపంచమంతటా ఉన్న హిందువులు జరుపుకుంటారు. శ్రీరామాయణ కావ్యంలో హను...