6, జనవరి 2024, శనివారం

బాబూజీ ఆధ్యాత్మిక శిక్షణ - 5

 


బాబూజీ ఆధ్యాత్మిక శిక్షణ - 5 

కొత్త సంస్కారాలను తయారు చేసుకోకుండా మీ జీవనాన్ని కొనసాగించండి అన్నది వారి బోధల్లో మరొక ముఖ్యాంశం. అది కూడా బాబూజీ నుండే నేర్చుకుంటాం. ఆయన ఎప్పుడూ లాలాజీ స్మరణలోనే ఉండేవారు. ఆ తరువాత మనం చారీజీని కూడా తన గురుదేవులైన బాబూజీ స్మరణలోనే ఉండటం మనం గమనించాం. ఇప్పుడు పూజ్య దాజీని చూస్తేనే తన గురుదేవులైన బాబూజీ స్మరణలో ఎంత గాఢంగా ఉన్నారో మనం చూస్తున్నాం. దీన్నే నిరంతర స్మరణ అని కూడా అంటాం. ఇది సాధించడం ఎలా? కేవలం ప్రేమ ద్వారానే. గురుదేవులను సర్వకాలసర్వావస్థల్లోనూ ఎల్లప్పుడూ మన స్మరణలో ఉండేంతగా ఆయనను ప్రేమించే ప్రయత్నంలో ఉండాలి ప్రతీ అభ్యాసి. అప్పుడే సంసారసాగరంలో ఉంటూ జీవితంలోని ఆటుపోట్లను అనుభవిస్తూ కూడా, కొత్త సంస్కారాలు సంక్రమించకుండా జీవించగలుగుతాం. శుద్ధీకరణ ప్రక్రియ సంస్కారాల ప్రభావాన్ని తొలగిస్తే, మాస్టర్ యొక్క సాన్నిధ్యం, వారి ప్రాణాహుతి, అంచెలంచెలుగా ఆధ్యాత్మిక పథంలో మనలను ముందుకు తీసుకుపోతుంది. బాబూజీ ప్రసాదించిన సరళమైన సాధనా పద్ధతి ప్రభావం అంతటిది. 
మానవులందరికీ, ఒకే పద్ధతి, ఒకే మాస్టర్ అన్నది వారి ముఖ్యమైన బోధనాంశం. మనుషులలో ఆయన ఎటువంటి వివక్ష చూపలేదు. మతం, జాతి, కులం, రంగు, భాష, లింగ బేధాలేవీ వారు చూడలేదు. మనిషి ఎక్కడివాడైనా మనిషేనని, అందరికీ ఒకే పద్ధతిని ప్రసాదించారు. అందరికీ ఆయనే మాస్టర్. ఈ భావమే మనందరిలో ప్రేమ, సోదరభావాలు పెంపొందడానికి సహకరించింది. ఆదివారం మన సామూహిక సత్సంగాలు, ఓర్పు, సహనం, త్యాగం వంటి గుణాలు మనలో అలవడటానికే. మతం విభజిస్తే ఆధ్యాత్మికత ఒకటి చేస్తుందన్నారు. 
బాబూజీ బోధనలోని మరో ముఖ్యమైన అంశం, సకారాత్మకంగా ఆలోచించడం. మన పూర్వీకులు 'అబద్ధం చెప్పవద్దు' అని చెప్పడం వల్ల మన ఊహ, ఆలోచన అంతా అబద్ధం పైనే ఉండటం వల్ల, నిజం చెప్పడం అలవాటు కాలేదు. పూర్వం బోధనాలన్నీ మనం ఏమి చేయకూడదో అన్న అంశాన్ని నొక్కి చెప్పాయి. కానీ బాబూజీ బోధనల్లోని సౌందర్యం అంతా వారి 'సకారాత్మక ఆలోచనలో' ఉంది. 'ఏం చేయకూడదో' కాకుండగా, 'ఏం చేయాలి' అన్నదాన్ని ఖచ్చితంగా చెప్పారు. ఆయన అందించిన దశనియమాలు చక్కని సకారాత్మక (పాజిటివ్) బోధనకు సరైన ఉదాహరణ. సకారాత్మకమైన ఆలోచనలు, భావాలు మనలోని సంకల్ప శక్తిని మనం చేయవలసిన పనిపై దృష్టి నిలిపేలా చేసి సత్ఫలితాలకు కారణమవుతాయి; నకారాత్మకమైన (నెగటివ్) లోచనలు 'అనవసరమైనదానిపై' దృష్టిని నిలిపేలా చేసి దుష్ఫలితాలకు కారణం అవుతాయి. 
అన్నిటికంటే ముఖ్యం, బాబూజీ బోధనలు అనేక రకాలుగా - వారి ప్రత్యక్ష బోధనల ద్వారా, వారి గ్రంథాల ద్వారా, వారి సంభాషణల ద్వారా, వారు భౌతికంగా లేకపోయినా వారి ప్రతినిధులైన, సహజమార్గ గురుపరంపరలోని  మాస్టర్లయిన పూజ్య పార్థసారథి రాజగోపాలాచారీజీ, పూజ్య కమలేష్ పటేల్ (దాజీ) ద్వారా, ఇంకా బాబూజీని అనుసరించడానికి ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న అనేక మంది అభ్యాసుల ద్వారా, బాబూజీ మహాసమాధి తరువాత కూడా మన లేఖిని మదర్ హెలీన్ పైరే  అందుకున్న విస్పర్ సందేశాల ద్వారా, ఆధ్యాత్మిక అనుభూతుల ద్వారా, ఇలా ఇంకా అనేక అసంఖ్యాకమైన మార్గాల ద్వారా వారి శిక్షణ మనం పొందుతూనే ఉన్నాం. 

(సేకరణ "స్పెషల్ పర్సనాలిటీ" సహజమార్గ పత్రిక 999 ప్రత్యేక సంచిక)

1 కామెంట్‌:

  1. శిక్షణ నడుస్తూనే ఉంది ! కొనసాగుతూనే ఉంది !! మన తయారీ నడుస్తూనే ఉంది అని చక్కగా గుర్తు చేసారు.

    రిప్లయితొలగించండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...