బాబూజీ భౌతిక స్వరూపం
బాబూజీ స్వరూపం అతి సామాన్యంగానూ, నిరాడంబరంగానూ, దివ్యంగానూ, అణువణువునా సరళయత్వం ఉట్టిపడుతూ ఉండేది. ఆయనది 5 అడుగులకు కొంచెం ఎత్తుగా ఉండే విగ్రహం. విశాలమైన నుదురు, పెద్ద చెవులు, గడ్డం, మీసం, బట్టతల, తలవెనుక ఒక చిన్ని పిలక, అతీసున్నితమైన గులాబీరంగులో ఉండే పాదాలు, కుడిచేతికి రెండు ఉంగరాలు, క్రింద పంచే, పైన లాల్చీ, చాలికాలమైతే ఆ లాల్చీపైన ఒక చిన్న కోటు కానీ, స్వెటరు గాని వేసుకునేవారు. ఇదీ అందరికీ కనిపించే బాబూజీ విగ్రహం.
బాబూజీ కళ్ళు చాలా ప్రత్యేకంగా ఉండేవి. వాటిని చారీజీ మాటల్లోనే వివరించాలి. "నేను చూసిన అతిలోతైన కళ్ళవి. సాధారణంగా మనుషుల కళ్ళల్లోని లోతుకు ఒక హడదుంటుంది. కొన్ని కళ్ళయితే ఏమాత్రం పారదర్శకత లేకుండా ఉంటాయి. పై కనుగుడ్డు తప్ప మరేమీ కనిపించదు. కానీ, బాబూజీ కళ్ళు మాత్రం, వాటిని చూస్తే, ఆ కళ్ళ వెనుక ఉన్నది ఒక దివ్యప్రపంచానికి దారేమో అన్నట్లుగా ఉండేవి. ఆయన కళ్ళల్లోకి చూస్తే, స్పష్టమైన నీలి ఆకాశాన్ని చూస్తున్న హాయి కలిగేది. ఆయన కళ్ళల్లోనే మొత్తం సృష్టి అంతా ఇమిడి ఉన్నట్లుగా నాకు తోచింది. కృష్ణుని నోట్లో యశోదా మాట సృష్టి మొత్తం చూసిందనే పురాణ గాథలు నిజమేనని తేలికగా నమమేటలుగా ఉన్నాయి ఆ కళ్ళు."
బాబూజీ ఎక్కువగా తెల్లాడుస్తులే ధరించేవారు. చాలా సాధారణ దుస్తులే అయినప్పటికీ పరిశుభ్రమైన దుస్తులే వేసుకునేవారు. చూడటానికి అతిసామాన్యంగా, నిరాడంబరంగా, సరళంగా ఉండేవారు. ప్రత్యేకమైన సందర్భాల్లోనూ, ఎవరినైనా కాలవాలనుకున్నప్పుడు, ఉన్నత హోదా కలిగిన వ్యక్తులు వారిని కలవడానికి వచ్చినప్పుడు, తలపై తెల్ల టోపీ, మెడ దగ్గర నుండి మోకాళ్ళ వరకూ ఉండే కోటు, క్రింద పైజామా లేక ప్యాంటు వేసుకుని మర్యాదగా హుందాగా కనిపించేవారు.
బాబూజీ శరీరం అతి మృదువైన, అతి మెత్తనాయిన శరీరం. పాదాలను 'పాదపద్మములు' అని ఎందుకు వర్ణిస్తారో అర్థమయ్యే విధంగా, వారి పాదాలు తామరరేకుల్లా చాలా మెత్తగా ఎర్రగా ఉండేవి. చుట్టూ ఉన్నవారిలోనే గాక, వాతావరణంలో కూడా పులకరింతను కలిగించేది వారి చిరునవ్వు. వారి చేతిలో హుక్కాయతో, వాలుకుర్చీ మీద కూర్చొని హుక్కా పీలుస్తూ ఉంటే, అది మనసుకు ఆధ్యాత్మికానందాన్ని కలుగజేసే దివ్యదృశ్యంగాఉండేది. బాబూజీ నిరంతర సాంగత్య భాగ్యం కలిగిన ఆ హుక్కా అదృష్టం ఎంతటిదో!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి