పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం - ప్రథమ దర్శనం
గురువుతో మొట్టమొదటి కలయిక చాలా అద్భుతమైనది అందరికీ. ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోయేది. ప్రతి సాధకుడికి ఇటువంటి అద్భుత మధుర క్షణం వస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ఒక్కొక్కరికీ ఒక్కొక్క ప్రత్యేక అనుభూతి కలుగవచ్చు. ఉదాహరణకు స్వామి వివేకానంద మొట్టమొదట సారి శ్రీరామకృష్ణుల వారిని కలవడం; బాబూజీ మహారాజ్ తన గురుదేవులైన లాలాజీ మహారాజ్ ను మొట్టమొదటిసారి దర్శించడం; పూజ్య చారీజీ బాబూజీతో మొదటి కలయికను ఎంత అద్భుతంగా వర్ణించారో మనం చదివ్యయం. అలాగే పూజ్య దాజీ కూడా వారి సరళమైన కానీ దివ్యమైన అనుభవాన్ని మనతో పంచుకోవడం కూడా చూశాం. ఆ మొట్టమొదటి కలయికలోనే చాలా వరకూ జరుగవలసిన ఆధ్యాత్మిక కార్యం బీజరూపంలో నిక్షిప్తం అయిపోతుందని, నా విశ్వాసం; రానున్న కాలంలో ఆ బీజమే మొలకెత్తి వృక్షమయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి సాధకుడికి గురువుతో కలయిక మళ్ళీ మళ్ళీ తలచుకునేంత నిగూఢ క్షణం; ఎంతో జ్ఞానం ఊరుతూ ఎ సమయానికి ఆ సమయం లక్ష్యం దిశగా అవసరమైన వివేకాన్ని అందించేటువంటి అద్భుత క్షణం.
పూజ్య చారీజీ 1964 లో ఆయన మొట్టమొదటి సారి బాబూజీతో కలయికను, మై మాస్టర్ గ్రంథంలోనూ, ఎన్నోసార్లు తన ప్రసంగాల్లోనూ ఉల్లేఖించడం చూశాం; ఎన్నో విషయాలు గ్రహించాం, గ్రహిస్తూనే ఉన్నాం.
పూజ్య గురుదేవుల ప్రథమ దర్శనం
నేనంతకు పూర్వం ఎందరో మహాత్ములను చూడటం జరిగింది. అందరి వద్ద స్ఫూర్తి-ప్రేరణాలు కలుగుతూనే ఉన్నాయి. కానీ యేదో వెలితి, యేదో వ్యక్తం చేయలేని లోటు. నాకు సహజ్ మార్గ్ సాధనను పరిచయం చేసిన ప్రశిక్షకులు, నన్ను సాధ్యమైనంత త్వరగా పూజ్య చారీజీని కలవమని సలహా ఇచ్చారు గాని నా మనసుకు పెద్దగా ఎక్కలేదు. అయితే నేను మార్చ్ 1990 లో ప్రారంభించాను, ఏప్రిల్ 30 న జైపూర్ లో బాబూజీ భండారా. అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్యాలస్ లోకి, పూజ్య చారీజీ వస్తున్నారని తెలిసి అందరూ నిరీక్షిస్తున్నారు; నేను కూడా వేచి ఉన్నాను; ఎటువంటి అపేక్ష లేకుండా; మరో మహాత్ముడిని చూస్తున్న ఆరాటం తప్ప యేమీ లేదు. ఒక కుర్చీ వేసి ఉంచారు అక్కడ ఆయన కోసం. అందరమూ క్రింద కూర్చొని ఉన్నాం. తక్కువ మందే ఉన్నారు.
కాస్సేపటికి ఆ మహానుభావుడు రానే వచ్చాడు. అదే మీదటి సారి చూడటం; వినడం. 6 అడుగులు, దివ్య తేజస్సు; ఆజానుబాహుడు; మనిషి మొత్తం ప్రకాశిస్తున్నారు; పైన చిత్రంలో ఉన్నట్లుగా చూశాను కానీ గడ్డం అవీ లేవు; కళ్ళల్లో ఒకరకమైన కొంటెతనం; మేధను సూచిస్తూ విశాలమైన నుదురు; మొత్తంగా దివ్యమంగళ విగ్రహం అన్నట్లుగా చూపు తిప్పుకోలేని మహాపురుషుని దర్శనం. ఇక మనసులోకి తొంగి చూసుకుంటే, అపరిమితమైన అలౌకిక ఆనందం; లక్ష ప్రశ్నలకు ఒకేసారి సమాధానం వచ్చినట్లు; పిచ్చ నిశ్శబ్దం; శాశ్వత ముద్ర కానీ ముద్ర పడిపోయింది. యేదో సాధించేసిన తెలియని గర్వం; మా మధ్య యేమీ సంభాషణ జరగలేదు. అసలు ఆ అవసరం రాలేదు. ఆంగ్లంలో యూరేకా మూమెంట్ అంటారు. ఇక నేను చేరవలసిన చోటుకు క్షేమంగా చేరుకున్నాను; ఇక గురువు అన్వేషణ అవసరం లేదు అన్న గొప్ప ఆత్మ విశ్వాసం కలిగింది.
ఆ తరువాత నా తపన చాలా వరకూ చల్లారింది; కానీ ఒక కొత్త తపన ప్రారంభమయ్యింది. వారిలో అణుమాత్రంగానైనా తయారయ్యే ప్రయత్నం చెయ్యాలి అన్న తపన. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. వారి జీవిత కాలంలో పూర్తికానీ నా ఈ ఆధ్యాత్మిక యాత్రను ఎంతో అనుగ్రహంతో వారి వారసులైన పూజ్యశ్రీ దాజీ గారికి అప్పగించడం జరిగింది. పూజ్య గురుదేవులైన దాజీ మార్గదర్శనంలో నా యాత్ర ఇలా కొనసాగుతూ ఉంది.
ఇంకా ఉంది ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి