24, జనవరి 2024, బుధవారం

బాబూజీ గృహస్థ జీవనం

 




బాబూజీ గృహస్థ జీవనం 

పక్షి రెండు రెక్కలతో ఎగిరినట్లుగా మనిషి కూడా ఆధ్యాత్మిక జీవనం, భౌతిక జీవనం అనే రెండు రంగాలలో జీవితగమ్యాన్ని సాధించాలన్న సహజమార్గ మూల సిద్ధాంతానికి సజీవ ఉదాహరణగా, స్వయంగా జీవించి చూపించారు, బాబూజీ.

బాబూజీ వివాహం చేసుకుని అందరిలాగే గృహస్థ జీవనంలో ఉండే బాధ్యతలన్నీ స్వీకరించారు. మనం మన జీవితాల్లో అనుభవించే ఆనందం, విచారం, కష్టాలూ, వియోగం, అన్నీ వారు కూడా అనుభవించారు. గృహస్థ జీవనం అంతా పరిపూర్ణంగా జీవిస్తూ కూడా, అదే సమయంలో తనలో ఆధ్యాత్మిక మాస్టరుగా తయారవడానికి అవసరమైన దివ్య సామర్థ్యాలను కూడా పెంపొందించుకోగలగడం చాలా అద్భుతమైన విషయం. 

"భగవంతుడు బ్రహ్మచారికి ఇరవై అడుగుల దూరంలోనూ, సన్న్యాసికి ముప్ఫై అడుగుల దూరంలోనూ ఉంటే, గృహస్థుడి విషయంలో మాత్రం ఆయన అతని హృదయంలోనే నివసిస్తూ ఉంటాడు" అన్న కబీర్ వాక్యానికి సరైన సార్థకత బాబూజీ జీవితం. "మనం ఎప్పుడూ అన్ని వేళల్లోనూ కూడా భగవంతునితో కూడి, భగవంతునిలో ఉండాలి. ఒక్క క్షణం కూడా విడిచి ఉండకూడదు. ఈ స్థితిలో గనుక ఉన్నట్లయితే మనం అన్నీ వేళలా వైరాగ్యంలో ఉన్నట్లే. కాబట్టి భగవంతునితో అనుబంధం, ప్రపంచంతో నిజమైన వైరాగ్యభావాన్ని కలిగిస్తుంది" అని అంటూండేవారు బాబూజీ. 

మన జీవితాల్లో, మన జీవితం ఒక వలయం అనుకుంటే, మన కుటుంబం కేంద్రమయితే, సాధారణంగా మన జీవిత వలయ పరిధీ, కేంద్రము, రెండూ ఒక్కటే - అదే మన కుటుంబం కానీ, బాబూజీ విషయంలో కేంద్రం కుటుంబమే అయినా, వారి వలయ పరిధి మాత్రం యావత్ విశ్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. ఇదీ, మన జీవితాలకు, ఆయన జీవితానికి గల వ్యత్యాసం. 

బాబూజీ జీవితం చూస్తే, ఢాతృత్వం, ఉదారత, ధర్మం, వైరాగ్యం, అనే పదాలకు మనకు అర్థం తెలుసుననుకోవడం మూర్ఖత్వమే అనిపిస్తుంది. మన దగ్గరున్న చిల్లర అడుక్కునేవాళ్ళకిచ్చేసి, కొన్ని రూపాయలు విరాళంగా ఇచ్చేసి, మనకు అక్కరలేని, చినిగిపోయిన దుస్తులిచ్చేసి, మనం దానం చేశామన్న భావనలు మిగుల్చుకుంటాం. అలాగే హోదా కోసం, స్థోమత లేకపోయినా దానం చేస్తాం. ఈ దుస్థితికి కారణాలేమయినా, సరైన మార్గదర్శకత్వం కోసం కొట్టుమిట్టాడుతున్న మానవాళికి, సరైన దిశ, మార్గదర్శకత్వం చూపుతూ బాబూజీ స్వయంగా జీవించి ఆదర్శమయ్యారు. 

ఇటువంటి విషయాల గురించి ప్రస్తావిస్తూ ఈ విధంగా అన్నారొకసారి, "మీరు దానం వేయాలనుకున్నారనుకోండి, దానివలన మీ కుటుంబ కష్టాలకు గురవుతున్నప్పుడు, దాన్ని దానం అని ఎలా అనగలరు?  దానిని నేను మూర్ఖత్వమనే అంటాను. గృహస్థుడిగా నీ ధర్మం ఏమిటి? వివాహం చేసుకుని, గృహస్థునిగా బాధ్యతలఉ స్వీకరించినప్పుడు, నీవు నిర్వర్తించవలసిన కొన్ని ధర్మాలున్నాయి. అవి అనివార్యమైనవి. కాబట్టి మీరు చేసే దానం వల్ల కుటుంబం కష్టాలకు గురవుతోందంటే, అది దానమే కాదు. నిజానికి అటువంటి దానం చేస్తే మీరే స్వయంగా మీ కుటుంబాన్ని దోచుకున్నవారావుతారు. మరి దోపిడీని దానం అని ఎలా అనగలం?" "మరి మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఆ దానానికి అంగీకరిస్తే, అది సరైన దానం అవుతుందా?" అని చారీజీ ప్రశ్నిస్తారు. "కాదు, అయినా సరే అది సరైన దానం కాదు. ఏ హిందూ స్త్రీ తన భారత కోరికలకు భిన్నంగా వ్యవహరిస్తుంది? అందులోనూ ధార్మిక విషయాలకు అస్సలు అడ్డు చెప్పాడు. నీ ధర్మ ఏమిటో నిర్ణయించుకోవలసినది నువ్వే. ఇతరులను సంప్రదించామంటే, ఆ బాధ్యత ఇతరుల మీద నెట్టే ప్రయత్నమే" అన్నారు బాబూజీ బదులిస్తూ. 

"మరి బిచ్చగాళ్ళకిచ్చే చిన్న-చిన్న దానాల సంగతేమిటి?" అని చారీజీ ఒకసారి ప్రశ్నించారు. బాబూజీ చిరునవ్వు నవ్వేసి, "దాన్ని దానం అంటారా? పేదవారికి అన్నం పెట్టడం, తోటి సోదరులకు బట్టాలివ్వడం, దానం అనిపించుకోడు. అది నీ ధర్మం. కష్టాల్లో ఉన్న నీ సోదరీసోదారులను ఆదుకోవడం మానవులుగా అది మన ధర్మం. దీన్ని ధాతృత్వం, దానం అనడం అనేది సిగ్గుపడవలసిన విషయం."

బాబూజీ 24 గంటలూ కూడా అనూహ్యమైన ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండేవారు. మామూలు స్థితికి వారు అవసరానికి అనుగుణంగా స్పందించేవారు. అటువంటి ఉన్నతస్థితిలో ఉంటూ కూడా గృహస్త ధర్మాలలోనూ, వారి బాధ్యతా నిర్వహణలోనూ ఏ లోటూ చేయలేదు, విస్మరించలేదు. వారికి ఆరుగురు సంతానం. నలుగురు పుత్రులు - ప్రకాష్ చంద్ర సక్సేనా (న్యాయ పట్టభద్రులు), దినేష్ చంద్ర సక్సేనా (మెట్రిక్ వరకూ చదివారు, విధివశాన ఆత్మహత్యకు పాల్పడవలసి వచ్చింది), ఉమేష్ చంద్ర సక్సేనా (ఛార్టర్డ్ అకౌంటెంట్), సర్వేష్ చంద్ర సక్సేనా(పట్టభద్రులు). కుమార్తెలిద్దరు - ఛాయ, మాయ. బాబూజీ అందరినీ చదివించారు, అందరికీ వివాహాలు జరిపించారు. 

బాబూజీ అలవాట్లన్నీ మితంగానే ఉండేవి. భోజనం చేయడంలోనూ, మాట్లాడటంలోనూ, ఖర్చుపెట్టడంలోనూ, మరే ఇతర విషయంలోనైనా సరే, మితం తప్పనిసరిగా పాటించేవారు. జీవితంలో ప్రతీ విషయంలోనూ మితం చాలా ప్రధాన మన్నది వారి ముఖ్య బోధన. వారి జీవితం నుండి మనం ముఖ్యంగా నేర్చుకోవాలసిన అంశం - మితం. 

ఇంట్లో ఖర్చులు, అవసరాలు, అన్నీ స్వయంగా బాబూజీయే  చూసుకునేవారు. వారి ఆతిథ్యం అద్వితీయంగా ఉండేది. అతిథులతో వారు ప్రవర్తించే తీరు, అనుభవించినవారు సౌభాగ్యవంతులు. వారి దగ్గరకు వచ్చినవారిలో ఎక్కువగా వారి ఆధ్యాత్మిక మార్గదర్శకతవాణ్ణే కోరి వచ్చినా, వారందరికీ ముందు కనీస సౌకర్యాలు, వసతి కల్పించేవారు. ప్రాంతాన్ని బట్టి, వారి ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకుని ఆతిథ్యం ఇచ్చేవారు. ఉదాహరణకు, దక్షిణాది నుండి వచ్చే అభ్యాసుల కోసం, పెరుగు తెప్పించేవారు, అన్నం వండించేవారు. విదేశీయుల కోసం వేన్నీళ్ళు ఏర్పాటు చేసేవారు. వాళ్ళు తినే పదార్థాలను ప్రత్యేక శ్రద్ధతో అమర్చేవారు. కొంతమంది అభ్యాసుల  రుచులను కూడా దృష్టిలో పెట్టుకుని భోజనం వడ్డించేవారు. కొంతమంది వెల్లుల్లి, ఉల్లి తినేవారు కాదు; వాళ్ళకి అవి లేకుండా వండించేవారు. ఇతరుల అన్నీ రకాల అవసరాలను అతి వేగంగా గ్రహించేవారు. మనుషుల అవసరాలే కాదు, ఇతర జీవరాసుల అవసరాలు కూడా ఇట్టే గమనించేవారు. వెంటనే అందించవలసిన సేవనందించేవారు. ఆయనకోక కుక్క ఉండేది, దానికి భోజనం స్వయంగా ఆయనే పెట్టేవారు. చలికాలంలో దక్షిణాది నుండి వచ్చిన అభ్యాసులకు స్వెటర్లతో సహా  అన్నీ ఇచ్చేవారు. షాజహానుపూర్ ఆశ్రమ నిర్మాణానికి పూర్వం నలుమూలల నుండి వచ్చే అభ్యాసులందరూ ఆయన ఇంట్లోనే ఉండేవారు. ఖర్చులన్నీ వారే భరించేవారు. 






 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...