ఈ రోజు 24 వ తీర్థంకరుడు - మహావీర్ జయంతి. జైన సాంప్రదాయంలో, అనేక జన్మల తరువాత వారు చేసిన ఆధ్యాత్మిక సాధనాల వల్ల, అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని చేరుకున్న వ్యక్తిని తీర్థంకరుడు అని అంటారు. ఆఅ అత్యున్నత స్థితిని కైవల్యం అంటారు. తీర్థంకర్ అనే పదానికి - అనేక జన్మ-మరణాల తరువాత ఈ సంసార దుఃఖ సాగరాన్ని దాటాడానికి ఏర్పరచిన తీర్థం లేక నీటి కాలువ అని అర్థం.
అటువంటి తీర్థంకరులు జైన సాంప్రదాయంలో 24 మంది ఉన్నారు. ఈ రోజు 24 వ తీర్థంకరుడైన వర్ధమాన్ మహావీర్ జయంతి. ఈ 24 తీర్థంకరులూ కూడా తలోక రకమైన వృక్షం క్రింద కూర్చొని ధ్యానించేవారట. అటువంటి వృక్షాన్ని దీక్షా వృక్షం అని అంటారు. 24 వ తీర్థంకరుడైన వర్ధమాన్ మహావీరుడు సాళువ వృక్షం క్రింద ధ్యానించి కైవల్యాన్ని పొందారట. దీన్నే గుగ్గిలం చెట్టు అని కూడా అంటారు.
ఈ 24 దీక్షా వృక్షాలను గురించి, 24 తీర్థంకరుల గురించి, ఈ మహాపురుషులకు పర్యావరణానికి మధ్య సన్నిహిత సంబంధం, తద్వారా మానవాళికి వారందించిన సందేశాన్ని చాలా విపులంగా మన పూజ్య గురుదేవులు దాజీ, మన ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు "హోలీ తీర్థంకర్స్" అనే గ్రంథంలో వివరించడం జరిగింది. తప్పక ప్రతీ ఆధ్యాత్మిక సాధకుడూ అధ్యయనం చేయవలసిన గ్రంథం. ఈ గ్రంథ రచన ద్వారా ఎన్నో ఇప్పటి వరకూ వెల్లడి కాని ఆధ్యాత్మిక సత్యాలు, రహస్యాలు పూజ్య దాజీ వారా ఆవిష్కరింపబడ్డాయి.
24 వ తీర్థంకరుడైన వర్ధమానుడికి "మహావీర్" అనే నామకరణం దేవతలకే రాజైన ఇంద్రుడే చేశాడట. వర్ధమానుడి అత్యద్భుత సాహసం, అమితమైన సహనం, అత్యద్భుతమైన యథాతథంగా స్వీకరించే తత్త్వాన్ని చూసి, ఈ బిరుదు ప్రదానం చేయడం జరిగిందట. మహావీరుడి జీవితంలో ఆయన ధ్యానాన్ని భంగం చేయడానికి అనేక మంది అనేక రకాలుగా చిత్రావధాలకు గురి చేసినప్పటికీ, ఎన్నో అతి కఠినమైన సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, ఊహించలేని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ వారు ధ్యానానికి భంగం కలుగానీయ లేదు. అన్నిటినీ సహనంతో భరించడమే గాక ఇబ్బందులు పెట్టినవారందరి పట్ల ప్రతీకార భావం లేకుండా అందరినీ పూర్తిగా క్షమించేవారు కూడా. కలిగిన కష్టాలన్నీ తన కర్మలను నష్టం చేయడానికేనాని భావించేవారు. ఒక దేవత, ఆయన తపస్సుకు మెచ్చి, తనను శరీరంతో సహా స్వర్గానికి తీసుకువెడతానని, ఆఅ తరువాత మోక్షాన్ని కూడా ప్రసాదిస్తానని ప్రలోభ పెడితే కూడా లొంగక ఈ సమాధానం ఇస్తారాయన - "నాకు ఎవ్వరూ మోక్షం ఇవ్వలేరు. మనిషి తన కృషీ, ప్రయత్నాల వల్ల మాత్రమే మోక్షాన్ని పొందగలాడు. మొట్టమొదటగా దానికి అర్హత సంపాదించాలి, అప్పుడే మోక్షాన్ని అందుకోగలుగుతాడు" అని అన్నారట. వెంటనే ఆఅ దేవత తన పొరపాటును గ్రహించి, మహావీరుడి పాడాలపై పది క్షమాపణ వేడుకుంటాడట.
వారు కైవల్య స్థితిని పొందిన తరువాత పలికిన మాటలు ఇలా ఉన్నాయి - "నేను పరమ పవిత్ర ఆత్మను. నేను అంతటా చూస్తునది ఆ పరమ పవిత్ర ఆత్మనే. పరిస్థితులు శరీరానికి కష్టాలను, నొప్పిని కలిగించవచ్చు, కానీ ఇప్పుడు నేను సర్వత్ర ఆ పవిత్రాత్మనే చూడగలుగుతున్నాను."
ఆఅ దివ్య తీర్థంకరుని మన గురుదేవుల కృప వల్ల ఈ మాత్రం తెలుసుకో గలిగినందుకు, వారికి కృతజ్ఞతను అనుభూతి చెందుతూ, ఆధ్యాత్మిక సాధకులు తమ మార్గంలో వచ్చే ఇబ్బందులను, కష్టాలను యే విధంగా ధైర్యంగా ఎదుర్కొనే అవసరం ఉందో జీవించి చూపించిన ఈ దివ్య పురుషుని జన్మదినాన, కైవల్యం పొందిన దినాన కనీసం ఒకసారి హృదయపూర్వకంగా స్మరించుకుందాం. పూజ్య గురుదేవులు వ్రాసిన "హోలీ తీర్థంకర్స్" గ్రంథాన్ని చదువుకుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి