30, జనవరి 2024, మంగళవారం

బాబూజీ ఛలోక్తులు

బాబూజీ ఛలోక్తులు 


బాబూజీ ఛలోక్తులు విసిరినప్పుడు, చుట్టూ ఉన్న వాళ్ళు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వేవారు. బాగా నవ్వీస్తూండేవారు. కానీ, తన ఛలోక్తుల్లో కూడా సందేశం ఇమిడి ఉంటుందనేవారు. కేవలం కాలక్షేపం కోసం చేసే హాస్యం కాదది. బాబూజీ మాటల్లో చెప్పాలంటే, 

"నేను అనవసరంగా మాట్లాడను - నేనేదయినా హాస్యంగా మాట్లాడినా, అందులో ఎప్పుడూ యేదోక అర్థం ఉంటుంది."

కానీ, ఈ హాస్యం ద్వారా మాత్రం ఏ సంతోషమూ కలుగదనీ, తాను ఛలోక్తులు విసిరేది కేవలం మనం విసుగు చెందకుండా ఉండటానికేనని కూడా చెప్పారు బాబూజీ. అయినా వారి హాస్య స్వభావం ఎలా ఉండేదంటే, నవ్వి నవ్వి ప్రాణాలు పోతాయేమోనన్నట్లుగా ఉండేది ఒక్కోసారి. 

కొన్ని హాస్య సందర్భాలు:

నిర్వచనానికి నిర్వచనం

ఒకరోజు బాబూజీ, నిర్వచనానికి నిర్వచనం ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు. పడే పడే "నిర్వచనానికి నిర్వచనం ఏమిటి" అంటూ ఉన్నారు. 

ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. ఆయన కూడా చెప్పలేదు. సాధారణంగా ఆయనే చెప్పేస్తూండేవారు. అప్పుడు మనం ఎంత మూర్ఖులమో అర్థమయ్యేది. అకస్మాత్తుగా ఒక అభ్యాసి, "నిర్వచనానికి నిర్వచనం కాలం వృథా చేయడమే" అన్నాడు. దానికి బాబూజీ ఇతను చెప్పింది నిజం అన్నారు. 

భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు?

అభ్యాసి: భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు?

బాబూజీ: 1) భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు అక్కడ నువ్వు లేవు, లేకపోతే నువ్వు ఆపేసేవాడివి. 

2) ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడంటే ఆయన జీవించాలి గనుక. 

మీకు వాచీ అవసరం ఏమిటి?

అభ్యాసి: బాబూజీ మీకు వాచీ అవసరం ఏమిటి?

బాబుజీ: కొత్తవాళ్ళతో ఎంత సమయం వ్యర్థమయ్యిందీ, లేక సాధకులు కానివారితో ఎంత సమయం వృథా అయ్యిందీ చూసుకోవడానికి. 

బాబూజీ, మీరు రోజంతా ఏం చేస్తూంటారు?

నవ్వుతూ, సంతోషంగా, హాయిగా గడిపేస్తూంటాను. 

చాలా ప్రశ్నలతో వచ్చాను. 

అభ్యాసి: బాబూజీ నేను మీ వద్దకు చాలా ప్రశ్నలతో వచ్చాను. కానీ ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. 

బాబూజీ: నువ్వు చాలా ప్రశ్నలతో వచ్చావు. అవన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు "నువ్వు" మాత్రమే మిగిలావు.  

సముద్రంపై ధ్యానించవచ్చా?

బాబూజీ: మనం దేని మీద ధ్యానిస్తామో దాని సారమే మనకు ఫలితంగా లభిస్తుందని నా అభిప్రాయం. కాబట్టి నువ్వు సముద్రంపై ధ్యానిస్తే నీకు లభించేది ఉప్పు మాత్రమే. 

ఆలోచనారహితస్థితిని ఇస్తారా?

బాబూజీ: నా వద్దకు ఒక వ్యక్తి వచ్చి నాకు ఆలోచనారహిత స్థితి ఇస్తారా అని అడిగాడు. నేను సరదాగా, "అలాగే, అయితే ఒకషరతు; నాకు నువ్వు ఆలోచనలతో కూడిన స్థితిని ఇస్తే, నేను నీకు ఆలోచనలు లేని స్థితిని ఇస్తాను" అన్నాను. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...