1899 వ సంవత్సరం ఏమప్రిల్ 30 వ తేదీన, ఉదయం 7 గంటల 26 నిముషాలకు సహాజహానుపూర్ లో, ఒక కాయస్థా కుటుంబంలో జన్మించారు శ్రీరామచంద్రజీ. వారి తండ్రిగారి పేరు రాయబహద్దూర్ శ్రీ బడరీ ప్రసాద్ జీ; ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గా పని చేసేవారు.
శ్రీరామచంద్రజీ ఆధ్యాత్మిక తృష్ణ ఆరు సంవత్సరముల ప్రాయంలోనే కనపించింది. వారి తల్లిగారు సాంప్రదాయబద్ధంగా పూజలు చేస్తూండేవారు. పూజలు ఎలా చేయాలో ఆమెను అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. అప్పుడు వారి తల్లిగారు బాబూజీ నుదుటిమీద గంధం పూస్తూ ఉండేవారు. బాబూజీ పూజ చేసినంతగా ఆనందించేవారు. అలా కొంతకాలం సాగింది.
తొమ్మిది సంవత్సరాల ప్రాయంలో ఈ సృష్టికి మూలకారణమైన ఆ మూల తత్త్వాన్ని, పరతత్త్వాన్ని తెలుసుకోవాలన్న ఆధ్యాత్మిక తృష్ణ తీవ్రంగా కలిగింది ఆయనలో. నీటిలో మునిగిపోతున్నవాడు ప్రయాణం కోసం ఎంతగా పరితపిస్తాడో, ఆ సత్యతత్త్వాన్ని తెలుసుకోవాలన్న తపన వారిలో అంతా తీవ్రంగా ఉండేది. ఆ తరువాత భగవద్గీత చదవడం ప్రారంభించారు. కానీ, వారు తపిస్తున్న విషయం అందులో కూడా కనిపించ లేదు.
సాక్షాత్కారం కోసం వారి కుటుంబ పురోహితుని ఏదైనా ఆరాధనా పద్ధతిని సూచించమని కోరారు. ఆ పురోహితుడు రామనామం జపించమని సూచించాడు. నిర్దిష్ట సమయంలో ఏడు రోజులు ఈ జపాన్ని కొనసాగించారు. ప్రయోజనం లేకపోయింది. తనలో పరివర్తన కనబడకపోవడంతో ఆపేశారు.
ఆ తరువాత విగ్రహారాధన ప్రారంభించారు. దీని వలన పురోగతికి బదులుగా తిరోగతిని గమనించి, దానిని కూడా విడిచిపెట్టారు.
ఈ ప్రక్రియలేవీ కూడా వారి తృష్ణను తృప్తి పరచలేదు. ఈ అయోమయ గందరగోళ పరిస్థితి వారికి 14 సంవత్సరాలు వచ్చే వరకూ కొనసాగింది. సరైన సమర్థుడైన గురువు కోసం 24 గంటలూ ప్రార్థిస్తూ ఉండేవారు. అంతే కాదు, ఎవరి వద్దకయినా ఈ భావంతో గనుక వెళ్ళడం జరిగితే, వారినే తన మాస్టరుగా స్వీకరించాలని సంకల్పించుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి