22, జనవరి 2024, సోమవారం

యువ బాబూజీ

 


యువ బాబూజీ 

బాబూజీ వయసు 14 సంవత్సరాలున్నప్పుడే తనలో ఒక వింతైన ఘ్రాణ శక్తి పెంపొందడం గమనించారు. తాను ధరించే దుస్తులను కేవలం వాసనతో గుర్తు పట్టేసేవారు. ఈ శక్తి మరింతగా పెరిగి, మనిషి స్వభావాన్ని, అతని తత్త్వాన్నీ వారి శ్వాస నుండి వచ్చే వాసనతో కనిపెట్టేసేవారు. 

కొంతకాలం తరువాత వేదాంతం అంటే ఆసక్తి పెరిగి, మనిషి ఉనికికి సంబంధించిన సమస్యలకు పరిష్కారాలను తనదైన రీతిలో ఆలోచించడం ప్రారంభించారు. 15 సంవత్సరాల వయసులోనే వారికి తాత్త్విక గ్రంథాలను చదవాలన్న సంకల్పం కలిగింది. మిల్ అనే ఆంగ్లేయుడు వ్రాసిన "యుటిలిటేరియానిజం" అనే గ్రంథాన్ని తెప్పించుకున్నారు. దానిలో కొన్ని పుటలు చదవగానే వారికోక ఆలోచన వచ్చింది. "నేను గనుక ఈ విధంగా చదువుకుంటూ పోతే, నా సహజమైన ఆలోచనా ధోరణిపోయి, ఇతరుల భావాలు ఉటంకించడమే సరిపోతుంది" అన్న నిర్ధారణకు వచ్చి, ఆ గ్రంథాన్ని మూసేసి, తన స్వంత ఆలోచనా శక్తిని పెంపొందించుకోసాగారు. 

వారి చిన్నప్పటి నుండీ వారిని చూసినవారు, అది బంధువులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఆయనను 'మొద్దు' అనుకునేవారు. బాబూజీ సాధు స్వభావులు. పెద్దయిన తరువాత వారిని సరళ స్వభావం కలిగిన మనిషి అనేవారందరూ. 

వారి విద్యాభ్యాస సమయంలో మెస్మరిజం తెలిసిన స్నేహితుడు తన విద్యతో రోగాలు నయం చేస్తూండేవారు. అది చూసి దాని గురించి ఆలోచించడం ప్రారంభించారు. ఏకాగ్రతతో, ఆలోచనాశక్తి సహాయంతో శక్తిని కదిలిస్తారని, ఆ విద్య గురించి అర్థమయ్యింది. తాత్త్విక చింతనతో నిండిన మనస్సుతో, సాధారణంగా సరైన నిర్ధారణకు రాయగలిగే సమర్థత అప్పటికే ఏర్పడినందువల్ల, ఆ మనసు సహాయంతో వారు రోగుల వ్యాధులు నయం చేయడం ప్రారంభించారు. 

ఒకసారి పాఠశాలలో వారి హెడ్ మాస్టర్ గారికి తీవ్రంగా కడుపులో నొప్పి వస్తే, బాబూజీ తన బ్రొటనవేళ్ళతో ఆ హెడ్ మాస్టర్ బ్రొటనవేళ్ళు నొక్కుతూ, "మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు" అన్న ఆలోచనతో ' విద్యుచ్ఛక్తి ప్రసారం చేశారు. వెంటనే నొప్పి పోయి, ఆ హెడ్మాస్టర్ నిద్రలోకి జారుకున్నారు. అప్పటి నుండి స్కూల్లో పిల్లలకు గాని, పెద్దలకు గాని ఏదైనా అయితే, "రామచంద్ర వద్దకు వెళ్ళండి, ఆయన నయం చేస్తాడు" అనేవారు ఆ హెడ్ మాస్టర్. 

బాబూజీ చిన్నతనంలో మంచి హాకీ ఆటగాడు. తన క్లాసు జట్టుకు కెప్టెన్ గా ఉండేవారు. ఒకసారి స్కూల్లో తీరిక సమయంలో ఆడుకోవడానికి సామాను ఇవ్వమంటే, హెడ్ మాస్టర్ తిరస్కరించడం జరుగుతుంది. దానితో బాబూజీ ఆటలకు స్వస్తి చెప్పడం జరుగుతుంది. అది కూడా తన మంచికే జరిగిందనుకున్నారు బాబూజీ. 

బాబూజీ ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షలో ఉత్తీర్ణులై జనవరి 12, 1925 లో సహాజహానుపూరులో కోర్టులో గుమాస్తాగా ఉద్యోగంలో చేరారు. 19 సంవత్సరాల వయసులోనే వారికి భగవతి అనే యువతితో వివాహం జరిగింది. ఆమెకు కోపం ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో బాబూజీకి కూడా కోపం ఎక్కువగానే ఉండేది. కానీ, ఆమె సహచర్యంలో సహనం బాగా అలవడిందని అంటూండేవారు. అది వారి ఆధ్యాత్మిక పురోగతికి కూడా బాగా దోహదం చేసిందని అంటూండేవారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...