ధ్యానం లో కలిగే స్థితులు - 3
భగవంతుడు మనిషిని సృష్టించాడు, మనిషి మతాలను సృష్టించాడు.
- బాబూజీ
మనందరమూ యేదొక మతంలో జన్మిస్తాం. పుట్టుకతో నిజానికి ఎవరికీ మతం ఉండదు, కులం ఉండదు, భాష ఉండదు, జాతి ఉండదు. ఆ శిశువు కేవలం భగవంతుని సృష్టి మాత్రమే. జన్మించిన మరుక్షణమే రంగు, లింగబేధంతో మొదలై, పైన అనుకున్నవన్నీ ఆ శిశువుకు మానవులు ఆపాదించేస్తూ ఉంటారు. బహుశా తప్పదేమో. ఎందుకో గాని కేవలం మానవుడికి పుట్టిన మానవుడిగా పరిగణించడం, సాక్షాత్తూ భగవంతుని సృష్టిగా భావించడం మనందరికీ ఎందుకో చాలా కష్టం. ఆ తరువాత పర్యవసానాలు జీవితం అంతా అనుభవిస్తూ ఉంటాం. ఇవన్నీ మానవుడు సృష్టించుకున్నవే. అందుకే మనిషి తాను చేసుకున్న సృష్టిని నాశనం చేసుకుంటే, కేవలం భగవంతుని సృష్టి మిగులుతుందని బాబూజీ చెబుతూండేవారు. దీన్నే ఆధ్యాత్మిక భాషలో వ్యక్తిగత ప్రళయం అని కూడా అంటారు. వ్యక్తిగత ప్రళయం ద్వారా భగవంతుని సృష్టి ప్రస్ఫుటంగా వెల్లడవుతుంది.
కాబట్టి యే ఆధ్యాత్మిక పద్ధతిని అనుసరించినా మన కదలిక ఈ వ్యక్తిగత ప్రళయం వైపుగా కొనసాగాలి; అప్పుడే భగవంతుడు మనలను సృష్టించిన విధంగా మనలను మనం పునరుద్ధరించుకోగలుగుతాం. అటువంటి ఆధ్యాత్మిక పద్ధతే మన హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ పద్ధతి. ఇక్కడ బాబూజీ చెప్పిన వాక్యాలను లోతుగా పరిశీలించాలి. మతం దాటితే ఆధ్యాత్మికం మొదలవుతుందంటారు బాబూజీ - అంటే మతం భగవంతుడి అస్తిత్వాన్ని గురించి ఒక అస్పష్టమైన అవగాహన ఇస్తుంది, కానీ అనుభూతి ఉండదు, నమ్మకాలు తప్ప; ఆధ్యాత్మికత, అనుభూతిని ప్రసాదిస్తుంది. భగవంతుని అంతర్యామిగా అనుభూతి చెందమంటుంది; అక్కడితో ఆగరు బాబూజీ. ఆధ్యాత్మికత దాటితే అసలు తత్త్వం బోధపడుతుందంటారు; అంటే ఒక దశలో అనుభవాలు కూడా ఆగిపోతాయన్నమాట; పూజ్య దాజీ ఒక దశలో అనుభూతులంటే కూడా విసిగిపోవాలని చెప్తారు; వాటిని దాటి ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలంటారు. ఇంకా అవలేదు. ఈ సత్యానుభూతిని కూడా దాటడానికి ప్రయత్నించాలని చెప్తారు బాబూజీ. సత్యాన్ని దాటడం ఏమిటని, మన అల్ప మానవ బుద్ధికి అంతు చిక్కదు. సాధన ద్వారా, మనసు లక్షణమే మారిపోయిన తరువాత, అలా అతి సూక్ష్మంగా తయారైన మనసు ఒక సాక్షిగా మిగిలి, జరుగుతున్న యాత్రను వీక్షిస్తున్నప్పుడు తెలుస్తుందట. అలా సత్యతత్త్వాన్ని కూడా దాటితే కలిగే అలౌకిక ఆత్మానుభూతిని పరమానంద స్థితి, ఆంగ్లంలో Bliss అని అంటారు. ఇదే చిట్టచివరి గమ్యంగా భావిస్తావేమో మనం అని చెప్పి, ఈ పరమానంద స్థితిని కూడా దాటితేనే అసలు ప్రయాణం అంటారు, బాబూజీ. ఈ స్థితిని దాటితే మనం గమ్యాన్ని చేరుకున్నట్లే అంటారు, బాబూజీ. ఇక యాత్ర మన ప్రమేయం లేకుండా తనంతతానుగా అనంతంగా దేశ-కాలాలకు అతీతంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇదీ అనంతం వైపు ప్రయాణం అంటే. ఇలా ముందుకు సాగుతున్న కొద్దీ మనిషి ఆత్మలో కలిగే పరివర్తననే చైతన్య వికాసం అని, ఆత్మ వికాసం అని, పరిణామ యాత్ర అని చెప్పుకుంటూ ఉంటాం. మరింత మరింత మెరుగైన వ్యక్తిగా తయారవడం, ఆత్మశుద్ధి జరగడం, స్వయంగా మనకు మనమే గమనించుకోవచ్చు, బాబూజీ అనుగ్రహం వల్ల.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి