బాబూజీ ధ్యాన ముద్రలో
బాబూజీ - విశిష్ఠ ఆధ్యాత్మిక పరిశోధనలు - 1
ప్రతీ సమాజంలోనూ, ప్రతీ దేశంలోనూ, ప్రతీ నాగరికతలోనూ అందరూ 'మార్పును' ఆకాంక్షించేవారే. ఆ మార్పు ఎటువంటిదో తెలియకుండానే దాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తమలోనే ముందుగా మార్పు రావాలన్న విషయం మరచిపోయి, అక్కడ తప్ప అన్నీ చోట్లా, అన్నీ పరిసరాల్లోనూ, ఇతరుల్లోనూ ఈ మార్పును ఆశీస్తూంటారు. కానీ ఈ 'మార్పు' ఏమిటి, ఎక్కడి నుండి రావాలి; 'మార్పు' పరమార్థం ఏమిటి?
ఈ ప్రశ్నలకు సమాధానమే బాబూజీ స్పెషల్ పర్సనాలిటీగా, ఈ విశ్వంలోనే 'మార్పు' తీసుకురావడానికి అవతరించిన ప్రకృతి వరప్రసాదం. ప్రకృతి తనను తాను ప్రక్షాళనం చేసుకోడానికి, తిరిగి క్రమబద్ధం చేయడానికి తన పరికరాన్ని తానే తయారు చేసుకుంటుంది. పవిత్ర లక్ష్యాన్ని కార్యాన్వితం చేయడానికి అవసరమైనది, స్వఛ్ఛమైన, పవిత్రమైన మనస్సు గల మానవుడు. ఎందుకంటే మనస్సు లేనిదే ప్రణాళికా కార్యరూపం దాల్చలేదు. ఆ విశిష్ఠ వ్యక్తిత్వమే మన బాబూజీ మహారాజ్. ప్రకృతి ప్రణాళిక ప్రకారం 'మార్పును' సంభవింపజేయడానికి విచ్చేసిన స్పెషల్ పరసనాలిటీ - బాబూజీ మహారాజ్.
మానవేతర లోకాల్లో బాబూజీ ఏ విధంగా మార్పు తీసుకువస్తున్నదీ అవగాహన కాకపోయినా, మానవాళి పరిణామానికి వారే విధంగా తన జీవితాన్ని వెచ్చించినదీ కొంతవరకూ అవగాహన చేసుకోవచ్చను, అది కూడా కష్టమే అయినప్పటికీ.
సమాజం వ్యక్తుల సమూహమని, వ్యక్తి మారనిదే సమాజంలో మార్పు అసంభవమని అందరికీ తెలిసినదే. ఆ వ్యక్తిలో రావలసిన మార్పే ఆధ్యాత్మికంగా రావలసిన మార్పు. అటువంటి వ్యక్తిగత మార్పు కోసం కృషి చేసే సంస్థ శ్రీరామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్ సంస్థలు.
ప్రస్తుత మానవుడున్న కల్లోల స్థితి నుండి, మూల స్థితికి తీసుకువెళ్ళాడానికి అవసరమైన మార్పును సంభవింపజేస్తూ, మార్గదర్శకుడిగా ఉన్న సమర్థ గురువు శ్రీ బాబూజీ మహారాజ్. ఈ ఆధ్యాత్మిక మార్పును బాబూజీ ప్రాణాహుతి ద్వారా సమర్థవంతంగా సంభవింపజేస్తున్నారు. ప్రాణాహుతి అంటే మానవ పరిణామానికి ఉపయోగించే దివ్యశక్తి.
మానవుడు తన మూలనివాసాన్ని చేరుకునే సుగమమైన మార్గం లేక కొట్టూమిట్టాడుతున్న సమయంలో బాబూజీ, తన గురుదేవులైన పూజ్య లాలాజీ పునఃవ్యవస్థీకరించిన ప్రాణాహుతి ప్రక్రియను మెరుగుపరచి, ఆధునిక పరిస్థితుల్లో ఉన్న మానవునికనుగుణంగా, అందరూ అనుసరించగలిగే, సరళమైన సహజమైన ఆధ్యాత్మిక మార్గాన్ని చాలా జాగ్రత్తగా రూపొందించారు. ఇదే సహజమార్గ రాజయోగధ్యాన పద్ధతి. ఈ పద్ధతి ద్వారా మానవాళికి, సరైన సరళమైన జీవనవిధానం అందివ్వడమే గాక, ఆత్మసాక్షాత్కారం అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చారు.
ఇప్పటివరకూ మానవజన్మ ప్రయోజనం మోక్షసాధ్యనే అనుకుంటున్నా మానవాళికి, ఆ తరువాత ఎంత ఆధ్యాత్మిక యాత్ర చేయవలసి ఉన్నదో తన ఆధ్యాత్మిక పరిశోధనల ద్వారా వెల్లడించారు. ముక్తికీ, మోక్షానికీ గల వ్యత్యాసం ఏమిటో స్పష్టం చేశారు. మోక్షం అంటే తాత్కాలికంగా జననమరణాలు ఆగడం అని, మరలా జన్మ తప్పదని, ముక్తి అంటే ఇక భూమిపై పునర్జన్మ ఉండదని, స్పష్టతనిచ్చారు.
(సశేషం....)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి