3, జనవరి 2024, బుధవారం

స్పెషల్ పర్సనాలిటీ - బాబూజీ

 


స్పెషల్ పర్సనాలిటీ - బాబూజీ 

ఆధ్యాత్మిక రంగంలో ఇంతవరకూ మునులు, ఋషులు, మహర్షులు, సిద్ధులు సాధువులు, ఉంటారనే మనకు తెలుసు. అవసరమైనప్పుడు, "పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం ...." అని గీతలో చెప్పినట్లుగా, అవతార పురుషులు దిగివస్తారని కూడా మనం విన్నాం. ఇవన్నీ గతంలో జరిగినవే. సహజమార్గంతో ఒక నూతన ఆధ్యాత్మిక శకం ప్రారంభమయ్యింది. 
ప్రకృతి ప్రక్షాళన కోసం, ప్రకృతి ప్రణాళిక అమలు జరగడం కోసం, ప్రకృతే, అనగా సాక్షాత్తూ ఆ మూల కారణమైన దైవమే, మానవ రూపం ధరించి దిగి వచ్చిన వ్యక్తిత్వమే  "స్పెషల్ పర్సనాలిటీ". ఆ స్పెషల్ పర్సనాలిటీయే బాబూజీ మహారాజ్. ఆ దివ్య సంకల్పం ఏ విధంగా కార్యరూపం దాల్చింది అన్నదే "సహజమార్గం". 
ఆదిగురువులు లాలాజీ అవతరించడం, బాబూజీని తీర్చిదిద్దడం, 1944 వ సంవత్సరంలో బాబూజీ స్పెషల్ పర్సనాలిటీగా తయారవడం, బాబూజీ గురుదక్షిణగా తమ గురుదేవుల పేర 1945 వ సంవత్సరంలో శ్రీరామచంద్ర మిషన్ స్థాపించడం, ఇవన్నీ దైవ ప్రణాళిక ప్రకారం క్రమంగా జరిగిపోయాయి. వీటన్నిటి వివరాలు శ్రీరామచంద్ర మిషన్ సాహిత్యంలో స్పష్టంగా లభిస్తాయి. శ్రీరామచంద్రుని సంపూర్ణ రచనలు ఆరు సంపుటాలు, దివ్యసుధాధార, బాబూజీతో ప్రత్యుత్తరాలు, విస్పర్శ్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ 1944 ముఖ్యంగా చదువవలసిన ఉద్గ్రంథాలు. 
అవతారాలు ఏదో ఒక నిర్దిష్టమైన కార్యాన్ని నిర్వర్తించడానికి మాత్రమే వచ్చి, ఆ పని పూర్తయిన తరువాత ఆ అవతారం చాలించడం జరుగుతుంది. అలా వచ్చిన అవతార పురుషుడు మరొక అవతారాన్ని తయారు చేయలేడు. కానీ ఈ స్పెషల్ పర్సనాలిటీ 'వారిలాంటి' వ్యక్తిత్వాలను ఎందరినో తయారు చేయగలరు. 
విశ్వంలో మార్పును సంభవింపజేసి, మానవాళిని ఆధ్యాత్మికంగా పునరుజ్జీవింపజేసి, ప్రకృతి ప్రణాళికను యథాతథంగా అమలు జరుపడానికి, అత్యంత పరిశుద్ధ స్థితిలో స్థిరపడిన మనసు కలిగిన వ్యక్తి ప్రకృతికి అవసరం. అటువంటి ప్రకృతి కార్యాన్ని నెరవేర్చేందుకు సరైన పరికారంగా పరిణమించిన వ్యక్తిత్వమే  ఈ స్పెషల్ పర్సనాలిటీ. ఇంతకు మునుపెన్నడూ ఇటువంటి స్పెషల్ పర్సనాలిటీ ఆవిర్భావం జరగలేదంటారు. అంతే కాదు ఇంతకు పూర్వం భూమిని పవిత్రం చేసి వెళ్ళిన, శ్రీకృష్ణ భగవానుడు, మాతా రాధారాణి, శ్రీరామ కృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, చైతన్య మహాప్రభు, కబీరు వంటి   ఎందరో అవతార పురుషులు, మహాత్ములెందరో బాబూజీలో విలీనమై ఆయన ద్వారా ఇప్పటికీ ఈ సృష్టికి సేవలనందించడం మూలానే బాబూజీని స్పెషల్ పర్సనాలిటీ అనడానికి మరో ప్రధాన కారణం. 
సృష్టిలోని అన్ని రకాలైన శక్తులు, వినాశకర శక్తులు, నిర్మాణాత్మకమైన శక్తులు, ఇంతవరకూ వచ్చి వెళ్ళిన మహాత్ములందరూ ఈ స్పెషల్ పర్సనాలిటీ ఆధ్వర్యంలో, వారి ఆజ్ఞానుసారం సహకరిస్తూ పని చేయడం జరుగుతోంది. మరలా ఇటువంటి వ్యక్తిత్వం ఆవిర్భవించడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందట. 
ఈ స్పెషల్ పర్సనాలిటీ సృష్టి మూలం నుండి నేరుగా వచ్చిన వ్యక్తిత్వం. ఇటువంటి వ్యక్తిత్వం సృష్టిలో ఒక్కరే ఉంటారట. వారిని దర్శించాలని తపిస్తున్నవారెవరైనా, ఆయన సంకల్పానుసారం సూర్యచంద్రాదుల్లో గాని, సూక్ష్మరూపంలో గాని, ఎక్కడైనా, ఏ రూపంలోనైనా, ఏ సమయంలోనైనా, దర్శనమివ్వగలరు. ఈ ప్రపంచానికి సంబంధించిన కార్యాలే గాక, పిపీలకాది బ్రహ్మ పర్యంతమూ సమస్త జీవరాసులకు సంబంధించిన లోకాల్లోనూ కార్యనిర్వహణ నిమిత్తమైన అవతరించిన మహానుభావులు. ఈ వ్యక్తిత్వం భౌతిక రూపంలో ఒక ప్రదేశంలో ఉన్నప్పటికీ, విశ్వమంతటా, సర్వత్రా వ్యాపించి ఉంటారు. 
వారు నెరవేర్చవలసిన కార్యాలకు ఆదేశాలు ఆ "మూలం" నుండి జారీ అవుతాయి. వాటిననుసరించి వారు పని చేస్తారు. సృష్టిలో వారికి ప్రతీదీ అతి స్పష్టంగా కనిపిస్తుంది. వారికి తెలియకుండా ఈ సృష్టిలో ఏదీ జరగదు. త్రికాలాల్లోనూ పని చేయగల సమర్థులు, కాలాతీతులు, సుదూర భవిష్యత్తులోని పనికి కూడా ఈ స్పెషల్ పర్సనాలిటీ అప్పుడే బీజాలు వేయడం జరిగింది. వీరు నాటిన బీజప్రభావాలు కొన్ని ఇప్పటికే కార్యరూపం దాల్చి, చరిత్ర పుటల్లోకి చేరిపోయాయి. దీనికి నిదర్శనం బాబూజీ ఆంగ్లంలో రచించిన "రియాలిటీ ఎట్ డాన్(సత్యోదయం తెలుగులో)" అనే గ్రంథంలో "మై విజన్" అనే అధ్యాయం చదవాలని విజ్ఞప్తి. ఈ గ్రంథాన్ని వారు 1945 లో వ్రాయడం జరిగింది. 
ఈ స్పెషల్ పర్సనాలిటీని దర్శించాలని తీవ్ర ఆకాంక్ష గలవారెవరైనా, నేరుగా భగవంతుని ప్రార్థిస్తూ, ధ్యానంలో కూర్చోవచ్చు, వారికి దర్శనం తప్పక లభించే అవకాశం ఉంది. 
అంతటి మహోన్నత వ్యక్తిత్వం గురించి అక్షరాల్లో పెట్టే ప్రయత్నం దుస్సాహసమే. అయినప్పటికీ మన అవగాహన ఇంకా హృదయానికి గాక బుద్ధికి, పుస్తకాలకే పరిమితమై ఉండటం వల్ల వారిని ఈ విధంగానైనా దర్శించే ప్రయత్నమే ఈ చిరు ప్రయత్నం. 






1 కామెంట్‌:

  1. ఇంకా ఏమని చెప్పనూ... చెప్పవలసింది అంతా చక్కగా చెప్పారు. చదవ వలసిన పుస్తకాలు గురించీ చెప్పారు. పూజ్య దాజీ గాఋ కూడా మొన్న మన స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మన హార్ట్ ఫుల్ నెస్ మగజినె లో మహాత్ములు బ్రిటర్ వరల్డ్ నుండి ఇక్క భూమీద విషయాలను ఒక కంట వీక్షిస్తున్నారని అక్కడ నుండి వారు ఆదేశాల మేరకు ఇక్కడ ఫలితాలుంటాయి అనీ చెప్పారు. ఇక్కడ మనచేతుల్లో ఏమీ లేదు అన్నట్లు గా ఉంది అది. ఇంకా ముందుకు సాగండి.

    రిప్లయితొలగించండి

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...