సహజ మార్గ పద్ధతి ద్వారా దివ్యదర్శనం జరుగుతుందా?
హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ ధ్యాన పద్ధతి, ఈ ఆధ్యాత్మిక పద్ధతి ద్వారా దైవ దర్శనం జరుగుతుందా? భగవంతుని సాక్షాత్కారం జరుగుతుందా అనేది సాధకుల్లో అంతర్లీనంగా తొణికిసలాడే ప్రశ్న.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దివ్య స్పర్శ యొక్క అనుభూతి కలుగుతుంది. అంతర్యామిగా ఉండే భగవంతుని ఉనికిని మొట్టమొదటి నుండే స్పర్శించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక దాహం తృప్తి పడుతుంది; తపనకు ఉపశమనం కలుగుతుంది. కొంచెం-కొంచెంగా ఈ దాహార్తి తీరుతూ ఉంటుంది. దీన్నే పూజ్య దాజీ incremmental
experience of the Divine అంటారు.
దీనికి సంకేతాలు: హృదయభారం తగ్గి తేలికగా అనిపించడం, అంతకంతకూ నిగూఢమైన ప్రశాంతత అనుభూతి చెందడం, నిశ్చలత్వాన్ని, నిశ్శబ్దాన్ని, శూన్యత్వాన్ని, అలౌకిక ఆనందాన్ని, అనుభూతి చెందడం జరుగుతుంది.
అర్జునుడంతటి మహాపురుషుడు కూడా భగవంతుని విరాట్ స్వరూపాన్ని చూపించినప్పుడు దర్శించలేకపోయాడు; స్వస్వరూపానికి వచ్చేయమంటాడు. "హృదయమే పశ్యసి" హృదయంలో నన్ను దర్శించమని శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పినట్లు పూజ్య దాజీ తరచూ చెబుతూ ఉంటారు. అదే సహజ మార్గ ధ్యానంలో చేసే ప్రయత్నం. అందుకే సహజ మార్గ సాధకులు, వారిని గమనిస్తే ఎప్పుడూ ఆత్మసంతృప్తి కలిగి ఉన్నట్లుగా కనిపిస్తారు, ఇతరులకు సేవలనందించాలన్న తపన ప్రారంభమవుతుంది వాళ్ళల్లో.
మతం భగవంతుడు ఉన్నాడన్న అవగాహనను కలిగిస్తుంది; ఉన్నాడన్న నమ్మకాన్నిస్తుంది; ఆధ్యాత్మికత ఆ భగవంతుని అనుభూతినిస్తుంది; కేవలం దివ్యత్వాన్ని అనుభూతి చెందడం వల్ల సంతుష్టి కలుగదు. అణువణువూ దివ్యంగా మారాలన్న సంకల్పం కలుగుతుంది. ఆ తరువాత ఆనందస్వరూపులుగా మారడం జరుగుతుంది; తుదకు అది కూడా దాటినప్పుడు భగవంతునిలో సంపూర్ణ ఐక్యం పొందడం జరుగుతుంది.
ఈ ప్రక్రియ అంతా ప్రతీ అభ్యాసిలోనూ కూడా, అభ్యాసి తపన, నిబద్ధతను బట్టి కొంచెం-కొంచెంగా జరుగుతూ ఉంటుంది. కొంచెం-కొంచెంగా ఎందుకు అని అనిపిస్తుంది? కొంచెం-కొంచెంగా దైవానుభూతి కలగడమే కాదు, కొంచెం-కొంచెంగా దైవత్వానికి నిలబడే సమర్థతను కూడా ఏకకాలంలో పెంచుతూ ఉండటం జరుగుతుంది, ఈ ప్రాణాహుతితో కూడిన ధ్యానంలో. అందుకే అభ్యాసి ప్రయత్నం/సహకారం, గురువు/భగవంతుని యొక్క కృప/అనుగ్రహం, రెండూ కలిసినప్పుడు, నీటి చుక్క మహాసముద్రంలో కలిసే, ఆత్మ పరమాత్మలో ఏకమయ్యే యోగసిద్ధి కలుగుతుంది.
అటువంటి అద్భుతమైన ధ్యాన పద్ధతిని మానవాళికి అందించిన మన ప్రియతమ బాబూజీ మహారాజ్ కు శతకోటి వందనాలు, కృతజ్ఞతలు, ప్రేమతో కూడిన శరణాగతితో ప్రణామాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి