26, జనవరి 2024, శుక్రవారం

ఏది తెలుసుకుంటే ఈ సర్వమూ తెలుసుకోగలుగుతాం?


ఏది తెలుసుకుంటే ఈ సర్వమూ తెలుసుకోగలుగుతాం?


ఆధ్యాత్మికతలో, సత్యాన్వేషణలో సమాధానాల కంటే ప్రశ్నలే ముఖ్యం అంటారు పెద్దలు. పరమ సత్యాన్ని తెలుసుకునే క్రమంలో యేదొక ఆధ్యాత్మిక పాఠాన్ని అనుసరిస్తున్నప్పటికీ, అనుభవాలు గడిస్తున్నప్పటికీ, అడుగడుగునా ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. సాధకుడికి వీటినే అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలని (Existential questions) కూడా అంటారు. ఉదాహరణకు, నేనెవరు? ఎందుకు పుట్టాను? ఎందుకు మరణిస్తాను? జీవిత ప్రయోజనం ఏమిటి? పుట్టుకకు, మృతువుకు మధ్య చేయవలసినది ఏమైనా ఉందా? లేక కేవలం మరణించే వరకూ జీవించడమే జీవితమా?జీవితానికి ఏమైనా పరమార్థం ఉందా? ఇలా అనేకమైన ప్రశ్నలు యేదోక దశలో ప్రతీ ఆత్మకు కలుగుతూ ఉంటాయి. వీటికి సరైన సమాధానాలు వచ్చే వరకూ ఆత్మ, సంతృప్తి చెందదు. స్వతఃసిద్ధంగా ప్రతీ ఆత్మకు కలిగేటువంటి ప్రశ్నలు. 

ఇటువంటి ప్రశ్నలు ఆత్మ ఆస్తిత్వంలోకి వచ్చినప్పటి నుండీ వస్తూనే ఉన్నాయి, గతంలోనూ వచ్చాయి, ఇప్పుడూ వస్తున్నాయి, ఇక ముందు భవిష్యత్తులో కూడా వస్తూనే ఉంటాయి. వీటికి సంతృప్తికరమైన సమాధానాలు వచ్చే వరకూ ఏ ఆత్మా సుఖంగా విశ్రమించలేదు. ఈ ప్రశ్నలకు నిశ్శబ్దంగా సమాధానాలు వెతుక్కోవడమే మనిషి మనుగడ. ప్రయత్నపూర్వకంగా, సంపూర్ణ స్పృహతో వీటిని అన్వేషించడమే ఆధ్యాత్మిక జీవనం. మిగిలినవారు అంటే సాధన చేయనివారు, తెలియకుండా, స్పృహ లేకుండా పరోక్షంగా వీటి సమాధానాలు రకరకాల మార్గాల ద్వారా వెతుక్కుంతు  ఉంటారు. సాధన చేయనివారికి, చేసేవారికి ఉన్న తేడా అంతే. 

ఈ ప్రశ్నలే సాధకుడి తపనను తీవ్రతరం చేస్తాయి; లోలోతుల్లోకి వెళ్ళేలా ప్రేరణ కలిగిస్తాయి. సమాధానం కోసం వేచి ఉండే అద్భుతమైన నిరీక్షణను, తద్వారా తపనతో కూడిన సహనాన్ని అలవాటు చేస్తాయి. ఈ విధంగా అబ్బే లక్షణాలన్నీ ఈ సంసార సాగరాన్ని ఈదడంలో గొప్పగా సహాయపడుతూ ఉంటాయి. ఇటువంటి ప్రశ్నలు, అనుమానం వల్ల కలిగే ప్రశ్నలు కావు; జిజ్ఞాస వల్ల కలిగే ప్రశ్నలు. వీటికి తప్పక సమాధానాలు లభిస్తాయి. అటువంటి అద్భుతమైన ప్రశ్న ఒకటి ముండక ఉపనిషత్తులో దర్శనమిస్తుంది. అది ఈ క్రింది విధంగా ఉంది:


शौनको ह वै महाशालोऽङ्गिरसं विधिवदुपसन्नः पप्रच्छ ।

 कस्मिन्नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवतीति ॥ 1.1.3 ॥

శౌనకో హ వై మహాశాలోంగీరసం విధివదుపసన్నః  పప్రచ్ఛ | 

కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి ||1.1.3.||


పైన పేర్కొన్న శ్లోకం ముండకోపనిషత్తులోని మొదటి ఖండంలోని 3 వ శ్లోకం. ఇక్కడ శౌనకుడనే గొప్ప గృహస్థుడు అంగీరస మహర్షిని సమీపించి అడిగిన అద్భుతమైన ప్రశ్న - ఓ భగవాన్, ఏది తెలుసుకుంటే ఈ సర్వాన్నీ  తెలుసుకోగలుగుతాం? 

ఇది శిష్యుడికి కలిగిన అద్భుతమైన ప్రశ్న. ఇటువంటి ప్రశ్నే ఆదిశంకరులవారు రచించిన వివేకచూడామణి గ్రంథంలో కూడా ఒక శిష్యుడు గురువును ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకు ఎవరికి వారు సమాధానం వెతుక్కుందాం. 


 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...