22, జులై 2025, మంగళవారం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం


పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం

ఈ నెల జూలై 24, 2025 న పూజ్య గురుదేవుల 99వ  జన్మదినోత్సవం. 98వ జయంతి. ఈ సందర్భాన వారి ప్రత్యేక స్మరణలో వారితో నా ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని గురించి, కొన్ని అక్షరాల ద్వారా క్లుప్తంగా పునర్జీవించాలన్న సంకల్పం కలిగింది. ప్రయత్నిస్తాను.   

ఆధ్యాత్మిక సత్యాన్వేషణలో ఉన్న మామూలు సాధకుడు, దేని కోసం వెతుకుతున్నాడో , దేని కోసం తపిస్తున్నాడో కూడా స్పష్టంగా అవగాహన లేకుండా వెతుకుతున్న రోజుల్లో, తటస్థమైన మహాత్ములందరి సాంగత్యంలో పాల్గొనే ప్రయత్నం చేసేవాడిని. గుడులు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, తటస్థమైన ధ్యాన పద్ధతులు, సైంటిస్టులను, నోబెల్ పురస్కార గ్రహీతలను వివిధ ఆధ్యాత్మిక సంస్థలను, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సందర్శిస్తూ ఉండేవాడిని; ఇదంతా ఊహందుకున్నప్పటి నుండి. అయినా యేదో తెలియని వెలితి; అందరి వద్ద మంచే నేర్చుకున్నాను; దేనికీ వంక పెట్టడానికి లేదు; అయినా యేదో తీరని ఆకలి; పైగా ఆకలి తీవ్రత పెరిగింది. మనసులో సమాధానాల్లేని అనేక ప్రశ్నలు; తీవ్ర అశాంతి; ఎవరికీ చెప్పుకునేది కాదు; ఇతరులకు ఇది పెద్ద సమస్య కాదు; నాకు చాలా పెద్ద సమస్యలా ఉండేది.  

మరో ప్రక్క చదువు, వగైరావన్నీ నిర్లిప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కువగా ఏకాంతంగా గడపటానికి ఇష్టపడేవాడిని. విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటయ్యింది. తపన మరింత తీవ్రం అయ్యేది. 

కొన్ని సంవత్సరాలకు, నన్ను యేదో తెలియని శక్తి నడిపిస్తున్నదన్న ప్రగాఢ అనుభూతి కొనసాగుతూ ఉండేది; ఎవరికైనా చెప్తే నమ్మరు, పైగా హేళన చేస్తారన్న భయం ఉండేది. గుప్తంగా ఆ అనుభూతి యొక్క సత్యం నాలోనే ఉంచుకున్నాను; నాకు మాత్రమే తెలుసు. 1986 లో శ్రీ రామ కృష్ణ మఠంలో, ఆ సంస్థ అధ్యక్షులయిన స్వామి గంభీరానందజీ వద్ద గురుదీక్ష తీసుకోవడం జరిగింది. మనసు కొంత ఊరడిల్లింది. 4 సంవత్సరాలకు వారు మహాసమాధి పొందడం జరిగింది. ఆ క్షణం నుండి మరలా నా మనసు అగాథంలో ఉన్నట్లుగా తీవ్ర వ్యధకు గురయ్యింది. దీని ప్రభావం ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఏమి చేయాలో తెలియక మండల కాలం స్వామి అయ్యప్ప దీక్ష తీసుకున్నాను. 80 కి.మీ. లు నడిచి మకరజ్యోతిని దర్శించాను. తనువు పులకరించింది. తిరిగి వచ్చిన తరువాత శ్రీరామ చంద్ర మిషన్ సభ్యులు ఒకాయన పరిచయం అయ్యాడు. కానీ ఆయనతో నేను బాగా వాదించేవాడిని. ఆయన కూడా అలాగే ఉండేవాడు. కానీ సాంగత్యం నచ్చింది. కానీ ఈ సంస్థలో చేరాలన్న ఆలోచన యే కోశాన లేదు.

తదుపరి వ్యాసం గురుదేవుల ప్రథమ దర్శనం ...  

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

చారీజీ 98 వ జయంతి సందర్భంగా దాజీ సందేశం

దాజీజూలై భండారా సందేశం చారీజీ 98 వ జయంతి సందర్భంగా దాజీ సందేశం