19, జూన్ 2024, బుధవారం

ధ్యానం లో కలిగే స్థితులు


ధ్యానం లో కలిగే  స్థితులు 

ధ్యానం ప్రారంభించిన ప్రతీ అభ్యాసి, మొట్టమొదటి ధ్యానం నుండే యేవేవో స్థితులను ఆశిస్తూ ఉంటాడు. అప్పటికే మనసు నిండా చిన్నప్పటి నుండి కలిగిన అనుభవాల వల్ల, పెరిగిన వాతావరణం వల్ల, చదువుకున్న గ్రంథాల వల్ల, విన్న ప్రవచనాల వల్ల, అప్పటికే యేదో తెలిసిపోయిన స్థితిలో ఉండి, అస్పష్టంగానైనా యేదో ఆశిస్తూ ఉంటాడు. ధ్యానం అంటే స్పష్టమైన అవగాహన లేక ఈ భావాలుంటాయి; భగవంతుడు దర్శనం ఇస్తాడనో, యేవో ప్రకంపనలు కలుగుతాయనో, యేదో వెలుగు కనిపించాలనో, మహాత్ముల దర్శనం కలుగుతుందనో, లేక భవిష్యత్తులో జరుగవలసినవి ముందే తెలిసిపోతాయనో, యేవో అద్భుతాలు జరుగుతాయనో చాలా ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా. అసలు తుడిచేసిన పలకలాంటి హృదయంతో యేవీ ఆశించకుండా ఉండే ఖాళీ హృదయంతో కూర్చొనేవాళ్ళు చాలా అరుదు; ఈ విధంగా ధ్యానించగలిగితే, వాళ్ళు ధన్యులు. 
అయితే పైన చెప్పినవేవీ జరగవా? ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో? తప్పక జరిగే అవకాశం ఉంది, కానీ చాలా ముందుకు సాగిన తరువాత, గణనీయమైన పురోగతి సాధించిన తరువాత  అవకాశం ఉంటుంది. 
మరేం జరుగుతుంది హార్ట్ఫుల్నెస్ ధ్యానం తరువాత? ధ్యానం చేసిన ప్రతీసారీ తప్పక మనశ్శాంతి, తేలికదనం అనుభూతి చెండుతాం. హార్ట్ఫుల్నెస్ మాస్టర్లు ధ్యాన సమయంలో యేమి జరిగిందీ అన్నాదాని కంటే కూడా, ధ్యానం తరువాత కలిగే అనుభూతిని గుర్తించమంటారు. ఆ స్థితినే రోజంతా స్మరించుకునే ప్రయత్నంలో ఉండమాటారు; దాన్నే ఎ. ఇ. ఐ. ఒ. యు. ప్రక్రియగా పూజ్య దాజీ మనకు నేర్పడం జరిగింది. 
కొన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవలసినవి 
ఒకటి. మంచి ధ్యానం, చెడు ధ్యానం అంటూ యేదీ ఉండదు. నిజానికి మనకు బాగోలేదనిపించిన ధ్యానం చాలా మంచి ధ్యానం కావచ్చు. ఎందుకంటే ప్రతీ ధ్యానం ఆత్మ వికాసంలో ఒక్కొక్క మెట్టుగా భావించాలి. మనం నిర్మించుకుంటున్న ఆధ్యాత్మిక సౌధంలో ఒక్కొక్క ధ్యానం ఇటుకరాయిగా భావించుకోవాలి. 
 "ధ్యానంలో యేమి జరిగినా అది మన మంచికే" - బాబూజీ. 
రెండు. ధ్యానం అనేది ఒక ప్రయాణం. ఒక యాత్ర. వివిధ రకాల చేతనల ద్వారా జరిగే యాత్ర. ప్రతీ ధ్యానం కొత్తగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. ఒకేలా ఉందీ అంటే మన ఎక్కడో ఇరుక్కుపోయామని తెలుసుకోవాలి, వెంటనే ప్రశిక్షకుని వద్దకు వెళ్ళి సిట్టింగు తీసుకోవాలి. మనకు కలిగిన అనుభూతి పట్ల మక్కువ మమకారం ఏర్పడటం వల్ల ఇలా ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. అందుకే డైరీలో వ్రాసుకొని మరచి పొమ్మంటారు, మన మాస్టర్లు. 
మూడు: ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యం చంచలంగా ఉండే మనసును క్రమబద్ధీకరించడం, క్రమశిక్షణలో పెట్టడం - అని మరచిపోకూడదు.  
నాలుగు. ప్రతీ ఉదయం ధ్యానంలో, ఒక ప్రత్యేకమైన ధ్యాన స్థితిని ప్రసాదించడం జరుగుతుందని పూజ్య దాజీ చెబుతూ ఉంటారు. దాన్ని గుర్తించి, రోజంతా ఆ స్మరణలో ఉండటం వల్ల మనకు కొత్త సంస్కారాలు అంటే అవకాశం ఉండదు; మనసు ఊరికే అటు-ఇటూ సంచరించడం తగ్గుతుంది కూడా. ఒక రోజు, అంటే  రోజుకు 24 గంటలు, గంటకు 60 నిముషాలు, నిముషానికి 60 సెకన్లు స్మరణలో ఉండే అవకాశం వస్తుంది. దీన్ని నిరంతర స్మరణ అంటారు దాజీ. జాగృత, స్వప్న, సుషుప్తి - ఈ మూడు అవస్థల్లో కూడా ఈ స్మరణ కొనసాగినప్పుడు, దాన్ని నిరంతర స్మరణ అంటారు. దీన్నే బాబూజీ కాన్ స్టెంట్  ఛార్జింగ్ అంటారు. ఇటువంటి నిరంతర స్మరణ ప్రేమకు దారి తీస్తుంది; ఆ ప్రేమ శరణాగతికి దారి తీస్తుంది; శరణాగతి లయావస్థకు దారి తీస్తుంది. 



 

1 కామెంట్‌:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...