20, జూన్ 2024, గురువారం

ధ్యానంలో కలిగే స్థితులు - 2

 


ధ్యానంలో కలిగే స్థితులు - 2 

ఇంతకు ముందు చెప్పినవన్నీ మనసులో ఉంచుకొని ధ్యానాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. దాజీ చెప్పిన విధంగా ధ్యానం తరువాత కలిగిన స్థితులు ప్రధానంగా గుర్తించే ప్రయత్నం చెయ్యాలి. ఆ స్థితికి ఫలానా స్థితి అని పేరు పెట్టలేకపోయినా, మాటల్లో వర్ణించలేకపోయినా హృదయం స్పష్టంగా  గుర్తిస్తుంది; దాన్ని మనసులో ఉంచుకోవాలి. అయినా సరే ఆ స్థితులను మాటల్లో పెట్టే ప్రయత్నం చేయాలి; డైరీలో వ్రాసుకోవాలి. 
సాధారణంగా ధ్యానం తరువాత ఎలా ఉందని ప్రశిక్షకుడు అడిగినప్పుడు, 'బాగుంది' అంటారు అభ్యాసులు. బాగుంది అని మొదట్లో అన్నప్పటికీ కూడా కొంచెం-కొంచెంగానైనా మాటల్లో పెట్టే ప్రయత్నం చేయాలి. 
ధ్యానం పూర్తయిన తరువాత కలిగే ధ్యాన స్థితులను నిజానికి సరిగ్గా మాటల్లో పెట్టలేకపోయినా ఈ విధంగా వర్ణిస్తూ ఉంటాం: ప్రశాంతంగా ఉంది; తేలికగా ఉంది; బరువు తగ్గినట్లుంది; నిశ్చలంగా ఉంది; ఆలోచనారహితంగా ఉంది; ప్రేమానుభూతి కలిగింది; సమర్పణ భావం కలిగింది; శూన్యత అనుభూతి కలిగింది; శరీరం లేనట్లనిపించింది; శరీరం విపరీతంగా విస్తరించినట్లనిపించింది; మత్తుగా అనిపించింది; నిద్రలోకి వెళ్ళినట్లుగా అనిపించింది; ఫలానా రంగు కనిపించింది; మునిగిపోయినట్లుంది; నిమగ్నమైనట్లనిపించింది; నన్ను నేను కోల్పోయినట్లనిపించింది; ఎక్కడున్నానో తెలియలేదు; ఇలా కొన్ని సకారాత్మక వర్ణనలుంటాయి . అలాగే ధ్యానం చేస్తున్న సమయంలో నకారాత్మకంగా అనిపించే సందర్భాలు రావచ్చు.  కొన్ని స్థితులు ఇలా ఉంటాయి: బరువుగా ఉంది; అలజడిగా ఉంది; ఆలోచనలు విపరీతంగా వచ్చాయి; గందరగోళంగా ఉంది; భయం వేసింది; అశాంతిగా ఉంది; తలబరువుగా అనిపించింది; నకారాత్మకమైన ఆలోచనలు వచ్చాయి; లైంగిక భావాలు కలిగాయి; పాత జ్ఞాపకాలు వచ్చాయి; ఇలా కొన్నితిని వర్ణించవచ్చు. 
కానీ, ప్రతీ ధ్యానం తరువాత మనశ్శాంతి, తేలికదనం వంటి సకారాత్మక స్థితులు తప్పక కలుగుతాయి. ఇంద్రధనస్సులో ప్రధానంగా ఏడు రంగులే కనిపించినా, ఈ చివరి నుండి ఆ చివరి వరకూ  జాగ్రత్తగా పరిశీలిస్తే, మనకు ప్రక్క-ప్రక్కనే ఉన్న రంగుల వివిధ పాళ్ళల్లో కలవడంతో అనేక వర్ణాలు కనిపిస్తాయి. ఒకే రంగు అయినా వివిధ ఛాయాల్లో కనిపిస్తుంది. ఒక రంగు తేలికగా, ఆ ప్రక్కడే గాఢంగా, ఆ ప్రక్కడి మరింత గాఢంగా ఇలా గాఢత్వంలో తేడాలు కనిపిస్తాయి. అలాగే ధ్యానం తరువాత కలిగే స్థితుల్లో కూడా, ఉదాహరణకు లీనమైపోయినట్లనిపించిందనుకోండి; ఒకసారి దీని తీక్ష్ణత మామూలుగాను, కొన్ని సార్లు అదే స్థితి మరింత గాఢంగా మరింతగా లీనమైపోయినట్లుగానూ అనిపిస్తుంది. ఇలా ప్రతీ అంతరంగ స్థితికి వర్తిస్తుంది. 
ఈ అంతరంగ స్థితి మరింత సూక్ష్మంగా రోజు-రోజుకీ మారుతున్నప్పుడు మనసు క్రమక్రమంగా క్రమబద్ధం అవడం, ఆలోచనలు తగ్గడం, స్పష్టంగా ఆలోచించడం, వంటి మార్పులు సంభవిస్తాయి. ఫలితంగా మన ఆలోచనల్లో, అలవాట్లలో, ప్రవర్తనలో మార్పులు రావడం వల్ల శీలంలోనే పరివర్తన కలుగుతుంది; తత్ఫలితంగా మన ప్రారబ్ధంలోనే  మార్పులు కలిగే అవకాశం ఉంది. 
ఈ విధంగా మన సూక్ష్మ శరీరాల శుద్ధి జరిగి, పరిణతి జరుగుతుంది; దీన్నే ఆత్మవికాసం అంటారు. ఈ ఆత్మవికాసానికి అంతు అంటూ ఉండదు. స్థూలం నుండి సూక్ష్మం; సూక్ష్మం నుండి సూక్ష్మాతి సూక్ష్మం ఇలా మన యాత్ర కొనసాగుతూ ఉంటుంది. మన చైతన్య వికాసం జరుగుతూ ఉంటుంది. మనుషులు మరింత మరింత మెరుగైన వ్యక్తులుగా మారే అవకాశం ఉంది ఈ సాధన వల్ల. 

1 కామెంట్‌:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...