24, జనవరి 2024, బుధవారం

బాబూజీ ఆధ్యాత్మిక జీవనం

 


బాబూజీ ఆధ్యాత్మిక జీవనం 

బాబూజీ 1922 వ సంవత్సరంలో జూన్ 3 న గురుదేవులు లాలాజీ పాదాల చెంతకు  చేరి మొట్టమొదటిసారిగా  ప్రాణాహుతి ప్రసరణ స్వీకరించడం జరిగింది. దాని ప్రభావం చేత అలౌకిక వాతావరణంలోకి ప్రవేశించి, ఆ స్థితిని కూడా దాటి వెళ్ళిన అనుభూతిని చెందారు. ఈ స్థితి ఇలాగే కొన్ని రోజులు కొనసాగింది. 

గురుదేవుల రూపాన్ని హృదయంలో దర్శిస్తూ ధ్యాన సాధన ప్రారంభించారు. ఈ సంకల్పం వారిలో సహజంగా స్వాభావికంగా తనంతట తానుగా కలిగింది. దానినే కొనసాగించారు. 

ఈ ధ్యానసాధనను మనస్ఫూర్తిగా అనుసరించిన ఆరు నెలలలోనే వారి హృదయమంతా వెలుగుతో నిండినట్లు ధ్యానంలో దర్శించారు. మరొక ఆరు నెలల తరువాత విచిత్రంగా వారి హృదయం 'ఓం' కార జపం చేయడం ప్రారంభించింది. దీన్నే 'అజపం' అంటారు. కొందరు ఈ ఆజపాన్ని హృదయంలో అనేకమార్లు మంత్రజపం చేసి సాధిస్తారు. ఇది కృత్రిమమైన పద్ధతి. గురువుకు ప్రాణాహుతి శక్తి ఉన్నప్పుడే నిజమైన 'అజపం' అవస్థ లభించగలదు. 

బాబూజీలో 'అజపం' సిద్ధించిన గర్వం కలుగగానే, గురుదేవులు వారిలో జ్ఞానోదయం కలుగజేసిన తరువాత ఆధ్యాత్మికంగా ఎంత అగాథ సాగరాన్ని ఈదవలసి ఉందో అర్థమయ్యింది. 

1924 లో చేతన-అచేతన పదార్థాల్లోనూ, అణువణువునా, అంతటా వ్యాపించి ఉన్న శక్తిని అనుభూతి చెందారు. పగటి వెలుగులా పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నడన్న సత్యాన్ని అనుభవించారు. 

ధ్యానకాలంలో వారి అంతరంగంలో జరిగిన మరొక మార్పు - పరమాత్మను గురించిన భావం తొలగిపోయి, ఆ స్థానంలో కేవలం తన గురుదేవులకు మాత్రమే స్థానం ఏర్పడటం, ఆ తరువాత వారికి వారి గురుదేవులు లాలాజీ తప్ప మరొకరు లేరు ఆయన జీవితంలో. వారిలో మరి ఏ భావానికి తయావుండేది కాదు. చివరికి లాలాజీ మాటల్లో బాబూజీ సాధించిన స్థితి ఎలాంటిదంటే: 

"నేను 'నీవుగా' అయిపోయాను. నీవు 'నేనుగా' అయిపోయావు. ఇక నేను 'నీవు' గాక, నీవు 'నేను' గాక వేరని ఎవ్వరూ అనలేరు."

బాబూజీ ప్రతి సంవత్సరం జరిపే ఆధ్యాత్మిక సమ్మేళనంలో లాలాజీ స్థితి వంటి బ్రహ్మైక్య స్థితిని సాధించారు. అటువంటి దివ్యానుభవం బాబూజీకి మూడు మార్లు జరిగింది. 

లాలాజీ బాబూజీకి ప్రాణాహుతి ప్రసరణ చేసిన మొదటి రోజు నుండి వారి స్మరణ ప్రారంభమైపోయింది. వారి సాధనలో మూడు పనులు ఒకేసారి జరుగుతూ ఉండేవి. 
1) గురుదేవుల నిరంతర స్మరణ 
2) గురుదేవులకున్న లయావస్థకు అనుగుణంగా వారిని వారు సవరించుకోవడం 
3) తాను ప్రస్తుతం ఉన్న స్థితిని తెలుసుకుని, దాని అనుభూతిని పొందడం. 

కొంతకాలం తన గురుదేవుల రూపం, మరికొంతకాలం తరువాత రూపం పోయి, భావనగా మారి, మరికొంతకాలం తరువాత ఆ భావన కూడా అదృశ్యమై కేవలం బీజమాత్రపు భావనగా మారిపోయింది. ఇవన్నీ బాబూజీ, సహజంగా పొందిన అనుభూతులే. చివరి స్థితిలో తానే 'మాస్టర్', ఈ శరీరం, అవయవాలు మొదలైనవన్నీ 'ఆయనవి' అన్న స్థితి. ఆ తరువాత స్థితిలో ఇవన్నీ కూడా తనవి కావని, తన ఆత్మ తన మాస్టర్ యందే ఉందన్న స్థితి. ఈ స్థితిలో శారీరక చేతన ఉండేది కాదు. ఆత్మ చేతన కూడా ఉండేది కాదు. సర్వత్రా, రాళ్ళల్లోనూ, చెట్లు, చేమల్లోనూ, కూడా దివ్యత్వాన్ని దర్శించగలుగుతూ, ముళ్లను సైతం హత్తుకోగలిగే స్థితి ఉండేది. 

1931, ఆగష్ట్ 15, ఉదయాన, బాబూజీ లోనికి అద్వితీయ శక్తిని, బలాన్ని, తన గురుదేవులు ప్రవేశింపజేసిన అనుభూతిని పొందడం జరుగుతుంది. ఆ రోజే లాలాజీ మహాసమాధి పొందిన రోజు. అందుకే లాలాజీ శక్తులన్నీ బాబూజీలో లయమవడం వారికి ఆ అనుభూతి కలిగింది. 

బాబూజీలో లాలాజీ లయమైన తదనంతరం, కొన్ని నెలల తరువాత, లాలాజీ బాబూజీకి ప్రాణాహుతి ప్రసరణ చేసినందువల్ల, తనలోని అణువణువులోనూ లాలాజీని దర్శించగలిగారు. ఇది అత్యంత ఉన్నత స్థితి. ఈ స్థితి కోసమే మహర్షులందరూ తపించేవారు. ఇది బాబూజీ తన మాస్టరులో సంపూర్ణంగా లయమైన స్థితి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...