అష్టావక్ర గీత చిరు పరిచయం
ఇంచుమించుగా గీతలు సుమారు 100 రకాల గీతలున్నాయి. అందులో భగవద్గీత అన్నిటి కంటే ప్రాచుర్యంలో ఉన్నది. భగవద్గీత, శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినది. అర్జునుడు కర్తవ్య బోధ తెలియక అజ్ఞానంలో గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు శ్రీ కృష్ణ భగవానుడే స్వయంగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని 18 అధ్యాయాల్లో అనేక విషయాలను మానవాళికి తెలియజేయడం జరిగింది.
అష్టావక్ర గీతలో అష్టావక్రుడు జనక మహారాజుకు బోధించినదే అష్టావక్ర గీత. దీనినే అష్టావక్ర సంహిత అని కూడా అంటారు. ఇక్కడ జనక మహారాజు జ్ఞాని, అన్నీ తెలిసిన రాజర్షి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఇచ్చిన బోధ ఈ గీత. వేదాంతంలో అతి ఉత్కృష్ట కోవకు చెందిన గ్రంథం. అష్టావక్రుడు సూటిగా, పరమసత్యాన్ని యే విధంగా తెలుసుకోవాలో సుస్పష్టంగా కుండ బడ్డలుకొట్టినట్లు చెప్పడం జరిగింది.
అర్జునుడికి కలిగిన ప్రశ్నలు మనిషిలో కలిగినప్పుడే భగవద్గీత అర్థమవుతుంది. ఆ ప్రశ్నలు యేదొక దశలో ప్రతీ మనిషికీ కలుగుతాయి. అలాగే జనక మహారాజుకు కలిగిన ఉత్కృష్టమైన ప్రశ్నలు మనలను వేధించినప్పుడే అష్టావక్ర గీత బోధపడుతుంది.
అష్టావక్రుడు ఇంచుమించు ప్రతీ శ్లోకంలోనూ సత్యాన్వేషణకు పరిష్కారాన్ని స్పష్టంగా సూచిస్తారు. ఈ గీత నిధిధ్యాసనకు సంబంధించిన గ్రంథం అని కూడా చెప్తారు. అంటే కేవలం శ్రవణానికి, మననానికి మాత్రమే గాక నిధిధ్యాసనకు ఎక్కువగా సమయాన్ని వెచ్చిపజేసే గ్రంథం. ఇతర శాస్త్రాలన్నీ శ్రవణం ద్వారా, ఆ తరువాత మననం ద్వారా (ప్రశ్నించుకుని అర్థం కూలంకషంగా తెలుసుకున్న తరువాత) పూర్తయిన తరువాత మాత్రమే, కేవలం నిధిధ్యాసన ద్వారా సాక్షాత్కరించుకోగలిగే శాస్త్రం అని చెప్తారు.
ఉదాహరణకు మనం అష్టావక్ర గీతలోని ప్రారంభంలో ఉన్న రెండు శ్లోకాలను అధ్యయనం చేస్తేనే, మనం ఇప్పటి వరకూ అష్టావక్రుని గురించి మాట్లాడుకున్న వారి తత్త్వం అవగతమవుతుంది. పూజ్య దాజీ ఈ గ్రంథం నుండి తరచూ ఈ శ్లోకాలను ఉటంకిస్తూ ఉంటారు.
జనక ఉవాచ:
కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి |
వైరాగ్యం చ కథం ప్రాప్తమేతద్ బ్రూహి మమ ప్రభో ||1-1||
జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి? ముక్తిని సాధించడం ఎలా? వైరాగ్య స్థితిని చేరుకోవడం ఎలా? దయచేసి తెలపండి ప్రభు!
అష్టావక్ర ఉవాచ:
ముక్తిమిచ్ఛసి చేత్తాత్ విషయాన్ విషవత్త్వజ |
క్షమార్జవదయాతోష సత్యం పీయూషవద్ భజ ||1-2||
నీవు ముక్తిని సాధించాలనుకుంటే విషయాలను విష తుల్యంగా భావించు నాయనా! సహనం, చిత్తశుద్ధి, కరుణ, సంతుష్టి, సత్యసంధత, వీటిని అమృత తుల్యంగా భావిస్తూ సాధన చెయ్యి.
నిజమైన సత్యాన్వేషకులు, ఆధ్యాత్మిక సాధకులు, జిజ్ఞాసువులు, తగిన సమయం వచ్చినప్పుడు ఈ గ్రంథాన్ని తప్పక అధ్యయనం చెయ్యవలసినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి