బాబూజీ - విశిష్ఠ ఆధ్యాత్మిక పరిశోధనలు - 2
మానవుడు తాను ప్రయాణించవలసిన ఆధ్యాత్మిక యాత్రను అర్థం చేసుకోవడానికి 23 వలయాలపరంగా వివరించారు. మన గమ్యాన్ని ఈ 23 వలయాల మధ్య ఉన్న కేంద్రంగా సూచించారు. మొదటి వలయంలో అడుగు పెట్టినప్పుడే 'యాత్ర' మొదలవుతుంది. ఒకటిన్నర వలయాలు దాటితే ముక్తి. మొదటి 5 వలయాలు దాటితే హృదయక్షేత్రం దాటినట్లు. ఆ తరువాతి 11 వలయాలు దాటితే మనోక్షేత్రం దాటినట్లు. ఆ తరువాతి 7 దేదీప్యమానమైన వలయాలు దాటితే కేంద్రీయ క్షేత్రం దాటినట్లు. ఆ తారువాట అనంతంగా, ఆ ఆనంద మహాసాగరంలో కేంద్రమవైపుగా యాత్ర కొనసాగుతూ ఉంటుంది. దీనినే బాబూజీ 'ఈత' అంటారు - 'స్విమ్మింగ్'. సృష్టిలోని మొట్టమొదటి మహర్షి ఇంకా ఇక్కడ ఈదుతూనే కేంద్రం వైపుగా తన యాత్రను కొనసాగిస్తూనే ఉన్నాడని చెప్తారు బాబూజీ.
మన ఆధ్యాత్మిక యాత్ర 👆
బాబూజీ అవతరించేంత వరకూ మానవుడు సాధించగల అత్యున్నత స్థితి మానవాళికి అందుబాటులో లేదు. మొదటి ఒకటిన్నర వలయాలకే జన్మరాహిత్యం అంటే, ఆ కేంద్రాన్ని చేరడానికి తరువాత కొనసాగించవలసిన ఆధ్యాత్మిక యాత్ర ఎంత ఉందో, ఊహించవచ్చు. ఇప్పటి వరకూ వచ్చిన యోగుల్లో మహా అయితే మూడవ వలయం వరకూ ప్రయాణం సాధించగలిగారట. కానీ, దానికే వారు చాలా సాధించారనుకోవడం చాలా దురదృష్టకరం. కానీ, ఇప్పటి వరకూ వచ్చిన ప్రాచీన ఋషుల్లో కబీర్ ఒక్కరే 16 వలయం చేరుకున్నట్లుగా బాబూజీ సత్యోదయం అనే గ్రంథంలో వ్రాయడం జరిగింది.
ఇటువంటి యాత్రను ఏ సహాయం లేకుండా, పూర్తి చేయడం అసాధ్యంగా కనిపిస్తుంది. బాబూజీ ప్రకారం మొదటి బిందువు నుండి రెండవ బిందువుకు చేరుకోడానికి స్వప్రయత్నం ద్వారా (కఠోర తపస్సు ద్వారా) 45 సంవత్సరాలు పడుతుందట. రెండు నుండి మూడవ బిందువుకు 45 x 5 అంటే 225 సంవత్సరాలు పడుతుంది. అలా ప్రతీ బిందువుకూ అయిదింతలు సమయం పడుతుంది. మరి మానవుడి జీవితకాలం సగటున 60 సంవత్సరాలనుకున్నా ఒక్క బిందువు యాత్ర పూర్తి చేయడా కూడా అసాధ్యమే.
(సశేషం ..)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి