24, జులై 2025, గురువారం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం -మహోన్నత వ్యక్తిత్వం


పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం - మహోన్నత వ్యక్తిత్వం
 
పూజ్య గురుదేవులను చూస్తే మహోన్నత వ్యక్తిత్వం అంటే ఇదేనేమోననిపించింది. ఆయన భౌతిక సన్నిధిని నిరంతరం  కోరుకునేవాళ్ళు అభయాసులందరూ. వారి కాటేజ్ దగ్గరే వారి భౌతిక దర్శనం కోసం  పరితపిస్తూ ఉండేవారు అభ్యాసీలు. అంతటి దివ్యమంగళ విగ్రహం వారిది. దైవత్వం అణువణువునా ఉట్టిపడుతూ ఉండేది. ముఖంలో అనంతమైన ప్రశాంతత; దివ్య తేజస్సు; ఆరడుగుల ప్రకాశించే విగ్రహం; ఆజానుబాహుడు; వారి అందం వయసు గడుస్తున్నా కొద్దీ పెరుగుతూ ఉండేది. 

 అద్భుతమైన కంఠస్వరం; మొట్టమొదటిసారి వారి కంఠస్వరం విన్న తరువాత, నా చిన్నప్పటి నుండి విపరీతంగా వినాలనుకున్న స్వామి వివేకానంద కంఠస్వరం బహుశా ఇలాగే ఉండేదేమోననిపించింది. ఆ క్షణం నుండి ఆ కోరిక నా మనసులో నుండి దానంతట అదే తొలగిపోయింది. 

ఇక వారి ఆంగ్ల భాషపై పట్టు, అమోఘం; అద్భుతమైన అభివ్యక్తీకరణ; సరళమైన భాషా ప్రయోగం; అతి నిగూఢ విషయాలు చిన్నపిల్లవాడికి కూడా అర్థమయ్యేలా చెప్పగలిగే పటిమ; పండితులకు, పామరులకూ సమానంగా అర్థమయ్యే విధంగా ఉండేవి వారి ప్రసంగాలు; చక్కని చమత్కారాలు, చమక్కులు; సందేశంతో కూడిన సున్నిత హాస్యం; వీటన్నిటికీ తోడు గంభీరమైన శ్రావ్యమైన కంఠస్వరం; చక్కని సంగీత జ్ఞానం; వేణుగానం చేసేవారు; ఆధ్యాత్మికతలోకి రాకపోయినట్లయితే వేణుగాన విద్వాంసుడనయ్యేవాడినని అంటూండేవారు; ఆ తరువాత పైన చిత్రంలో ఉన్నట్లుగా, ఈలపాటలతో అభ్యాసుల మనసులు రంజింప జేయడంతోపాటుగా వారిపై ఆధ్యాత్మికంగా పని చేసేవారు; చిన్నప్పటి నుండి విపరీతంగా పుస్తకాలు చదివేవారట. కంటి దృష్టి చిన్నప్పటి నుండి బలహీనంగా ఉండటంతో ఆడుకోగలిగేవారు కాదట; ఆ సమయాన్ని కూడా పుస్తకాలు చదవడానికి వినియోగించేవారట. అన్ని పుస్తకాలు చదివి అభ్యాసులకు వాటిని పిండినప్పుడు వచ్చిన రసాన్ని పంచేవారు. 

వారి సంభాషణా చాతుర్యం, పటిమ అద్భుతం; చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళ స్థాయిలో మమేకమై, పెద్దవాళ్ళతో సంభాషించినప్పుడు వాళ్ళ స్థాయిలో, యువతతో మాట్లాడినప్పుడు వాళ్ళ స్థాయిలో, శాస్త్రజ్ఞులతో మాట్లాడినప్పుడు వాళ్ళతో శృతిలో ఉంటూ ఒక గొప్ప శాస్త్రజ్ఞుడిలా  మాట్లాడుతూండేవారు. 

అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండేది వారికి; కొన్ని వేల మంది అభ్యాసుల పేర్లు గుర్తుంచుకోవడమే గాక వాళ్ళు చేసే పని ఎక్కడుంటారు వంటి వివరాలు కూడా వారికి జ్ఞాపకం ఉండేవి. అదెలా సాధ్యం అని అడిగితే, అది అసాధారణ శక్తి కాదు, కేవలం సంస్థ పట్ల నాకున్న ఆసక్తి వల్ల వచ్చిందనేవారు. ఇక వారి నిర్వహయణా సామర్థ్యాలు, తన గురుదేవుల సందేశాన్ని ప్రపంచం అంతటా వ్యాపింప జేయడంలో వారి సమర్థత, సుమారు 100 కు పైగా దేశాలలో వ్యాపింపజేశారు. 

ఇది గాక ఆయన జీవితకాలంలో సహజ మార్గ సాంప్రదాయంలో నాకు తెలిసి బహుశా 3000 కు పైగా వివాహాలు వారి చేతులు మీదుగా చేసి ఆశీర్వదించారు. ఈ వివాహాలు ఎటువంటి ఆర్భాటమూ లేకుండా, కుల మత భాష జాతీయ బేధాల్లేకుండా వివాహాలు చేశారు. ఇది ప్రపంచానికి వారు చేసిన గొప్ప సేవ. బహుశా ప్రపంచ చరిత్రలో ఇంతవరకూ ఇన్ని వివాహాలు చేసి ఉండరని నా నమ్మకం. అన్ని జంటలూ సంతోషంగా వారి ఆశీస్సులతో పిల్లా, పాపలతో సుఖంగా జీవితం గడుపుతున్నారు. 

1 కామెంట్‌:

  1. ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం గురించి నేటి (24/07/2025) భండారాలో ఇంకా ఎంతో తెలుసుకోవాలని ఆశించి కుతూహలం గా ఎదురు చూసాము (వర్చువల్గా)(ఇంటినుండి)

    కానీ 5.30 pm సత్సంగం 6.10 ని. లకే
    అర్ధాతరంగా ముగింపు సందేశం తెలియకుండా టీవీ స్క్రీన్ మాయమైంది
    ఎందువల్లో బోధపడలేదు
    దాజీ గారు ఛార్జీజీ గురించి ఏం మాట్లాడారో తెలియలేదు.
    వివరించగలరు

    రిప్లయితొలగించండి

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం - కొన్ని పలుకులు

  పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం - కొన్ని పలుకులు  పూజ్య గురుదేవులు చారీజీ నాకు వ్రాసిన లేఖల్లో నాలో ఏమాత్రం పరివర్తన...