బాబూజీ ఆధ్యాత్మిక శిక్షణ - 2
బాబూజీ సాయంకాలం ఆరున్నరకు సత్సంగం నిర్వహించేవారు. ఆ తరువాత వాలు కుర్చీలో కూర్చొని హుక్కా పీలుస్తూండేవారు. ఉల్లాసంగా, ఆనందంగా, జలపాతంలో నీరు పడుతున్నట్లుగా గలగల మాట్లాడుతూండేవారు. ఒక్కోసారి మౌనంగా తనదైన లోకంలో ఉండేవారనడం కంటే కూడా ఉన్నతమైన ఆధ్యాత్మిక కార్యాలనో, బీజరూపంలో చేసే ప్రకృతి కార్యాలనో లేక అద్భుతాలను నిర్వహిస్తూండేవారనడమే కరెక్ట్ అనుకుంటాను. అలా రాత్రి అవుతున్నకొద్దీ, అప్పుడే ఆయన దినచర్య మొదలయ్యిందా అన్నట్లుగా మరింత హుషారుగా కనిపించేవారు.
అలా రాత్రి పదకొండు, పన్నెండు గంటల వరకూ కూర్చునేవారు. అలా కూర్చున్న ఆ నిశ్శబ్ద మౌన క్షణాలే వారిచ్చే అత్యున్నత అద్భుత ఆధ్యాత్మిక శిక్షణ. ఛలోక్తులు విసరడం, సులభంగా అర్థమవ్వాలని కథలు చెప్పడం, అభ్యాసి గతంలోకి తొంగి చూసి అతను ఫలానా అని చెప్పడం లేదా అభ్యాసుల్లో సంస్కార ఉచ్చులను తొలగించేస్తూండటం, అప్పుడప్పుడు అవగాహన కోసం కబీరు కథలో, గురునానక్ కథలో సూఫీ కథలో చెప్తూండటం చేసేవారు.
బాబూజీ శిక్షణ చాలా ప్రత్యేకంగా ఉండేది. ఆయన ప్రవచనకారుడు కాదు, వక్త కాదు. కానీ ఆయన చుట్టూ కూర్చొని ఉన్నప్పుడు, ఆయన సంభాషణలు, విసిరే ఛలోక్తులతో అభ్యాసుల సమస్యలకు సమాధానాలిస్తూండేవారు. ఎన్నోసార్లు అభ్యాసుల మనసుల్లోని మాటను గ్రహించి, వాళ్ళు ప్రశ్నించకుండానే సమాధానం ఇచ్చేవారు. ఎందరో అభ్యాసుల కథనాలు దీనికి నిదర్శనంగా ఉన్నాయి.
బాబూజీ ఎవ్వరికీ ఇది చెయ్యి, అది చెయ్యి అని సాధారణంగా చెప్పేవారు కాదు. మీరు అభ్యాసికి నేరుగా ఫలానా పని చేయమని ఎందుకని చెప్పారు అని ఒకసారి చారీజీ ప్రశ్నించినప్పుడు, అలా చెప్తే అది గురువాజ్ఞ అయిపోతుంది, దాన్ని అభ్యాసి ఉల్లంఘించినట్లయితే అది పాపమై చుట్టుకుంటుంది అనేవారు. అభ్యాసి శ్రేయస్సు అన్ని విధాలా కోరుకునే సద్గురువు బాబూజీ.
"నౌ అయాం టెల్లింగ్ యు" అనే ఆంగ్ల పదబంధం ఆయన నోటి వెంట తరచూ వినిపిస్తూండేది. బాబూజీ కళ్ళు కొంటె కుర్రాడి కళ్ళల్లా మెరుస్తూండేవి. లాలాజీ ని తలచుకోగానే ఆయన కళ్ళు మరింతగా మెరుస్తూండేవి. చేతులు అటు ఇటూ కడుపుతూ తన ఆహార్యంతో తన గురుదేవుల గురించిన విషయాలను అభివ్యక్తం చేసేవారు. ఆయన ముందు కూర్చున్న అభ్యాసులందరూ మంత్రముగ్ధులై, మనసు, హృదయం అంతా శూన్యమైపోయి ఎంతో తేలికదనాన్ని అనుభూతి చెందుతూండేవారు. సంస్కారాల భారం నుండి అభ్యాసులను తప్పించి, వాళ్ళకు తెలియకుండానే ప్రాణాహుతిని వాళ్ళ హృదయాల్లో నింపుతూ, వాళ్ళకు బోధించవలసినదంతా బీజరూపంలో చొప్పించేవారు; వివేకము, వికాసము లోపలి నుండి పైకి సహజంగా పైకి తనంతతానుగా వచ్చే పరిస్థితిని కల్పించేవారు. బాబూజీ అసలైన శిక్షణ ఇదే. ప్రాణాహుతి ఆయన ద్వారా 24 గంటలూ ప్రవహిస్తూనే ఉండేది.
తెల్లవారుఝామున 2 గంటల నుండి ప్రత్యేకంగా అందరికీ ప్రాణాహుతి ప్రసరణ చేస్తూండేవారు. ఆపడల్లోనూ, సమస్యల్లోనూ, చిక్కుకున్న అభ్యాసులు, బాబూజీని స్మరించినప్పుడు, వాళ్ళ రూపాలు ఆయన హృదయంలో నీటి బుడగల్లా కనిపించేవట; తక్షణమే వారికి అందవలసిన సహాయం అందుతూండేదని బాబూజీ చెప్తూండేవారు. మాస్టరును ఆశ్రయించి ఆ విధంగా ఆధారపడటమే చాలా ముఖ్యం.
బాబూజీ బోధిస్తున్నది జీవిస్తూ, ఆచరించి చూపించేవారు. తన వద్దకు చాలా మంది చూడాలని వస్తారు కానీ చూడకుండానే వెళ్లిపోతూంటారని బాబూజీ ఆవేదన పడుతూండేవారు. ఇవ్వడానికి ఆయన వద్ద ఆధ్యాత్మిక పెన్నిధి ఉన్నా, అడిగిన వారికి ఇద్దామని ఆతృతతో వేచియున్న బాబూజీ వద్దకు ఎవరూ రానప్పుడు, వచ్చినవారు కూడా అసందర్భంగా ఎంతో అల్పమైనవాటిని మాత్రమే కోరుకున్నప్పుడు, వారు ఎంత వ్యధను అనుభవించేవారో వారి గ్రంథాలు చదివితే అర్థమవుతుంది. బాబూజీని చూసినవారే దీనికి నిదర్శనం. ఆయన ఎప్పుడూ ఇవ్వడమే, మరింతగా ఇవ్వడమే తప్ప దేనిని ఆశించలేదు. ఆయన ప్రధాన బోధన కూడా "ఇవ్వండి, ఇవ్వండి" అనేదే. చివరికి ఆయన "నా వద్ద తరగని ఆధ్యాత్మిక సంపద ఉన్నది. దీన్ని కొల్లగొట్టి తీసుకోండి. నా జీవితకాలంలో మీరు తీసుకోలేకపోతే దీన్నంతా వాతావరణంలో విడిచిపెట్టేయవలసి వస్తుంది" అనేవారు.
( సశేషం ..)
ఎంత చెప్పాలో అంతా చక్కగా చెప్పారు....
రిప్లయితొలగించండి