దోమల్గుడా యోగాశ్రమం హైదరాబాదు ప్రారంభోత్సవం - బాబూజీ
హార్ట్ఫుల్నెస్ లో ధ్యాన కేంద్రాల ప్రారంభోత్సవాలు
హార్ట్ఫుల్నెస్ - శ్రీ రామ చంద్ర మిషన్ సంస్థలో ఆశ్రమాల లేక ధ్యాన కేంద్రాల ప్రారంభోత్సవం ఒక విశిష్ఠమైన ఆధ్యాత్మిక వాతావరణంతో కూడుకుని ఉంటాయి. అందులోనూ సాక్షాత్తు మాస్టర్లు ప్రారంభిస్తున్నప్పుడు వీక్షిస్తున్నవారందరి, అక్కడున్నవారందరి హృదయాల్లో ఒక అలౌకిక ఆనందం చోటు చేసుకుంటుంది.
పైన చిత్రం 1967 మే లో దోమలగుడా, హైదరాబాదులో, బాబూజీ కరకమలాలచే యోగాశ్రమ ప్రారంభోత్సవం చేస్తున్న చిత్రం. చిత్రం చూస్తేనే భక్తులు పరవశిస్తారు. అలాగే పూజ్య చారీజీ మణప్పాకంలో, బాబూజీ మెమోరియల్ ఆశ్రమం ప్రారంభిస్తున్నప్పుడు అనుభూతి చెందడం జరిగింది. అలాగే పూజ్య దాజీ కాన్హాశాంతి వనం లో మన గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభించినప్పుడు కూడా హృదయాలు పులకించిపోవడం మనందరమూ అనుభూతి చెందాం.
అంతే కాదు, ఇతర ఆశ్రమాలు గాని, చిన్న-చిన్న ధ్యాన కేంద్రాలను ప్రారంభోత్సవ సందర్భాలలో కూడా అటువంటి వాతావరణమే ఆయా ప్రదేశాలలో నెలకొని ఉండటం గమనించడం జరిగింది. దీనికి మూల కారణం గురుదేవుల సంకల్పం అయితే, స్థానికంగా అభ్యాసుల హృదయాల్లో ఉన్న శ్రద్ధాభక్తులు, సంబంధించిన పనుల్లో, ఆలోచనల్లో, మనసుల్లో కనబరచే ఉత్సాహం వల్ల ద్విగుణీకృతం అవుతుంది. అందుకే అభ్యాసులు ఇటువంటి సందర్భాలలో ఆనందంగా ఎవరి పనులు వాళ్ళు ప్రేమ, సామరస్యాలతో చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ వాతావరణం కొట్టొచ్చినట్లుగా అక్కడున్న ప్రతి ఒక్కరూ తమ హృదయాలలో అనుభూతి చెందడం జరుగుతుంది. హృదయాంతరాళంలో కలిగే ఈ ఆనందం, ఈ ఆత్మసుఖం, మనలో పరివర్తనకు తగిన పునాదులు ఏర్పరస్తుంది. ఆ విధంగా జీవితం అంతా జీవించే అవకాశం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది.
ఈ ధ్యాన కేంద్రాల్లో ఆధ్యాత్మిక సమావేశాలు, నిత్యం ధ్యానం జరుగుతూ ఉంటుంది. శక్తి భాండాగారాలుగా ఉంటాయి. మనిషి ఆత్మపరంగా జీవితంలో అలసిపోయినప్పుడు సేద తీర్చుకునే ప్రదేశాలు. మనిషి మరింత మెరుగయ్యే వాతావరణం ఉన్న కేంద్రాలు. ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడే కాంతి కేంద్రాలు. హృదయంలోని అంధకారాన్ని తొలగించగలిగే సత్తా ఉన్న కేంద్రాలు.
చారీజీ వీటిని కాంతి కేంద్రాలుగా అభివర్ణించేవారు. వీటిని మాస్టర్లు తమ ఆధ్యాత్మిక సంకల్పంతో ఛార్జ్ చేస్తారు. ఈ కేంద్రాలకు వెళ్ళేప్పుడు, సాధకుడు మాస్టర్ వద్దకు, గురువు వద్దకు వెడుతున్నామన్న భావనతో వెళ్ళమన్నారు చారీజీ.
ఇక్కడ సోదరభావం, సమష్టి చైతన్యం (ఎగ్రెగోర్) వల్ల కలిగే ప్రయోజనాలు ప్రత్యక్షంగా అనుభవిస్తేనే కానీ తెలియదు. హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రాలు అంతా ప్రశస్తమైనవి. అందరూ వీటిని సద్వినియోగం చేసుకుందురుగాక.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి