సహజ్ మార్గ్ లో మార్చ్ 24, 1945 ప్రాశస్త్యం
ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ కనీ, విని ఎరుగని, యే పవిత్ర ఆధ్యాత్మిక సాహిత్యంలో కనిపించనిది, నమ్మడానికి కూడా కష్టసాధ్యమయ్యే సత్యం, ఒక అత్యద్భుత సంఘటన ఈ మార్చ్ 24, 1945 న చోటు చేసకుందట. పూజ్య దాజీ ఇటీవల బసంత పంచమి మొట్టమొదటి సందేశంలో లాలాజీని స్మరిస్తూ వెల్లడించిన సత్యం ఇది.
మనందరికీ ఒక గురువు తన శిష్యునికి దీక్షనివ్వడం విన్నాం, చదివ్యయం, మనలో కొంతమంది అనుభూతి కూడా చెంది ఉంటాం. దీన్నే ఉపదేశం అని కూడా అంటారు. ఈ దీక్ష అనేది అనేక ఆధ్యాత్మిక ఉన్నత స్థాయిల్లో జరుగుతూ ఉంటుంది; సాధకుడు ఎంతో ఆధ్యాత్మికోన్నతి, శరణాగతి, ప్రేమ, పవిత్రత వినమ్రత, వంటి అనేక అంశాలలో పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు, ఆయా స్థాయిల్లో దీక్షానివ్వడం జరుగుతూ ఉంటుందట. ఈ మార్చ్ 24, 1945 వ తేదీన మానవ జన్మలో ఉన్న ఒక శిష్యునికి తన గురువు గాక, సాక్షాత్తు ఆ పరతత్త్వమే, ఆ పరమాత్మే స్వయంగా, నేరుగా దీక్షనిచ్చారట. వారే పూజ్య మన బాబూజీ మహారాజ్. ఈ మానవ ఊహకందని నిజాన్ని పూజ్య బాబూజీ తన ఆధ్యాత్మిక డైరీలో స్వయంగా వ్రాసుకున్నారు. ఈ సంఘటనను, శ్రీ కృష్ణ భగవానుడు, స్వామి వివేకానంద వారిని కీర్తిస్తూ, ఇటువంటి సంఘటన ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ జరగలేదని ప్రశంసిస్తారు.
మనం ఉన్న పరిస్థితుల్లో ఈ మహత్తర అంశాన్ని అర్థం చేసుకోవాలంటే, ఈ విషయంపై బాబూజీని స్మరిస్తూ అత్యంత భక్తిప్రపత్తులతో సుదీర్ఘ ప్రార్థనా పూర్వక ధ్యానం చేసి ప్రయత్నించడమే తప్ప మరో మార్గం లేదు. మేధస్సుతో అర్థం చేసుకునే విషయం అస్సలు కాదు. వారి అనుగ్రహం ద్వారా తప్ప అర్థం కాని నిగూఢ అంశం ఇది. వారి అపార అనుగ్రహాన్ని ఆకర్షించే విధంగా మనలను మనం మలచుకునే ప్రయత్నంలో నిమగ్నులై ఉందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి