బాబూజీ ఆధ్యాత్మిక శిక్షణ - 1
బాబూజీ జీవనమే అత్యున్నత శిక్షణ. ఆయన వ్రాసిన పుస్తకాలు ఎంత చదివినా కూడా నేర్చుకోలేనిదాన్ని ఆయనతో కలిసి ఉండటం ద్వారా, కలిసి జీవించడం ద్వారా, నేర్చుకొనేవారు. ఆయనతో కొద్దిపాటి పరిచయం ఉన్నవారు కూడా ఆయనలో ఎంతో సహజంగా ఉండే నిరాడంబరత, సరళత్వం, ఆదరణ, ఆప్యాయతలకు ముగ్ధులయి ఆయనను విడిచివెళ్ళేటప్పుడు ఎవరో ఆప్తుడిని, ఆత్మీయుడిని విడిచి వెళ్తున్నట్లు బాధపడేవారు. ఇస్తున్నట్లు కనిపించకుండానే ఎంతో, ఎన్ని విధాలుగానో ఇస్తూండేవారు. తనకు ప్రేమతో బహూకరించిన వస్తువులను వాటి అవసరం ఉన్న వ్యక్తికి అవి చేరిపోయేవి. ఆధ్యాత్మిక శిక్షణ కోసం తన వద్దకు వచ్చేవారి సాధారణ అవసరాలు కూడా గుర్తుంచుకొని తన వ్యక్తిగత ఇబ్బందులను లక్ష్యపెట్టకుండా తీర్చేవారు. "బాబూజీ ఒక పర్ఫెక్ట్ హోస్ట్" అని చక్కగా అభివర్ణించేవారు చారీజీ బాబూజీని.
దూరతీరాల నుండి ఆధ్యాత్మిక ఆకాంక్షతో వచ్చే విదేశీయుల పట్ల బాబూజీ ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. అక్కడి ఆధునాతనమైన, ఆడంబరమైన జీవితాలను విడిచి వచ్చిన వీరు నెలల తరబడి బాబూజీ సన్నిధిలో ఆ నిరాడంబరమైన సామాన్య వాతావరణంలో ఉండిపోయేవారంటే బాబూజీ వారిని ఎంత గాఢంగా ప్రభావితం చేశారో తెలుస్తుంది. కొద్ది కాలంలోనే ఆధ్యాత్మిక పురోగతితోపాటుగా వారి జీవితాల్లో, జీవిత విలువల పట్ల గల మౌలిక అవగాహనలో వారు తీసుకురాగలిగిన మార్పు ఏ సామాజిక శాస్త్రవేత్త, సంఘసంస్కర్త, కొన్ని దశాబ్దాలలో కూడా సాధించలేనిది.
అలాగని ఆయన ఇచ్చిన శిక్షణ ఏ మాత్రమూ హడావుడిగా గాని, నిర్ణీతమైన ఒక కార్యక్రమానికి గాని పరిమితమై ఉన్నట్లుగా గాని ఉండేది కాదు. అంతా అతి సామాన్యంగా, సాధారణంగా, తాపీగా మనకు తెలియకుండానే సాగిపోయేది. అయితే అభ్యాసులు మాత్రం తమలో వస్తున్న అనేక మార్పులను గమనిస్తూండేవారు. సహజమార్గ సాధనలో అభ్యాసి పాత్ర కంటే కూడా మాస్టరు బాధ్యత అనే విషయం సులభంగా నిరూపణ అయ్యేది. అయితే ఇది మొదలవడానికి ముందు అభ్యాసికి, గురువుకు మధ్య అనుబంధం ఏర్పడాలి. ఆ అనుబంధం ఏర్పడాలంటే మాస్టరును అభ్యాసి హృదయపూర్వకంగా స్వీకరించగలగాలి. అప్పుడే మాస్టర్ ఇచ్చే ప్రాణాహుతిని స్వీకరించగలగడం, 'ఆయన పని' మొదలు కావడం జరుగుతుంది. బాబూజీ భాష, అందులోనూ ఆయన ఇంగ్లీషు ఉచ్ఛారణ అర్థంగాని విదేశీ అభ్యాసులు, ఎంతో మంది ఇంగ్లీషు రానివాళ్ళు కూడా ఎంతో సుదూర తీరాల నుండి వచ్చి వారి ముందు కూర్చొని, బాబూజీ ఇంట్లో కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిపి, వారిని సునాయాసంగా స్వీకరించారంటే, వాళ్ళ ఆమోదాన్ని పొందడానికి బాబూజీ వారిని ఎలా ఆకట్టుకునేవారో అన్నది ఊహించవచ్చు. అయితే ఎందుకీ ప్రయాస అంతా! తన మాస్టర్ పట్ల తను నిర్వర్తించవలసిన బాధ్యత కోసమే. అందరినీ ఎక్కడి నుండి వచ్చారో మరలా ఆ మూలనివాసానికి చేరేలా చూడటం కోసమే.
బాబూజీ రాత్రి చాలా ఆలస్యంగా పడుకొనేవారు. బాబూజీ దినచర్య సుమారు 8-9 గంటలకు హుక్కా పీల్చడంతో మొదలయ్యేది. వరండాలో తన వాలు కుర్చీలో కూర్చొని, మౌనంగా అభ్యాసులపై తన పనిని, మనకు తెలియకుండానే మొదలు పెట్టేవారు. బాబూజీతో ప్రతి రోజు, భిన్న భిన్నంగా ఉండేది. నిర్దిష్టంగా ఇలా ఉంటుందని చెప్పడానికి ఉండదు. నిదానంగా, తాపీగా సాగుతున్నట్లుండేది రోజు. ఒక్కోసారి మౌనంగా ఉండేవారు, మరోసారి ఎవరైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పేవారు; చాలా సార్లు వేరే యేదో లోకాల్లో పని చేస్తున్నట్లుగా కనిపించేవారు. అప్పుడప్పుడు సిట్టింగు ఇస్తాను కూర్చోండి అనేవారు. మధ్యమధ్యలో ఇంట్లోకి వెళ్ళి వస్తూండేవారు. బహుశా అభ్యాసుల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి చేయవలసిన ఏర్పాట్లు చేయడం కోసమో, గృహస్థుగా తాను నిర్వర్తించవలసిన బాధ్యతల కోసమో, లేక ఇంట్లోవాళ్ళకి ఏవో సూచనలివ్వడానికో అన్నట్లుగా బయటకు, లోపలికి తిరుగుతూ ఉండేవారు.
ప్రెస్ లో పనులు, అభ్యాసుల ఉత్తరాలకు సమాధానాలివ్వడం, అతిథులకు మర్యాదలు చేయడమో, ఆఫీసు పనులు చేయడమో కాస్సేపు ఇలా ఉండేది వారి దినచర్య. అప్పుడప్పుడు ప్రశిక్షకులను చేయడంలో నిమగ్నులయ్యేవారు. అలాంటి సమయాల్లో అభ్యాసులు మౌనంగానే ఉన్నప్పటికీ, తమలో ఎంతో నిగూఢమైన పని జరుగుతోందనే స్పృహ మొదట్లో ఉండేది కాదు. కానీ, రాను రాను, బాబూజీ శిక్షణాశైలికి అలవాటు పడిన అభ్యాసులకు, తమ అంతరంగంలో వస్తున్న అనూహ్యమైన మార్పులను గమనించి, బాబూజీ సునాయాసంగా, తమ ప్రమేయం లేకుండానే, తమ నుంచి ఎటువంటి ప్రతిఘటనను ఎదుర్కోవలసిన అవసరం రాకూడదనే, ఆయన అంతటి బాధ్యతను తనపై వేసుకున్నారని, అసలు సద్గురువు అంటే ఇలా ఉండాలనీ, తెలిసేది. ఎప్పుడో ఒకప్పుడు బాబూజీని కలిసి, ఒకటో రెండో సిట్టింగులు తీసుకున్న అభ్యాసులకు తమపై ఇంతటి 'పని' జరుగుతుందని తెలిసేది కాదు. కానీ సహజమార్గ పద్ధతిలో చెప్పినట్లుగా, మాస్టరుతో కొన్నాళ్ళపాటు గడిపి, ఆయనకు తమపై పని చేయడానికి అవకాశం కల్పించిన అభ్యాసులకు బాబూజీ ఎంత గాఢంగా పని చేసేవారో తెలుసును. అందుకే, అసాధ్యమైన ఆధ్యాత్మిక శిఖరాలను సహజమార్గంలో సునాయాసంగా చేరుకోగలుగుతాం.
(సశేషం ..)
ఆహా !
రిప్లయితొలగించండి