గురుపూర్ణిమ
ఈ సంవత్సరం జూలై 10, 2025 తేదీన గురుపూర్ణిమ అయ్యింది. ప్రతీ సంవత్సరమూ ఆషాఢ పూర్ణిమ నాడు, వేదవ్యాస మహర్షి జన్మదిన సందర్భంగా ఈ రోజును గురుపూర్ణిమగా భారతీయ సాంప్రదాయంలో అనాదిగా జరుపుకుంటూ వస్తున్నారు. వేదవాజ్ఞ్మయాన్ని అంతటినీ క్రోడీకరించి, ఒక్కచోటుకు జేర్చిన మహాత్ముడు, మహర్షి వ్యాసమహర్షి. వీరి జన్మదినాన అన్ని సాంప్రదాయాలకు సంబంధించినవారు, శిష్యులందరూ కూడా వ్యాసమహర్షిని స్మరించుకుంటూ తమతమ గురుపరంపరను తమ గురుదేవులను పూజించుకోవడం ద్వారా ఇది జరుగుతూ ఉంది.
ఈ రోజున వివిధ సాంప్రదాయాలకు సంబంధించినవారు, వారి-వారి సంప్రదాయాలకనుగుణంగా వివిధ రకాలుగా ఈ పవిత్ర దినాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున గురువుతో భౌతికంగా కూడి ఉండగలిగినప్పుడు సాధకుడి ఆధ్యాత్మిక పురోగతి ఎన్నో ఇంతలు త్వరితంగా గురువు అనుగ్రహం చేత జరిగే అవకాశం ఉందని చెప్తారు.
హార్ట్ఫుల్నెస్, శ్రీరామచంద్ర మిషన్ సంప్రదాయంలో గురుపూర్ణిమ
కాని ఈ సంస్థలో అది సాధకుడు లేక అభ్యాసి అంతరంగ తయారీని బట్టి, ఆతని అంతరంగ స్థితిని బట్టి, అతని తపనను బట్టి ఆధారపడుంటుందని చెప్తారు మన గురువులు.
ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహానుపూరుకు చెందిన శ్రీరామచంద్రజీ, ఆప్యాయంగా పిలుచుకొనే బాబూజీ స్థాపించిన శ్రీరామచంద్ర మిషన్ లో, ఈ సంప్రదాయంలోని గురుపరంపర యొక్క గురువులు, గురుపూర్ణిమ ప్రతీ సంవత్సరం ఒక ఆచారంలా ఒక క్రతువులా చెయ్యద్దంటారు. ఈ సంప్రదాయం వాటన్నిటికీ అతీతంగా చాలా దూరంగా ప్రయాణించిన సంస్థ అంటారు. యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా మనం ఆ రోజున గురువుతో కూడి ఉన్నట్లయితే అది వేరే విషయం, కాని ఆ రోజున ప్రత్యేకంగా గురువుతో ఉండాలని ప్రణాళిక అవసరం లేదంటారు. దానికి బదులుగా ఆ రోజున, అభ్యాసి లేక సాధకుడు ఎక్కడున్నా తన గురుదేవుల స్మరణలో ఎంతగా లీనమైపోయి ఉండటానికి ప్రయత్నించాలంటే ఆ స్మరణలో సాధకుడు ఆహుతి అయిపోవాలంటారు. "Consume yourself in His remembrance" అంటారు.
స్మరణ అంటే మళ్ళీ కేవలం జ్ఞాపకాలు కావు. ఆ జ్ఞాపకాలు ఎలా ఉండాలంటే మనం స్మరిస్తున్న వ్యక్తి లేక గురువు సాక్షాత్తు మనతో ఆయన ఉనికి ఉన్నట్లుగా అనుభూతి చెందగలగాలి. వారి ఉనికిని అనుభూతి చెందుతూ, వారు గడిపిన జీవన విధానాన్ని, వారు సాధన చేసిన విధానాన్ని, వారి క్రమశిక్షణ, వారి వ్యక్తిత్వం, వారి ఆధ్యాత్మిక సాన్నిధ్యాన్ని... వీటన్నిటినీ స్మరిస్తూ వారి ఉనికిని నిజంగా అనుభూతి చెందే ప్రయత్నంలో ఉంటూ మన జీవితం ఎంత వరకూ దీనికి దగ్గరగా ఉంది అని ఆత్మావలోకనం జరిగినప్పుడు కనీసం మనం చేసుకోవలసిన సవరణలు ఏమిటో అయినా మనకు తెలిసే అవకాశం ఉంటుంది.
కావున ఈ పరమపవిత్ర దినాన అభ్యాసులుగా మనందరమూ గురువుల అభీష్తాన్ని అనుసరించి తమ గురుదేవుల దివ్యస్మరణలో తమను తాము ఆహుతి చేసుకోగలరని ప్రార్థిస్తూ....
గురుపూర్ణిమ - గురుదేవుల దివ్య స్మరణలో మనలను మనం ఆహుతి చేసుకోవడమే గురు పూర్ణిమనాడు సాధకుడు చెయ్యవలసినది.
~గురుపూర్ణిమ ~
రిప్లయితొలగించండిజ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు పౌర్ణమి రోజున పూర్వాషాఢ, లేదా ఉత్తరాషాఢ నక్షత్రాలకు దగ్గరగా ఉండుట చేత ఆ మాసమునకు ఆషాఢమాసమని, ఆ రోజు వచ్చిన పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమని శాస్త్రాల్లో చెప్పబడింది.
అలాంటి ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమిగా పిలుస్తారని శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ రోజు వేదవ్యాసుల వారు జన్మించుట చేత ఆషాఢ పౌర్ణమికి వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అనే పేరు వచ్చింది
భగవంతుడు మానవ శరీరంలో అవతరించినప్పుడు.. ఆ అవతరించిన శరీరాలలో గురువు ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఉదాహరణకు శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా అవతరించినప్పుడు వశిష్ఠుల వారిని గురువుగా స్వీకరించి యోగవశిష్ఠ్యం వంటివి ఈ లోకానికి తెలియజేశారు. శ్రీ కృష్ణుడు సాందీప మహర్షిని గురువుగా స్వీకరించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని లోకానికి అందజేశారు. ఇవన్నీ కూడా గురువు ప్రాధాన్యతను తెలియజేస్తాయి.
భూలోకంలో జన్మించిన మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ధ్యానమును, ధ్యానము ద్వారా కర్మఫల త్యాగమును ఈ మూడింటి ద్వారా మోక్షమును పొందాలని మన మహర్షులు, ఆధ్యాత్మిక సాధకులు, గురువులు తెలిపారు. ఇలా కలియుగంలో మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానం సులువుగా అర్థం కావడం కోసం వేదవ్యాసుల వారు వేదాలను విభజించి, అష్టాదశ పురాణాలను రచించి, మహాభారతం, భగవద్గీత వంటి విషయాలను ఈ లోకానికి అందించడం చేత ఆయన జన్మించిన ఆషాఢ పూర్ణిమను వ్యాస పూర్ణిమ లేదా గురు పౌర్ణమి అని చెప్పబడింది.
ఇంతటి విశిష్టత ఉన్న గురు పూర్ణిమ రోజు మనకి జ్ఞానాన్ని అందించిన మహర్షులు, రుషులు, వ్యాసుల వారిని స్మరించుకోవాలి.
మన సనాతన ధర్మంలో మూడు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అవి ఏమిటనగా.. అద్వైతం, ద్వైతం, మరియు విశిష్టాద్వైతం. ఈ మూడు సిద్ధాంతాలను శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు అందించారు.
వారి వారి సిద్ధాంతాలను అనుసరించి గురు పౌర్ణమి రోజు ఆ ఆచార్యులను పూజించాలి.
"కారుకారు గురువు క గుణింతము చెప్ప
శాస్త్రసారములు చదివి చెప్ప
ముక్తి దారి చూపు మూలంబు గురువురా..
విశ్వదాభిరామ వినురవేమ"
ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వారు వారి గురువులను, సన్యాసాశ్రమంలో ఉన్నవారు వారి గురువులను ఈ రోజు వారి పరంపరకు అనుగుణంగా గురుపూజ చేయాలి
గురుపూర్ణమినాడు నాడు గురువు పట్ల భక్తిని తెలియజేస్తాము, వారికి కృతజ్ఞతలు చెబుతాము. సనాతన ధర్మంలో గురువుకు భగవంతునితో సమానమైన హోదా ఉంది.
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండి