ధ్యానం యొక్క ముఖ్య ప్రయోజనం
ప్రకృతి సిద్ధంగా, స్వతః సిద్ధంగా, ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా, వివిధ సందర్భాలలో క్షణికంగా కళ్ళు మూసుకోవడం వల్ల కలిగిన మనశ్శాంతి, ఉపశమనం, ప్రశాంతత, స్పష్టత దీర్ఘకాలికంగా మరింత ఎక్కువగా అనుభూతి చెందాలంటే తెలిసి చేసే ధ్యానం అవసరం.
అసలు ధ్యానం అంటే ఏమిటి? ఆలోచన అనుభూతిగానూ, బుద్ధి వివేకంగానూ, అహం, అంటే నేను అనే స్పృహ, నీవు (భగవంతుడు) అనే స్పృహగానూ, వెరసి శుద్ధ చైతన్యంగా పరిణతి చెందే విధంగా చేసేదే ధ్యానం.
ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యాలు రెండు, అది యే రకమైన ధ్యానమైనా సరే :
1) చంచలమైన మనసును క్రమశిక్షణలో ఉంచడం
2) మనసుకు దాటి అతీతంగా వెళ్ళగలగడం.
మనసున్నవాడే మానవుడు. మనసును బట్టే మానవుడి మనుగడ. మనసు నాణ్యతను బట్టే మనిషి నాణ్యత. ఇక్కడ మనసు అంటే చేతనం అని కూడా అర్థం చేసుకోవచ్చు. మన ఆధ్యాత్మిక సాహిత్యంలో మనసు అంటే చేతనగా అర్థం చేసుకోవాలి. ఈ మనసులోనే, లేక ఈ చేతనలోనే, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇమిడి ఉన్నాయి. వీటిని ప్రధాన సూక్ష్మ శరీరాలు అని కూడా అంటారు. ఈ నాల్గింటినీ కలిపి అంతఃకరణ అని కూడా అంటారు.
మనిషి సమూలంగా మారాలంటే మనసు మారాలి. అంటే మనసు, బుద్ధి, అహంకారం చిత్తము, ముఖ్యంగా ఈ నాలుగూ శుద్ధి కావాలి. ఈ అంతఃకరణ శుద్ధి జరగాలి.
అయితే ఇవి కలుషితం ఎలా అయ్యాయి? మనలోనే ఉన్న కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలే గాక, భయం, అలసత్వం (బద్ధకం) వల్ల మన మనసు, బుద్ధి, అహంకారం కలుషితమవడం వల్ల ఫలితంగా చిత్తం లేక చైతన్యం కూడా అశుద్ధమైపోయింది. ఈ కలుషితమైన చైతన్యమే మన జీవితాలను నడిపిస్తున్నది. ఇలా కలుషితమవడం వల్లే ఈ నాలుగు సూక్ష్మశరీరాలు ప్రభావితమై - ఆలోచనా క్రమం జటిలంగా తయారవుతుంది; దానితో మన మాటలు, చేతలు, అలవాట్లు, ప్రవర్తన, మన శీలం/వ్యక్తిత్వం అన్నీ జటిలంగా మారిపోతూ ఉంటాయి. ఇవే జటిల తత్త్వాలుగా మారతాయి. అరిషడ్వర్గాల ప్రభావంతోనే మనిషి జటిలంగా తయారవుతాడు.
అరిషడ్వర్గాలనే అశుద్ధాలు తొలగించుకుని, శుద్ధంగానూ, జటిల తత్త్వాలను తొలగించుకుని స్వచ్ఛంగానూ, తద్వారా ఈ చైతన్య శుద్ధి చేసుకున్నట్లయితే జీవితం కూడా క్రమక్రమంగా శుద్ధి అవుతుంది.
అవును కదా !
రిప్లయితొలగించండి