సహజ మార్గ ప్రార్థనలోని మొదటి వాక్యం:
మనిషి జన్మ యొక్క యదార్థ లక్ష్యం
సహజ మార్గ ప్రార్థనలోని మొదటి వాక్యం ఈ విధంగా ఉంటుంది: "ఓ, మాస్టర్! మానవ జీవితమునకు యదార్థ లక్ష్యము నీవే."
"O Master! Thou art the Real Goal of human life."
మనిషికి అనేక లక్ష్యాలున్నట్లుగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఆ లక్ష్యాలు సిద్ధించడం కోసం నిత్యం సంఘర్షిస్తూ ఉంటాడు. వాటిల్లో ప్రధాన లక్ష్యాలు - డబ్బు సంపాదించడం, ఆస్తులు సమకూర్చుకోవడం, అధికారం సంపాదించడం, పేరు-ప్రతిష్ఠలు సంపాదించడం, ఉద్యోగాల్లో ఉన్నత హోదాలకు చేరడం, ఇలా కొన్ని ఉన్నాయి.
మనిషికి అనేక లక్ష్యాలుండవచ్చు గాని, యదార్థ లక్ష్యం ఒక్కటే అందరికీ అంటుంది ఆధ్యాత్మికత. ఆ యదార్థ లక్ష్యం ఏమిటంటే, మనిషి యొక్క అంతరంగ వికాసం. దీన్నే ఆధ్యాత్మిక వికాసం, ఆత్మవికాసం, చైతన్య వికాసం, అని కూడా అంటారు. The real goal of human life is to evolve. అంతరంగ వికాసం అంటే మనోబుద్ఢ్యహంకారచిత్తాల పరిణతి, వికాసం. చేతన యొక్క వికాసం.
మన వైదిక వాజ్ఞ్మయం ప్రకారం అమీబా వంటి ఏకకణ జీవి నుండి మనిషి జన్మ వరకూ వికాసం, ఆత్మ 84 లక్షల యోనుల నుండి ప్రవేశిస్తూ జరిగిందంటారు. మనిషిగా వికాసం చెందడానికి అంత ప్రయాణం చేయవలసి ఉంటుందట.
మనిషి జన్మ వచ్చే వరకూ ఈ వికాస-ప్రయాణం అప్రయత్నంగానే తనంతతానుగానే, సహజంగానే జరుగుతూ ఉంటుందట. మనిషి జన్మ వచ్చే సరికి మనోబుద్ధ్యహంకారచిత్తాలు చక్కటి వికాసం చెంది ఉంటాయి, మిగిలిన జీవరాసుల సూక్ష్మ శరీరాలు అంతగా వికాసం చెంది ఉండవు.
అయితే మనిషి జన్మ అనేది ఉత్కృష్ట జన్మే అయినప్పటికీ, మనిషి జన్మ తరువాత కూడా ఊర్ధ్వదిశగా జరగడానికి ఇంకా ఎంతో ప్రయాణం ఉంది, ఎంతో వికాసం ఉంది. వీటినే మనం ఉన్నత లోకాలంటాం. అయితే ఈ ఉన్నత లోకాలకు మనిషి వికాసం చెందడం అనేది ప్రకృతి మనిషి ఇచ్ఛకు వదిలిపెట్టేసింది. మనిషికి ఇష్టమైతేనే ఉన్నత లోకాల యాత్ర జరుగుతుంది, లేకపోతే జరగదు. ఆ ఎంపిక చేసుకునే అవకాశం భగవంతుడు లేక ప్రకృతి మనిషికి ప్రసాదించడం జరిగింది.
వికాసం అనేది, ఎదుగుదల అనేది ప్రకృతి ధర్మం. ఏ జీవీ కూడా ఈ నియమానికి విరుద్ధంగా ఉండలేదు. ప్రకృతి ధర్మం ప్రకారం ఈ ఎదుగుదల జరుగుతూనే ఉంటుంది. ప్రకృతి నిర్ణయించిన గతిలో కొనసాగుతూ ఉంటుంది. కానీ మనిషి జన్మలో మాత్రమే ఆ గతిని వేగవంతం చేయగలిగే అవకాశం ఉందట. అందుకే మానవ జన్మ వికాసానికి, ఒక అద్భుత అవకాశం అంటారు. మనిషికి ఉన్న సంకల్పశక్తి ద్వారా ప్రయత్నపూర్వకంగా ఈ వికాసం యొక్క గతిని తీవ్రతరం చేసుకోవచ్చు. అదే ఆధ్యాత్మికత యొక్క ప్రయత్నం. ఆధ్యాత్మిక పద్ధతులను అనుసరిస్తే, మనిషి వికాసం వేగవంతమయ్యే అవకాశం ఉంది.
ఆ విధంగా మనిషి ఎదుగుతున్న కొద్దీ తన హృదయంలో తన యదార్థ లక్ష్యం యేమిటో ప్రస్ఫుటంగా తెలుసుకోగలగడం, దాని కోసం తీవ్రంగా తపించడం, చివరికి దాన్ని చేరుకోగలగడం, జరిగే అవకాశం ఈ జన్మలోనే ఉందని సహజమార్గ ప్రధాన బోధన.
మన ప్రార్థన ప్రకారం, మానవ జీవిత యదార్థ లక్ష్యం మాస్టర్. అంటే ఆ పరతత్త్వం, పరమాత్మ. మాస్టర్లకందరికీ మాస్టర్. పరిపూర్ణత్వానికి ప్రతిరూపం మాస్టర్. అది అంతరంగ వికాసం ద్వారా మాత్రమే సాధ్యం.
అందరికీ దీనిని చేర్చే ప్రయత్నం చేద్దాం !!
రిప్లయితొలగించండి