బాబూజీ ఆధ్యాత్మిక శిక్షణ - 4
భగవంతుడు సరళుడు, ఆయనను పొందే మార్గ కూడా సరళమైనదై ఉండాలి; ఆయన ఒక మతానికి గాని, ఒక తెగకు గాని, ఒక జాతికి గాని, చెందినవాడు కాదు. ఆయనను ఏ మతగ్రంథాల్లో నుండీ వెలికితీయలేము. ఆయనను మన హృదయాంతరాళంలోనే కనుగొనగలుగుతాం.
మన సాధారణ జీవితంలో కూడా మనమొకరిని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడే, ఆ వ్యక్తిని గురించిన అవగాహన మనకు కలిగే అవకాశం ఉంటుంది. అప్పుడే ఆయనలా అవ్వాలన్న తపన కూడా ప్రారంభమవుతుంది. బాబూజీ తన గురుదేవులైన లాలాజీని ఎంతగా ప్రేమించారన్నది ఆయన ప్రవర్తనలోనూ, తనను తాను సజీవ ఉదాహరణగా చూపడం ద్వారా మనం కూడా అలాగే తయారు కావాలని బోధించకుండానే బోధించారు.
తన వద్దకు వచ్చినవారికి తగిన ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదించి పంపేవారు. ఖాళీ చేతులతో ఎవ్వరినీ పంపను అంటూండేవారు. అది తనకు లాలాజీ ఇచ్చిన ఆదేశమని కూడా చెప్తూండేవారు. "మీరు ఒక్క అడుగు ముందుకు వేసినట్లయితే, నేను మీ వైపు నాలుగు అడుగులు వేస్తాను" అంటూ బాధ్యతంతా తన మీద వేసుకునేవారు.
తన ఆధ్యాత్మిక కార్యాన్ని అభ్యాసులపై జరుపడానికి మన సహకారం కావాలని బాబూజీ కోరుకునేవారు. ఆయన అభ్యాసుల నుండి ఆశించేది ఇదొక్కటే. మనలో నిరోధించే తత్త్వం,ప్రతిఘటన కనిపించినప్పుడు ఆయన పనికి బాగా ఆటంకం కలుగుతుంది. అందుకే మనం నిద్రపోతున్నప్పుడు ఎక్కువగా మనపై పని చేస్తూండేవారు. నిద్రలో అంతగా నిరోధం ఉండదని బాబూజీ చెప్తూండేవారు. ఆయన బోధనా పద్ధతి ఎంత సులువైనదో మనం గమనించవచ్చు. ఆ విధంగా ఆయన మనలో నాటిన బీజం, మొలకెత్తి, వికసించి, పుష్పించి పరిమళిస్తుంది. లోపల నుండి బయటకు వ్యక్తమవుతుంది. వారు సమర్థ గురువులు అయినందువల్ల, మనం నిజ జీవితంలో అనుభవించవలసిన వాటిని కొంత నిద్రలో (స్వప్నంలో) అనుభవించేలా చేసి, సంస్కారాల ఉధృతం మనకు తెలియకుండా చేసేవారు.
మానవాళికి తన హృదయం ఆటస్థలం లాంటిదని బాబూజీ తరచూ చెప్తూండేవారు బాబూజీ. అభ్యాసులందరూ ఎవరికి వారు తనను మాత్రమే ప్రత్యేకంగా ప్రేమిస్తున్నారనుకునేవారు.
అన్నీ విషయాల్లోనూ 'మితం' పాటించాలన్నది వారి బోధ. మాటల్లోనూ, ఆహార విషయాల్లోనూ, ఆఖరికి ప్రాణాహుతి ప్రసారంలో కూడా తగిన మోతాదులోనే ఇచ్చేవారు. అందుకే వారి సమాధానాలు చాలా క్లుప్తంగా, సూటిగా ఉండేవి - 'ధ్యానించు'; 'శుద్ధీకరణ చేసుకో'; 'ప్రాణాహుతి ప్రసరణ చెయ్యి'; మరీ అవసరమైతే 'ఈ విషయాన్ని బాగా ఆలోచించు' అనేవారు.
బాబూజీ 'సాన్నిధ్యాన్ని' మౌనంగా అనుభూతి చెందడమే ఒక బోధన. శ్రవణం అలవాటైన అభ్యాసులు ఆయన ముందు కూర్చొని ఉన్నప్పుడు, బాబూజీ మాట్లాడటం లేదని అన్నప్పుడు, " నా ముందు అభ్యాసులను చూడగానే, వాళ్ళు అంతరంగంలో సంస్కారాల ఉచ్చులో చిక్కుకుని ఉండటం గమనించాను. వాళ్ళతో కబుర్లు చెప్పడం కంటే ఆ సమయంలో ఆ ఉచ్చులను త్రెంచడం వల్ల వాళ్ళకు ఎంతో మేలు జరుగుతుంది" అనేవారు బాబూజీ.
మన కోరికల కారణంగా, అహంకారం కారణంగా మనం మాస్టరుతో సహకరించలేకపోతున్నాం. మనం ఆయనతో సహకరించేందుకే ఆయన మనతో చేసే సంభాషణలు, హాస్యం, చిన్ని-చిన్ని కోరికలు తీర్చే ప్రయత్నాలు; అప్పుడే 'ఆయనతో' మనకు ఒక సంబంధం ఏర్పడి ప్రేమ అంకురించి, ఆహాన్ని ఆయనకు సమర్పించే పరిస్థితి వస్తుంది. నిజమైన సహకారం, విధేయత అప్పుడు మొదలవుతుంది. ప్రేమకు నాంది విధేయతే.
(సశేషం ..)
ఆహా ! ఏమని చెప్పనూ ! ఇక్కడ వ్రాయనూ !
రిప్లయితొలగించండి