ధ్యానంలో కలిగే స్థితులు - 4
కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కన్నా కళ్ళు మూసుకుని ఉన్నప్పుడే ఎక్కువ ఆలోచనలు వాస్తు ఉన్నట్లుగా అనిపిస్తాయి. నిజానికి కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా చాలా ఆలోచనలు వస్తూంటాయి; కానీ మన దృష్టి వాటిపై లేకపోవడం వల్ల అవి తక్కువగా ఉన్నట్లనిపిస్తాయి. కానీ కళ్ళు మూసుకున్నప్పుడు మన దృష్టి వేరే దేబి మీద లేకపోవడం వల్ల, ఆలోచనలపైనే ఉండటం వల్ల, ఎక్కువగా ఉన్నట్లనిపిస్తుంది.
ఈ ఆలోచనలు మన ధ్యానాన్ని భంగపరుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ దాజీ ఇచ్చిన గొప్ప అవగాహన మనం గుర్తుంచుకోవాలి - ముక్కు వాసన చూడటానికి, కళ్ళు చూడటానికి, చెవులు వినడానికి, ఇలా ప్రతీ అవయవానికి నిర్ధారితమైన పనిని స్వతఃసిద్ధంగా ప్రకృతిచే ఎలాగైతే కేటాయించబడ్డదో, అలాగే మనసుకు ఆలోచించడం అనే పని కేటాయించబడ్డది. ముక్కు పని వాసన చూడటం; అలాగే మనసు పనే ఆలోచించడం. కాబట్టి మనసు యొక్క స్వభావమే, అంటే ప్రకృతే ఆలోచించడం. సహజ మార్గ ధ్యానంలో మనం ఆలోచనలని లేక మనసును నియంత్రించే ప్రయత్నం చెయ్యం; మనసును క్రమబద్ధం చేసే ప్రయత్నంలో ఉంటాం; అందుకే ధ్యానంలో ఆలోచనలు వచ్చినప్పుడు వాటితో పోఱయడటం గాని, ఆలోచనలను ఆపే ప్రయత్నం గాని చేయవద్దని చెప్పడం జరుగుతుంది. కేవలం వాటిపై దృష్టి పెట్టకుండా ఉండే శిక్షణనివ్వడం జరుగుతుంది. ఆలోచనలకు స్వతహాగా యే శక్తీ ఉండదు. మనం దృష్టిని పెట్టడం వల్లనే ఆలోచనలకు బలం వస్తుంది. కాబట్టి మన దృష్టి పెట్టనప్పుడు వాటంతటవే నిర్వీర్యమైపోయి రాలిపోతాయి. ఇది అనుభవపూర్వకంగా ఎవరైనా తెలుసుకోవచ్చు. ఇలా రాలిపోయినప్పుడు మనకు చక్కటి ప్రశాంతత అనుభూతి చెండుతాం; బరువు తగ్గినట్లు అనుభూతి చెండుతాం.
కాబట్టి, ఈ అవగాహన సాధకులకు ధ్యానించడంలో ఉపయోగపడగలదు. ఎందుకంటే మనం ధ్యానిస్తున్నది ఆలోచనలు పూర్తిగా పోగొట్టఊకోడానికి కాదు, అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆలోచనలు పూర్తిగా పోయేది కేవలం మృత్యు సమయంలోనే అంటారు బాబూజీ. ఇంచుమించు ఆలోచనారహితమైన స్థితిని సాధించవచ్చు గాని అస్సలు ఆలోచనల్లేని స్థితి ఉండదు. పైగా ఒక్కసారి ఊహించండి! ధ్యానం తరువాత ఒక్క ఆలోచన కూడా లేదనుకోండి. అంటే మనసే లేదనుకోండి భూమ్మీద మనుగడ ఎలా సాధ్యం? ఆలోచన లేకుండా ఎ పనైనా చేయగలమా? ధ్యానం చేయాలన్నది కూడా ఒక ఆలోచనే కదా? కాబట్టి ఆలోచనకు ఒక నిర్దుష్టమైన ప్రయోజనం ఉందని, అది భూమ్మీద ఉన్నంత వరకూ అవసరమని మనం మనసులో ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి